సరిహద్దులు దాటుతున్న ధాన్యం

ABN , First Publish Date - 2021-11-28T04:54:56+05:30 IST

ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం మిల్లులకు కేటాయిస్తున్న ధాన్యం విషయంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం వానాకాలం ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రారంభించినా, అనుకున్న స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు.

సరిహద్దులు దాటుతున్న ధాన్యం
గద్వాల జిల్లా నుంచి ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండగా సీజ్‌ చేసిన ధాన్యం లారీలు(ఫైల్‌)

సీఎంఆర్‌కు కేటాయించిన వడ్లను కర్ణాటకకు తరలిస్తున్న మిల్లర్లు

ప్రస్తుతం రైతులు తరలిస్తుండటంతో అనుమానం రాదనే భావన

ఆ ధాన్యానికి బదులు రీసైక్లింగ్‌ చేసిన రేషన్‌ బియ్యం అప్పగింత

పెబ్బేరు, కొత్తకోట, గద్వాల నుంచి యథేచ్ఛగా తరలింపు

చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు


ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం మిల్లులకు కేటాయిస్తున్న ధాన్యం విషయంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం వానాకాలం ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రారంభించినా, అనుకున్న స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. వర్షం కురుస్తుండటంతో ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయలేని పరిస్థితుల్లో కొంత మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు, ఇంకొందరు నేరుగా పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలించి రాయచూరు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మిల్లర్లు కూడా గత సీజన్లలో ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం కేటాయించిన ధాన్యాన్ని పక్క రాష్ర్టాలకు తరలిస్తున్నారు. రైతులు కూడా ఇదే పనిలో ఉండటం వల్ల అధికారులకు అనుమానం రాదనే భావనలో యథేచ్ఛగా ప్రభుత్వ ధాన్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. ఆ ధాన్యం కింద ఇవ్వాల్సిన సీఎంఆర్‌ను రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి, కోటా చూపిస్తున్నారు. తాజాగా గద్వాల, వనపర్తి జిల్లాలో పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న ధాన్యమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కేటాయించిన ధాన్యం మిల్లులో ఉందా? లేదా? అని అడిట్‌ చేస్తున్న క్రమంలో భారీ మొత్తంలో తేడాలు వస్తున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే ఈ తేడాలను గుర్తి స్తున్న సమయంలోనూ అధికారులను మిల్లర్లు మేనేజ్‌ చేస్తున్నట్లు సమాచారం. మేనేజ్‌ చేయని మిల్లులపై కేసులు నమోదు చేస్తూ, మేనేజ్‌ చేసిన వారిని వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి. 


ఇదీ ప్రక్రియ..

గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, వ్యాపారులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేసేవారు. వాటిని బియ్యం చేసి ఎఫ్‌సీఐ లెవీ నిబంధనల ప్రకారం దానికి కేటాయించి, మిగతావి డిమాండ్‌ ఉన్నచోట వ్యాపారులు విక్రయించేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం స్వయంగా ధాన్యం సేకరణను ప్రారంభించింది. ఐకేపీ, పీఏసీఎస్‌, ఏఎంసీల ఆధ్వర్యంలో కొనుగోలు చేసి, వాటిని మిల్లులకు కేటాయిస్తుంది. వారు నిబంధనల ప్రకారం బియ్యం ఆడించి, సీఎంఆర్‌ కింద పౌరసర ఫరాల శాఖకు అప్పగించాలి. వాటిని ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. పాత పద్ధతిలో మిల్లర్లే స్వయంగా పెట్టుబడి పెట్టి, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ఎలాంటి  పెట్టుబడి లేకుండా మిల్లర్లకు ధాన్యం వచ్చి చేరుతోంది. అయితే మిల్లర్లు కేటాయించిన ధాన్యంలో కొంత మేరే మిల్లింగ్‌ చేసి, ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. కోటాను భర్తీ చేయడానికి రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి అప్పగిస్తున్నారు. మరీ మిగిలిన ధాన్యాన్ని ఇన్ని రోజులు రైతుల పేరిట ప్రభుత్వానికే తిరిగి అమ్మేవారు. లేకపోతే ఇతర రాష్ర్టాలకు తరలించి, సొమ్ము చేసుకునేవారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో స్థానికంగా విక్రయించడం సాధ్యం కాదనే భావనలో ఉన్న మిల్లర్లు ఆ ధాన్యాన్ని నేరుగా కర్ణాటకలోని రాయచూర్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడ సుమారు రూ. 1,600 నుంచి రూ.1,800 వరకు ధర వస్తుండటంతో లాభాలు పొందుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో మిల్లర్లు ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదు. పైగా పేదల బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, వారి సీఎంఆర్‌ కోటా కింద చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం కేటాయించిన 90 రోజుల్లోపు మిల్లర్లు బియ్యం అప్పగిం చాలి. కానీ సంవత్సరం పూర్తయినా కూడా అప్పగించడం లేదు. సమయానికి అప్పగించకపోతే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం గడువు పెంచుతూ పో తోంది. ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించడంద్వారా రుణం తీరుస్తామని చెప్పి, వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి తెస్తున్న అప్పులకు వడ్డీ ప్రభుత్వానికి తడిసి మోపెడవుతోంది. 


మచ్చుకు కొన్ని మాత్రమే వెలుగులోకి..

సాధారణంగా ప్రతీ సంవత్సరం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ఆధ్వర్యంలో సీఎంఆర్‌ కోసం మిల్లులకు కేటాయించిన ధాన్యం ఆడిటింగ్‌ జరగుతుంది. కేటాయించిన మేర ధాన్యం మిల్లులో నిల్వ ఉందా? ఎంతమేర మర ఆడించి బియ్యం అప్పగించారు అనే విషయాలను ఇందులో లెక్కిస్తారు. ఒకవేళ ధాన్యం నిల్వలో, అప్పగించిన బియ్యం లెక్కల్లో తేడాలు ఉంటే ఆ మిల్లర్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

వనపర్తి, గద్వాల జిల్లాల్లో చాలామంది మిల్లర్లు మర ఆడించకుండానే ప్రతీ సంవత్సరం బియ్యం కోటాను ప్రభుత్వానికి ఇస్తున్నారు. మిల్లులో ఆడించకుండా బియ్యం ఎలా వస్తాయంటే వారు రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేయడం ద్వారా భర్తీ చేస్తున్నారు. కేటాయించిన ధాన్యాన్ని ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖకు చెందిన ముఖ్య అధికారులకు తెలిసే ఈ తతంగం అంతా నడుస్తోంది. కానీ వారు మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

గత నెలలో గద్వాల జిల్లాలోని కొన్ని రైస్‌ మిల్లుల నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న రెండు లారీల ధాన్యాన్ని అధికారులు సీజ్‌ చేశారు. అవి సీఎంఆర్‌కు కేటాయించిన ధాన్యమేనని నిర్ధారించారు.

తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరులోని సిద్ధివినాయక రైస్‌ మిల్లు నుంచి కర్ణాటకలోని రాయచూర్‌ మార్కెట్‌కు ధాన్యం తరలిస్తున్న లారీలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, లారీని స్టేషన్‌కు తరలించారు. మరో మిల్లులో కూడా కేటాయించిన సీఎంఆర్‌కు, నిల్వ ఉన్న ధాన్యానికి, అప్పగించిన బియానికి మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే సదరు మిల్లు ఓనర్‌ కొంతమందిని మేనేజ్‌ చేసి, విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాల్లోని అన్ని మిల్లుల్లో ఆడిటింగ్‌ పూర్తి చేసి, తేడాలను గుర్తిస్తే భారీ మొత్తంలో అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2021-11-28T04:54:56+05:30 IST