ధాన్యం కొనుగోళ్లు పరిశీలిస్తున్న డీఎస్వో వెంకటేశ్వర్లు
పెద్దఅడిశర్లపల్లి, మే24: ధాన్యం సేకరణతో పాటు కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఇప్పటికే కాంటావేసిన ధాన్యాన్ని లారీల కోసం వేచి చూడకుండా ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులు వడ్లను పూర్తిగా తూర్పాల పట్టిన తర్వాతే ఖచ్చితమైన నిర్ణీత తేమ శాతాన్ని నిర్థారించి మిల్లులకు పంపాలన్నారు. రైతులు సైతం ఓపికతో వడ్లను ఆరబెట్టి నాణ్యతమెరుగు పరచాలని కోరారు. మిల్లుల వద్ద ధాన్యం లోడ్లు ఎట్టి పరిస్థితిలోనూ ఆగకూడదన్నారు. రైతులకు డబ్బులు సైతం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. ఆయన వెంట జిల్లా సహాయ పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం, దేవరకొండ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునం దన్, సీఎస్ ఆర్ఐ హబీబ్ తదితరులు ఉన్నారు.