గ్రహణం వీడేనా..?

ABN , First Publish Date - 2020-11-30T05:36:34+05:30 IST

గ్రహణం వీడేనా..?

గ్రహణం వీడేనా..?
దుకాణాలు నిర్మాణానికి ప్రతిపాధించిన స్థలం

  • రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన చిరువ్యాపారులు
  • వీధిన పడిన వందల కుటుంబాలు 
  • ప్రతిపాదనల్లోనే దుకాణ సముదాయాల నిర్మాణం
  • నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు  
  • చిరు వ్యాపారులు కోర్డుకు వెళ్లడంతో నిలిచిన ప్రక్రియ 

ఆమనగల్లు : నాలుగు మండలాలకు కూడలిగా, రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న ఆమనగల్లు పట్టణంలో దుకాణ సముదాయల నిర్మాణం కలగానే మిగిలింది. దుకాణాల  సముదాయ నిర్మాణానికి ఏళ్లు గడుస్తున్నా గ్రహణం వీడడం లేదు. దుకాణ సముదాయాలు నిర్మించి ఉపాధి చూపాలని ఏళ్ల కాలంగా స్థానిక చిరువ్యాపారులు నేతలు, అధికారులపై ఒత్తిడి తెస్తున్నా ఫలితం లేదు. ఆమనగల్లు పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా డబ్బాలు, హోటళ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేస్తూ వందల కుటుంబాలు జీవనోపాధి పొందేవి. ఆమనగల్లు పట్టణం వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో చుట్టుపక్కల అనేక గ్రామాలకు చెందిన యువకులు కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి పొందేవారు. కాగా  శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారిని 2014లో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా ప్రకటించింది. ఈ క్రమంలో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆమనగల్లు పట్టణంలోని చిరువ్యాపారుల దుకాణాలను 2015 ఏప్రిల్‌లో అధికారుల తొలగించారు. తమను ఆదుకోవాలని చిరువ్యాపారులు ఆందోళనకు దిగారు. ఏకమై సంఘంగా ఏర్పడ్డారు. ఆమనగల్లు మండల పరిషత్‌, బాలుర ఉన్నత పాఠశాల, బస్టాండ్‌ ఉన్నత పాఠశాల  ముందు భాగంలో దుకాణ సముదాయాలు నిర్మించి తమకు కేటాయించాలని లేదా అదే స్థలంలో కొద్దిగా వెనక్కి జరిగి డబ్బాలు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించాలని నేతలు, అధికారులకు విన్నవించారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి ద్వా రా మంత్రి కేటీఆర్‌ను కలిసి దుకాణ సముదాయ నిర్మాణం గురిం చి అభ్యర్థించారు. స్పందిం చిన కేటీఆర్‌ చిరువ్యాపారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 2016లో మండల పరిషత్‌ ఎదుట 128, బాలుర ఉన్నత పాఠశాల ఎదుట 57, బస్టాండ్‌ ఉన్నత పాఠశాల ఎదుట 37 దుకాణాల సముదాయ నిర్మాణానికి ప్రభుత్వం నిబంధనలను అనుసరించి నిర్మాణాలకు అనుమతించింది. దీంతో 2016లో అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా  శంకుస్థాపన చేసినా ఆ తర్వాత శిలాఫలకం కూడా మాయమైంది. అదే విధంగా ఆమనగల్లు మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్‌, మాజీ ఎంపీపీ తల్లోజు లలిత వెంకటయ్య ప్రత్యేక చొరవ తీసుకొని మండల పరిషత్‌లో తీర్మాణాలు చేసి దుకాణ సముదాయ నిర్మాణానికి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి కూడా చిరువ్యాపారులకు మద్దతుగా నిలిచారు. అసెంబ్లీలో సైతం సమస్యను లేవనెత్తారు. దీంతో చిరు వ్యాపారులు 2017 ఏప్రిల్‌లో అధికార పార్టికి చెందిన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆశ్రయించగా స్పందించిన ఆయన ఆమనగల్లు మార్కండేయ ఆలయంలో చిరువ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి నెల రోజుల్లో ప్రభుత్వం ద్వారా దుకాణ సముదాయ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2018లో ప్రజాప్రతినిధుల చొరవతో రాష్ట్ర ప్రభుత్వం మూడు చోట్ల 222 దుకాణాల నిర్మాణానికి అనుమతించింది. దీంతో మండల పరిషత్‌ ద్వారా దుకాణాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక డిపాజిట్‌, అద్దెలతో ప్రజాప్రతినిధులు, అధికారులు టెండర్‌ ప్రక్రియ చేపట్టారని చిరువ్యాపారులు కోర్డును అశ్రయించారు. దీంతో టెండర్‌ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా 2018 నవంబర్‌ 18న అసెంబ్లీ ఎన్నికల ముందు చిరువ్యాపారులతో ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సమావేశమై ఎన్నికల్లో తనను గెలిపిస్తే గతంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్‌ ద్వారా దుకాణ సముదాయ నిర్మాణం చేపడుతామని, నామినేషన్‌ టెండర్‌ ద్వారా దుకాణాలు నిర్మించి చిరువ్యాపారులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాగా, జైపాల్‌యాదవ్‌ ఎమ్యెల్యేగా గెలుపొందినా నేటికీ దుకాణ సముదాయ నిర్మాణం దిశగా చర్యలు చేపట్టలేదు. ఈ ఏడా ది ఆగస్టు 21న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ద్వారా చిరు వ్యాపారులు మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ గోడును వెల్లబోసుకొని వినతిపత్రం అందజేశారు. అయినా స్పందన లేదు. దుకాణ సముదాయం నిర్మించక, వ్యాపారం చేసుకోవడానికి డబ్బాల ఏర్పాటుకు అధికారులు అనుమతించకపోవడంతో సుమారు 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దుకాణ సముదాయం నిర్మించి తమను ఆదుకోవాలని మరో మారు చిరువ్యాపారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2020-11-30T05:36:34+05:30 IST