స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-15T04:59:46+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు జిల్లా అధికారయంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరు రోజులుగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

 - ఉదయం 10.30 గంటలకు మంత్రి ‘గంగుల’ పతాకావిష్కరణ 

- వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి ప్రశంసాపత్రాలు, మెమొంటోల ప్రదానం 

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 14: స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు జిల్లా అధికారయంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరు రోజులుగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంటింటికి జెండాల పంపిణీ, ఫ్రీడం ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, జంక్షన్లు, చారిత్రక కట్టడాలను జాతీయ జెండా రంగులతో విద్యుద్దీపాల అలంకరించారు. సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ను ముస్తాబు చేశారు. సీపీ సత్యనారాయణ, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ ఆదివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరేడ్‌ మైదానంలో ఉదయం 10.30 గంటలకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రారంభించి 10.32 నిమిషాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.  10.40 నుంచి మంత్రి గంగుల కమలాకర్‌ ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖలస్టాల్స్‌ పరిశీలన, వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి ప్రశంసాపత్రాలు, మెమొంటోలు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా మైదానానికి నలువైపులా జాతీయ జెండాలను అమర్చి, వేదికకు ఇరువైపులా వీఐపీలు, అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు కూర్చొని స్వాతంత్య్ర దినోత్సవాన్ని తిలకించేందుకు షామియానాలు, కుర్చీలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వర్షం కురిస్తే కలెక్టరేట్‌ ఆడిటోరియంలో వేడుకలను జరిపేందుకు అక్కడ కూడా ఏర్పాట్లు చేసి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-15T04:59:46+05:30 IST