దళిత పంచాయతీలతోనే ‘గ్రామస్వరాజ్యం’

ABN , First Publish Date - 2021-03-04T06:06:22+05:30 IST

కులవ్యవస్థలో దళితులు అత్యంత బాధితులుగా, వెనకబడినవారిగా వున్నారు. రాజకీయంగా గ్రామాల్లో దళితులు ఎలాంటి స్వేచ్ఛ...

దళిత పంచాయతీలతోనే ‘గ్రామస్వరాజ్యం’

కులవ్యవస్థలో దళితులు అత్యంత బాధితులుగా, వెనకబడినవారిగా వున్నారు. రాజకీయంగా గ్రామాల్లో దళితులు ఎలాంటి స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం లేకుండా బతుకుతున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనేక దశాబ్దాల పిదప కూడా ఊరు-వాడ అనే విభజన స్పష్టంగా కొనసాగుతూనే వుంది. ఊరిలో ఎస్సీ వాడ ఎప్పుడూ దూరంగానే ఉంది. ఎస్సీ రిజర్వుడు గ్రామ పంచాయతీలలో వారు సర్పంచులుగా, ఎంపిటిసిలుగా గెలిచినా కూడా ఎలాంటి అధికారం లేనివాళ్లుగా, ఊరి పెద్దల కింద నలిగి పోతున్నారు. అందుకే తండాలను గ్రామ పంచాయతీలను చేసిన తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారమే ప్రతి ఎస్సీ కాలనీని కూడా గ్రామ పంచాయతీ చేయాలని ద్రవిడ బహుజన సమితి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమిస్తున్నది.


మాల మాదిగ కులాలు, వాటి ఉపకులాలు గ్రామ సీమల్లో తీవ్రమైన కుల వివక్షకు, అంటరానితనానికీ గురవుతున్నారని, విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్లు కనిపించట్లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ తెల్లవాళ్లతో పోరాడాడు. విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కావాలని పోరాడాడు. రాజకీయంగా అగ్రకులాల చేతిలో నలిగిపోతున్నారు కాబట్టి దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ఉండాలని బ్రిటీషువాళ్లు నియమించిన అన్ని కమీషన్ల ముందు తన వాదనలు వినిపించాడు. ప్రత్యేకంగా వినతి పత్రాలు సమర్పించాడు. 1918 నుండి 1946 వరకు ఆ పోరాటం చేశాడు. గాంధీ గ్రామాలను స్వర్గసీమలని రొమాంటిసైజ్ చేస్తూ, గ్రామ స్వరాజ్యం పేర సవర్ణ కులాల పెత్తనాన్ని నిలబెట్టే ఉద్యమం చేస్తోన్న కాలంలో, అంబేద్కర్ గ్రామాలు అంటరానివాళ్లకు జైలు గదులుగా మారాయని విమర్శించాడు. ఉమ్మడి గ్రామ పంచాయతీలలో దళితు లకు ఎలాంటి గౌరవం, విలువా ఉండదని, దళితులకు ప్రత్యేక గ్రామాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ఆశయాన్ని సాధించడానికే ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయాలని ప్రభుత్వాన్ని ద్రవిడ బహుజన సమితి కోరుతున్నది. 


దేశంలో అత్యున్నత అధికార వ్యవస్థ పార్లమెంటు. ఆఖరి అధికార వ్యవస్థ గ్రామ పంచాయతీ. అధికార వికేంద్రీకరణకు ఆఖరి రూపం కూడా గ్రామ పంచాయతియే. పంచాయతీల ద్వారా గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది, పాలనా వ్యవస్థలో గ్రామ ప్రజలను భాగస్వాములను చేయాలన్నది పంచాయతీ రాజ్ చట్టం ఉద్దేశం. కానీ ఎస్సీ కాలనీలను గ్రామంలో అంతర్భాగంగా పరిగణించడం వల్ల ఆధిపత్య కులాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి దాపురించింది. రిజర్వుడు గ్రామాల్లో సర్పంచిగా గెలిచిన దళితునికి చెక్ పవర్ లేకుండా చేస్తున్నారు. పేరుకే సర్పంచి. అధికారమంతా ఆధిపత్య కులాల దగ్గరే వుంటున్నది. కాస్త స్వతంత్రించి పని చేస్తున్న దళిత సర్పంచులను వేధించి, పోలీసు కేసుల పాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి గానీ, లేదా తన పార్టీ నుంచి గానీ దళిత సర్పంచికి సరైన సహకారం లభించటం లేదు. రాష్ట్రంలో సస్పెండ్ చేయబడిన సర్పంచుల్లో డెబ్బయి శాతంకు పైగా దళిత సర్పంచులే వున్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా 2100 మంది ఎస్సీ సర్పంచులున్నారు. ఒక నియోజక వర్గంలో వంద గ్రామాలుంటే 21 మంది మాత్రమే సర్పంచులు అవుతున్నారు. కానీ వంద గ్రామాలకు వంద ఎస్సీ కాలనీలున్నాయని అనుకుంటే, ప్రతి ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీ అయితే, వందమంది సర్పంచులు వుంటారు. 


