ధాన్యం తూకం.. అన్నదాతకు భారం

ABN , First Publish Date - 2022-05-27T05:51:15+05:30 IST

భూమిని నమ్ముకొని ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు పంటను విక్రయించుకోవడానికి తిప్పలు తప్పడం లేదు. నారు పోసి పంట పండించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చినా పడరాని పాట్లు పడుతున్నారు.

ధాన్యం తూకం.. అన్నదాతకు భారం

- క్వింటాల్‌కు రూ.40 నుంచి 50 హమాలీ చార్జీల వసూలు 

- నాలుగేళ్లుగా అందని వైనం 

- తాలు పేరిట అదనంగా క్వింటాల్‌కు 6 కిలోల వరకు ధాన్యం కోత

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

భూమిని నమ్ముకొని ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు పంటను విక్రయించుకోవడానికి తిప్పలు తప్పడం లేదు. నారు పోసి పంట పండించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చినా పడరాని పాట్లు పడుతున్నారు. అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.  ఎట్టకేలకు యాసంగి ధాన్యం కొనుగోలు  ప్రారంభించినా రవాణా లేక కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీనికి తోడు తాలు పేరిట ధాన్యం తరుగు, హమాలీ చార్జీల భారాన్ని   రైతులు మోయాల్సి వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో అదనంగా ఐదు నుంచి ఆరు కిలోల వరకు తూకం వేస్తున్నారు. మరోవైపు తేమ, తాలు పేరుతో మిల్లుల వద్ద ధాన్యం దించుకోకుండా మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. లారీకి పది బస్తాల వరకు కోత విధిస్తున్నారు. ఈ భారాన్ని కూడా రైతులపైనే వేస్తున్నారు.  కొనుగోళ్లు కూడా వేగంగా జరగకపోవడంతో కేంద్రాల వద్ద 10 నుంచి 15 రోజులపాటు పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నారు. 

సకాలంలో అందని హమాలీ చార్జీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనుగోలు కేంద్రాల వ్దద హామాలీలకు చెల్లించాల్సిన కూలి డబ్బులు సకాలంలో రావడం లేదు. దీంతో రైతుల నుంచి ముందుగానే   వసూలు చేస్తున్నారు. హమాలీ డబ్బులు రైతులు ముందుగా చెల్లించాలని,  తరువాత రైతులకు చెల్లిస్తామని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే నాలుగేళ్లుగా తిరిగి చెల్లించిన దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. జిల్లాలో క్వింటాల్‌ ధాన్యం తూకం వేసి లోడ్‌ చేసే హమాలీలు రైతుల వద్ద రూ. 40 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులకు తూకం భారం తప్పడం లేదు. హమాలీల కొరతతో తప్పని పరిస్థితుల్లో అడిగినంత చెల్లిస్తున్నారు. 

పేరుకుపోతున్న ధాన్యం 

 జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రాలవద్ద ధాన్యం కుప్పలతో అకాల వర్షానికి రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే సిరిసిల్ల, కోనరావుపేట, చందుర్తి, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, రుద్రంగి మండలాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి నష్టపోయారు. జిల్లాలో యాసంగిలో 1.44 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అత్యధికంగా వరి 1.30 లక్షల ఎకరాల్లో వేశారు. ధాన్యం దిగుబడి 2.97 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనా వేసి 253 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,25,672 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.  ఐకేపీ ద్వారా 54 కేంద్రాల్లో 25,618 మెట్రిక్‌ టన్నులు, 184 సింగిల్‌ విండో కేంద్రాల ద్వారా 91,758 మెట్రిక్‌ టన్నులు, పది డీసీఎంస్‌ కేంద్రాల ద్వారా 4,622 మెట్రిక్‌ టన్నులు, నాలుగు మెప్మా కేంద్రాల ద్వారా 1,958 మెట్రిక్‌ టన్నులు మూడు మార్కెట్‌ యార్డుల ద్వారా 1,715 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. 18,514 మంది రైతుల నుంచి రూ.246.32 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా 10,078 మంది రైతులకు రూ.119.62 కోట్లు చెల్లించారు. 

 


Updated Date - 2022-05-27T05:51:15+05:30 IST