Abn logo
Oct 18 2021 @ 22:56PM

పర్యవేక్షణ అన్నారు.. పస లేకుండా చేశారు!

పేరుకే డీఎల్‌డీవో పోస్టులు

డివిజన స్థాయిలో అభివృద్ధి పర్యవేక్షణకంటూ ప్రచారం

ఏడాదైనా సొంత కార్యాలయమూ లేదు!

విధులపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

అంతా ఇనచార్జ్‌లే కావడంతో ఫలించని ప్రయోగం


అంతన్నారు.. ఇంతన్నారు.. ఈ పోస్టులతో ఎంతో మేలన్నారు.. కానీ చివరకు ఆ అధికారులకు కుర్చీ కూడా లేకుండా చేశారు. ఏడాది క్రితం కొత్తగా ఏర్పాటు చేసిన డివిజన స్థాయి అభివృద్ధి అధికారి (డీఎల్‌డీవో) పోస్టులు పేరుకే పరిమితమయ్యాయి. ఏ ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారో అది ఏ కోశానా కనిపించడం లేదు. ఈ పోస్టులను సృష్టించాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నామమాత్రంగా మిగిలిపోయాయి. పోస్టులు సృష్టించి అందులో అధికారులను నియమించారే తప్ప వారు ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? అసలు వారికి కార్యాలయాలు ఉన్నాయా? సిబ్బందిని నియమించారా? అనుకున్న ఫలితాలు కనిపిస్తున్నాయా? వంటి విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమే తమకు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో జిల్లా స్థాయిలో కూడా చూసీచూడనట్లు ఉంటున్నారు.

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)


గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పర్యవేక్షించడంతో పాటు డివిజన స్థాయిలో అభివృద్ధి పనులను మానిటరింగ్‌ చేసందుకు ప్రభుత్వం డీఎల్‌డీవో పోస్టును సృష్టించింది. రెవెన్యూ వ్యవస్థకు ఏ విధంగానైతే ఆర్‌డీవోలు ఉన్నారో అదేవిధంగా డెవల్‌పమెంట్‌కు కూడా ఉండాలన్న ఉద్దేశంతో సీనియర్‌ ఎంపీడీవోలను డీఎల్‌డీవోలుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డీఎల్‌డీవోలు నేరుగా జాయింట్‌ కలెక్టర్‌కు (అభివృద్ధి) రిపోర్టు చేసుకుంటారు. డివిజన స్థాయిలో డీఎల్‌డీవోలు కీలకంగా వ్యవహరిస్తారని ఈ పోస్టులను ఏర్పాటు చేసినప్పుడు తెలిపారు. ఆ క్రమంలోనే గతేడాది అక్టోబరు 23న ప్రతి రెవెన్యూ డివిజనకు ఒక డీఎల్‌డీవోను నియమించారు. 


కుర్చీ లేదు.. సిబ్బందీ లేరు..


జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లకు ఐదుగురు సీనియర్‌ ఎంపీడీవోలను డీఎల్‌డీవోలుగా నియమించారు. పలు మండలాల్లో ఎంపీడీవోలుగా పని చేస్తున్న వారికే ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు తప్ప రెగ్యులర్‌గా ఎవరినీ నియమించలేదు. కావలి డివిజనకు నెల్లూరు రూరల్‌ ఎంపీడీవో వసుమతి, నాయుడుపేట డివిజనకు టీ వసుంధర, ఆత్మకూరుకు చేజర్ల ఎంపీడీవో వీవీ శేషయ్య, నెల్లూరు డివిజనకు పొదలకూరు ఎంపీడీవో సుజాత, గూడూరు డివిజనకు కలిగిరి ఎంపీడీవో పీ సుబ్రహ్మణ్యంలను ఇనచార్జ్‌ డీఎల్‌డీవోలుగా నియమించారు. ఏడాది క్రితం వీరిని నియమించినా ఇంతవరకు కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. రెవెన్యూ డివిజన హెడ్‌క్వార్టర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలోనే డీఎల్‌డీవో కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలని భావించినా అదీ జరగలేదు. ఎక్కడైనా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నా, ఒక వ్యవస్థ పనిచేయాలన్నా అందులో తప్పనిసరిగా సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పటికీ డీఎల్‌డీవోకు సిబ్బందిని కేటాయించలేదు. ప్రభుత్వం పేర్కొన్న ఉత్తర్వుల ప్రకారం ఒక సూపరింటెండెంట్‌, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌, ఒక టైపిస్టు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మరో ఇద్దరు ఆఫీసు సబార్డినేటర్లు ఉండాలి. అయితే వీరెవరూ లేకపోవడంతో డీఎల్‌డీవో పోస్టులు ఏకాకిగా మారాయి. డీఎల్‌డీవోలుగా బాధ్యతలు తీసుకున్న వారంతా మండలాల రెగ్యులర్‌ అధికారులు కావడంతో వారికి అక్కడే పని ఎక్కువగా ఉంటోంది. ఎప్పుడైనా జిల్లా ఉన్నతాధికారులు పని చెబితే దానిని ఆయా ఎంపీడీవో కార్యాలయంలోని సిబ్బంది చేతనే చేయిస్తున్నారు. అంతకుమించి గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయడం గానీ, గ్రామ, మండల స్థాయి అధికారులతో సమీక్షించడం గానీ చేయడం లేదు. కాగా ఈ పోస్టు ఒకటుందని ఇప్పటికీ చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. 


డీఎల్‌డీవోల విధులు ఇవీ..


రెవెన్యూ డివిజన స్థాయిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం తరపున అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అభివృద్ధి కార్యాక్రమాలు పూర్తి పారదర్శకంగా, కచ్చితంగా జరిగేలా చూస్తారు. 

మండల, గ్రామస్థాయిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు. గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజామోదం పొందేందుకు కృషి చేస్తారు. 

జనరల్‌ బాడీ మీటింగ్‌లకు, మండల పరిషత సమావేశాలకు హాజరవుతారు. ఎప్పటికప్పుడు మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మరింత మెరుగ్గా వారు పనిచేసేందుకు సహాయపడతారు. మండల, గ్రామ స్థాయిలో వీలున్నప్పుడల్లా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. 

గ్రామ, మండల స్థాయిలో జరిగే ప్రతీ అభివృద్ధి పనిని ధ్రువీకరిస్తారు. ఎంపీడీవోలు పంపే ప్రతిపాదనలను ధ్రువీకరించి ఉన్నతాధికారులకు పంపుతారు. గ్రామ, మండల స్థాయిలో జరిగే ప్రతీ అభివృద్ధి పనికి సంబంధించి లావాదేవీలను ఎప్పటికప్పుడు రిపోర్టు తెప్పించుకొని పర్యవేక్షిస్తారు. 

ప్రభుత్వ పథకాలపై ప్రతీ రెండు నెలలకు ఒకసారి అవగాహన తరగతులు నిర్వహించి ఎంపీటటీసీలు, ఎంపీపీలను చైతన్య పరుస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని భర్తీ చేసే ప్రక్రియ చేపడతారు. ఎంపీపీలు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులకు మధ్య అనుసంధాన అధికారిగా వ్యవహరిస్తారు.