గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్

ABN , First Publish Date - 2020-06-02T15:53:13+05:30 IST

గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ చేసుకొనే విధానాన్ని పరిశీలిస్తున్నాం..

గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్

సులభతరంగా ఇసుక

‌త్వరలోనే సీఎంకు నివేదిక ఇచ్చి అనుమతి తీసుకొంటాం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఇసుక నూతన విధానంపై సమీక్ష 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ చేసుకొనే విధానాన్ని పరిశీలిస్తున్నాం. దీనిని త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదించి అనుమతి తీసుకొన్న తర్వాత అమలులోకి తీసుకొస్తామని రాష్ట్ర మైనింగ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాపరిషత్తు మీటింగ్‌ హాల్‌లో ఇసుక నూతన విధానంపై ఆయన జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. ఇకపై ఇసుక డోర్‌ డెలివరీ సాయంత్రం 6 గంటల వరకే అనుమతిస్తాం. జిల్లాలో రానున్న వర్షాకాలంలో కోసం 10 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. ఇప్పటివరకు కేవలం 2.165 లక్షల టన్నులు మాత్రమే నిల్వ చేశారు. మిగిలిన ఇసుకను సైతం మరో 20 రోజుల్లో స్టాక్‌  చేయాల్సి ఉందన్నారు.


వర్షాకాలం స్టాక్‌ కోసం పట్టాభూముల్లో 24 గంటల పాటు ఇసుక ఆపరేషన్లకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. వాగులు, వంకల్లో నిబంధనల ప్రకారం ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తీసుకోవచ్చు. అయితే వాటి ద్వారా తీసిన ఇసుక నిల్వ చేయడం, లారీలకు విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ నూతన ఇసుక విధానం వలన సామాన్యుడికి ఇసుక సులభతరంగా లభించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. గత ప్రభుత్వ హాయంలో ఇసుక అక్రమాలు జరిగాయన్నారు. అప్పట్లో ఉండవల్లిలో జరిగిన అక్రమ తవ్వకాలకు గ్రీన్‌ ట్రైబ్యునల్‌ రూ.100 కోట్ల జరిమాన కూడా విధించిందన్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ చేసుకొందామని ప్రయత్నిస్తే నోస్టాక్‌ అని వస్తోందని పలువురు చెబుతున్నారు. దీనిపై కూడా త్వరలోనే పరిష్కారం కనుగొంటామని మంత్రి చెప్పారు. ఇసుక స్టాక్‌ పాయింట్లను రీచ్‌కు 10 కిలోమీటర్ల లోపులోనే ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ఉపాధి హామి, నాడు - నేడు పనులకు ఇసుక కొరత లేకుండా చేస్తామన్నారు. పట్టాభూముల్లో అనుమతులు తీసుకొని ఇసుక తవ్వకాలు జరపకపోతే వాటిని రద్దు చేస్తాం.


రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఇసుక లారీల జీపీఎస్‌ ట్రాకింగ్‌ని 4జీ నెట్‌వర్కులతో మరింత సమర్థంగా నిర్వహిస్తామన్నారు.  సచివాలయాల్లో టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా జేసీలు ఇసుక ఆపరేషన్‌పై  రోజూ పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరిత, మైనింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ వెంకటరెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, శాసనసభ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, బ్రహ్మనాయుడు, నాగార్జున, కాసు మహేష్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, నంబూరి శంకరరావు, మద్ధాళి గిరిధర్‌, మహమ్మద్‌ ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్‌, కిలారి రోశయ్య, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మైనింగ్‌ డీడీ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఈబీ రూరల్‌ అదనపు ఎస్‌పీ షరీఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T15:53:13+05:30 IST