‘గ్రాడ్యుయేట్స్‌’ ఫైట్‌!

ABN , First Publish Date - 2021-01-25T05:34:05+05:30 IST

వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టుభద్రుల శాసనమండలి ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను రూపొందించింది. మార్చి 29నాటికి ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫకేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు ముందస్తు ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతల పర్యటనలు, ప్రచారంతో రాజకీయాలు హీటెక్కాయి.

‘గ్రాడ్యుయేట్స్‌’ ఫైట్‌!

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సర్వం సిద్ధం
నేతల పర్యటనలు, ప్రచారంతో వేడెక్కుతున్న ప్రచారం
12 జిల్లాల పరిధిలో వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం
రెండు విడతలుగా ఓటర్ల నమోదు.. 4,91,396 ఓటర్లతో జాబితా ఖరారు
ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ప్రచార పర్వంలోకి అభ్యర్థులు

వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టుభద్రుల శాసనమండలి ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను రూపొందించింది. మార్చి 29నాటికి ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫకేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు ముందస్తు ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతల పర్యటనలు, ప్రచారంతో రాజకీయాలు హీటెక్కాయి.

ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టారు. తమ అనుచరగణంతో పట్టభద్రుల దగ్గరి వెళుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రముఖులు బరిలో నిలస్తుండటంతో ఆసక్తికరంగా మారింది. పట్టభద్రుల్లో పట్టు కోసం అభ్యర్థులు పాకులాడుతున్నారు. అర్బన్‌ ఓటర్లతో పాటు సింగరేణి గనులు, జెన్‌కో లాంటి పారిశ్రామిక ప్రాంతాల్లోను గ్రాడ్యుయేట్‌ కార్మికుల ఓట్ల కోసం ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఎవరికి పట్టు చిక్కుతుందో.. ఎవరు పట్టభద్రుల నాడి పట్టుకుని విజయం సాధిస్తారో అనేది ఉత్కంఠగా మారింది.

4,91,396 మంది ఓటర్లు
గ్రాడ్యుయేటట్‌ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. మొదట గత ఏడాది నవంబరు ఒకటి నుంచి 30 వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. 4,67,635 మంది అర్హులైన వారిని ఓటర్లుగా గుర్తించారు. హైకోర్టు ఆదేశాలతో డిసెంబరు ఒకటి నుంచి 31వరకు మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో అదనంగా మరో 23,761 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ నెల 18న ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేసింది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 4,91,396 మంది ఓటర్లుగా ప్రకటించింది.  పురుషులు 3,23,457 మంది, మహిళలు 1,67,859 మంది, ట్రాన్స్‌జెండర్‌ 80 మంది ఉన్నారు. 12 జిల్లాల పరిధిలో ఎన్నికల రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో పాటు బూత్‌ లెవల్‌ ఆధికారులను, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పరిధి విస్తరణ

వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధి మూడు జిల్లాల నుంచి 12 జిల్లాలకు విస్తరించింది. 2016లో జిల్లాల పునర్విభజనలో మూడు జిల్లాల పరిధిలోని మండలాలు 12 జిల్లాలు వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాద్రాది భువనగిరి పరిధిలోకి వెళ్లాయి. పాత వరంగల్‌ పరధిలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 64,432 మంది ఓటర్లు, వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో 32,835, జనగామ జిల్లా పరిధిలో 20,502, మహబూబాబాద్‌ జిల్లా పరిధిలో 35,389, భూపాలపల్లి జిల్లా పరిధిలో 12,388, ములుగు జిల్లా పరిధిలో 9,890, సిద్దిపేట జిల్లా పరిధిలో 3,395 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,80,912 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఓటర్లు ఉండగా, అత్యల్పంగా ములుగు జిల్లా పరిధిలో ఉన్నారు. పూర్వ వరంగల్‌ పరిధిలోని చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు మండలాలు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉండటంతో అక్కడ కూడా 3,395 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు అయ్యారు. ఇక భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు ఉండగా ఆరు మండలాలు భూపాలపల్లి, చిట్యాల, రేగొండ, టేకుమట్ల, గణపురం, మొగుళ్లపల్లి మండలాలు మాత్రమే ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నాయి.

ప్రచారంలో నేతల దూకుడు
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రచారం జోరందుకుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలం మార్చి 29 వరకు ఉంది. మరోవైపు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం పర్వంలోకి ఆశావహులు దూసుకొస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటికి సిద్ధమయ్యారు. ఇప్పటికే 12 జిల్లాల పరిధిలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్‌ ఓటర్లను కలుసుకోవటంతో పాటు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. తాజాగా భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలో రాజేశ్వర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరోవైపు బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక దఫా ప్రచారం ముగించారు. అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు రాష్ట్ర నాయకత్వం ప్రేమేందర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతుండటంతో ప్రచారం ముమ్మరం చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మంతో పోల్చితే బీజేపీ గట్టి పట్టున్న ప్రాంతం వరంగల్‌ కావటంతో ఇటువైపే కాషాయ నేతలు ఎక్కువ నజర్‌ వేసి ప్రచారం చేస్తున్నారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌  కోదండరామ్‌ సైతం మూడు నెలలుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణవాదులను కలుసుకొని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తీన్మార్‌ మల్లన్న ఇప్పటికే పాదయాత్ర పూర్తి చేశారు. వామపక్షాల అభ్యర్థి జయసారథితో పాటు రాణిరుద్రమ, చెరుకు సుధాకర్‌, హరిశంకర్‌గౌడ్‌ తదితరులు ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంకా ