గులాబీ గ్రేటర్‌.. కేసీఆర్‌ నిలువెత్తు కటౌట్లు..నిబంధనలు వర్తించేనా..!?

ABN , First Publish Date - 2021-10-22T17:22:21+05:30 IST

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ప్లీనరికి నగరం ముస్తాబవుతోంది. గ్రేటర్‌ను గులాబీమయంగా...

గులాబీ గ్రేటర్‌.. కేసీఆర్‌ నిలువెత్తు కటౌట్లు..నిబంధనలు వర్తించేనా..!?

  • ఫ్లెక్సీలు, తోరణాల ఏర్పాటు
  • ప్రతిష్టాత్మకంగా ద్విదశాబ్ది వేడుకలు
  • నగర అలంకరణపై ప్రత్యేక దృష్టి
  • నిబంధనల ఉల్లంఘన 
  • జీహెచ్‌ఎంసీ పట్టించుకునేనా..?


హైదరాబాద్‌ సిటీ : టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ప్లీనరికి నగరం ముస్తాబవుతోంది. గ్రేటర్‌ను గులాబీమయంగా మార్చేందుకు అధికార పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. పార్టీ ఆవిర్భవించి 20 యేళ్లు కావడం.. ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయంగా  ఏర్పాటై.. లక్ష్యాన్ని ముద్దాడిన టీఆర్‌ఎస్‌ ఈ యేడాది ప్లీనరీని ప్రత్యేకంగా భావిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ బల నిరూపణకు ఈ సందర్భాన్ని వేదికగా మార్చుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 15వ తేదీన పది లక్షల మందితో వరంగల్‌లో ద్విదశాబ్ది విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయించారు. అంతకుముందు ఈ నెల 25న హైదరాబాద్‌లోని హైచ్‌ఐసీసీలో ప్లీనరీ జరుగనుంది. దీంతో నగర అలంకరణపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాయి.


తెలంగాణ భవన్‌లో నియోజకవర్గాల వారీగా జరుగుతోన్న సమావేశాల్లోనూ అగ్ర నాయకులు అలంకరణకు సంబంధించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. నగరమంతా గులాబీమయంగా మారాలని, ఎక్కడ చూసినా తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు కనిపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌- జూబ్లీ చెక్‌పోస్ట్‌ మార్గంలో కేసీఆర్‌ నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేశారు. పలు ఏరియాల్లో అధినాయకుడి ఫొటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బస్‌ షెల్టర్లు, టాయిలెట్ల యాడ్‌ స్పేస్‌నూ టీఆర్‌ఎస్‌ పార్టీ బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది.


ఫ్లెక్సీలు,  కటౌట్లు ఏర్పాటు చేయగానే.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారని ఇటీవలి సమావేశాల్లో పార్టీ శ్రేణులు నేతల దృష్టికి తీసుకురాగా.. మేం చూసుకుంటాం.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండు, మూడు రోజులు తొలగించకుండా  సూచిస్తామని చెప్పినట్టు తెలిసింది. దీంతో కొంత కాలంగా ఫ్లెక్సీల్లో ఫొటోలు కనిపించడం లేదన్న బాధతో ఉన్న నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ఫ్లెక్సీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. అలంకరణకు సంబంధించి తోరణాలు, పార్టీ జెండాలు, ఇతరత్రా మెటిరీయల్‌ను డివిజన్ల వారీగా పంపించామని ఓ నాయకుడు తెలిపారు. ప్లీనరీకి హాజరయ్యే పురుషులు గులాబీ రంగు షర్ట్‌, మహిళలు గులాబీ రంగు చీర ధరించి రావాలనీ సూచించినట్టు చెప్పారు. 


నిబంధనలు వర్తించేనా..? 

సిటీ లుక్‌ దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో నగరంలో ఫ్లెక్సీలు, గోడ ప్రతులు, హోర్డింగ్‌ల ఏర్పాటును నిషేధిస్తూ పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. దుకాణాల బోర్డులు కూడా 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో.. నిర్ణీత విస్తీర్ణం మించవద్దన్న నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో యేడాదిన్నరగా నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటు తగ్గింది. పార్టీ సమావేశాలు, పాదయాత్రల సందర్భంగా ఏర్పాటు చేస్తోన్న ఫ్లెక్సీలు, కటౌట్లను జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ట్విట్టర్‌లో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా జరిమానాలూ విధిస్తున్నారు. అధికార పార్టీ ప్లీనరీ నేపథ్యంలో యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాటు చేస్తోన్న ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగిస్తారా, జరిమానా విధిస్తారా, పార్టీ సమావేశాల్లో చెప్పినట్టు.. ఉన్నత స్థాయి ఆదేశాలతో రెండు, మూడు రోజులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2021-10-22T17:22:21+05:30 IST