అభివృద్ధిపరంగా ఎస్సీ కాలనీ పూర్తిగా ఆధిపత్య కులాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అభివృద్ధి పథకాలు గానీ అభివృద్ధి పనులు గానీ అరకొరగానే ఎస్సీ కాలనీకి అందుతున్నాయి. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు దళితుల సాధికారత కోసం కేటాయిస్తే, ఊరి ఆధిపత్య రాజకీయ వర్గాలు ఆ నిధులను తాము నివసించే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి డైవర్టు చేస్తున్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేశారు. కానీ మిషన్ భగీరథ పైపులు మాత్రం ఎస్సీ కాలనీలకు చేరలేదు. నల్లాలు, వీధి లైట్లు, మురికి కాల్వలు లేని కాలనీలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఓటర్లుగా తప్ప మరే రకమైన విలువా దళితులకు లేదు.


ఎస్సీ కాలనీల నుంచి రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవాళ్లను అణచివేసే కుట్రలు భయంకరంగా జరుగుతున్నాయి. ఎక్కడ రాజకీయంగా తమకు పోటీ అవుతారో అనే భయంతో కొన్నిచోట్ల దళిత నాయకులను హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి. ప్రశ్నించే యువకులను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఉదంతాలెన్నో ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయటమే. 


మార్చి 30, 2018 నాడు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారమే తండాలు గ్రామ పంచాయతీలయ్యాయి. ఆధిపత్య కులాల నుంచి స్వేచ్ఛ పొంది అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఈ చట్టంలోని సెక్షన్ 2ఎ ప్రకారం ఏదైనా ఒక గ్రామాన్ని విభజించి ఒకటి లేదా ఎక్కువ కొత్త గ్రామాలను ఏర్పాటు చేసే అధికారం ఈ చట్టానికి ఉంది. అలాగే రెండు లేదా అంతకన్న ఎక్కువ గ్రామాలను కలిపి ఒకే గ్రామంగా మార్చే అధికారం ఈ చట్టానికి ఉంది. ఇంకా: ఏ గ్రామ పరిధినైనా పెంచే అధికారం; తగ్గించే అధికారం; ఏ గ్రామ సరిహద్దులనైనా, గ్రామం పేరునైనా మార్చే అధికారం; ఒక గ్రామాన్ని లేదా గ్రామంలో కొంత భాగాన్ని ఏ నగర పంచాయతీలోనైనా, మున్సిపాలిటీలోనైనా, మున్సిపల్ కార్పోరేషన్లోనైనా కలిపే అధికారం; ఈ చట్టం పరిధి నుంచి ఏ గ్రామాన్నైనా మినహాయించే అధికారం; ఒక గ్రామ విస్తీర్ణాన్ని సవరించే అధికారం ఈ చట్టానికి ఉన్నాయి. ఈ చట్టం మూడు వందల వరకు జనాభా గల నివాస ప్రాంతాన్ని గ్రామ పంచాయతీగా నిర్ణయించింది. జనాభా ఇంతే వుండాలని రూలేమి లేదు. కానీ మూడు వందల లోపు జనాభా గల పంచాయతీలో ఐదు వార్డులుండాలని చెప్తుంది. గ్రామాల మధ్య ఇంత దూరం నిర్దిష్టంగా ఉండాలని నియమం లేదు. 


ఈ చట్టం ప్రకారం తండాల మాదిరిగానే ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయవచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే దళితులకు గొప్ప మేలు జరుగుతుంది. చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ చెప్పారు. పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో ఉద్యమించి లంబాడీలు సాధించుకున్నారు. ఈ రెండు ఉద్యమాల స్ఫూర్తితో ప్రతి ఎస్సీ కాలనీలోని వ్యక్తి నడుం బిగించాలి. మనం పోరాడితే తప్పక సాధిస్తాం. 

చెరిపల్లి ఆనంద్

రాష్ట్ర ఉపాధ్యక్షులు, ద్రవిడ బహుజన సమితి

Updated Date - 2021-03-04T06:06:22+05:30 IST