పట్టభద్రులూ.. ఓటు నమోదు చేసుకోండి

ABN , First Publish Date - 2020-09-30T06:02:44+05:30 IST

ఓటు వజ్రాయుధం. శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతీ పట్టభద్రుడూ తమ ఓటుహక్కు కోసం దరఖాస్తు

పట్టభద్రులూ.. ఓటు నమోదు చేసుకోండి

గత ఎన్నికల్లో ఓటేసిన వారూ దరఖార్తు చేసుకోవాల్సిందే

రేపటినుంచి వచ్చేనెల ఆరు వరకు అవకాశం


ఖమ్మం కలెక్టరేట్‌, సెప్టెంబరు 29: ఓటు వజ్రాయుధం. శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతీ పట్టభద్రుడూ తమ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేయాల్సిందే. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో పేర్లున్న వారితో పాటు 2017 ముందు వరకు డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాల్సిందే. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో ఇక్కడి నుంచి గెలుపొందిన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి పదవీకాలం మార్చినాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 


ఓటరుగా నమోదు..

నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఎలక్ర్టోరల్‌ అధికారిగా నల్గొండ డీఆర్వో వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఆర్డీవో, తహాసీల్దార్‌ సహాయ ఎలక్టోరల్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 1 నుంచి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఓటు నమోదుకు దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. ఓటు నమోదుకు ఫారం 18లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2017కు ముందు డిగ్రీ పూర్తిచేసిన వారు ఓటుహక్కు పొందేందుకు అర్హులుగా ప్రకటించింది. దరఖాస్తుతో పాటు ఓటరు గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్టుసైజ్‌ ఫోటోలు, డిగ్రీ పూర్తిచేసిన దృవీకరణ పత్రం జతచేయాల్సి ఉంది. 


శాసనమండలి ఎన్నికల కోసం అర్హులైన వారిని ఓటర్లుగా పేర్లు నమోదు చేసేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీల నాయకులు అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేయాలంటూ ఇంటింటి సర్వేను కూడా నిర్వహిస్తున్నారు. అర్హులైన పట్టభద్రులను కలుసుకుని వారికి దరఖాస్తు ఫారాలు అందిస్తూ ఓటరుగా చేరేందుకు ప్రోత్సహిస్తున్నారు. తమకు అనుకూలమైన వారిని ఓటర్లుగా చేర్పించేందుకు నాయకులు, కార్యకర్తలు వ్యూహాలు అమలుచేస్తున్నారు. 


ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ఇలా..

అక్టోబరు 1 : ఓటర్ల నమోదు ప్రకటన జారీ

అక్టోబరు 15 : ఓటర్ల నమోదు స్వీకరణ తొలి పునఃప్రకటన జారీ

అక్టోబరు 25 : ఓటర్ల నమోదు స్వీకరణ మలి పునఃప్రకటన జారీ

నవంబరు 6 : ఓటరు దరఖాస్తుల స్వీకరణకు ఆఖరుతేదీ


మూడు ఉమ్మడి జిల్లాల్లో 2015లో ఓటర్లవివరాలు ఇలా.. 

జిల్లా ఓటర్లు పురుషులు స్త్రీలు థర్డ్‌ జెండర్‌

ఖమ్మం 84,284 59,174 25,108 3

నల్గొండ 92,490 69,262 23,205 23

వరంగల్‌ 1,04,364 76,744 27,486 132

Updated Date - 2020-09-30T06:02:44+05:30 IST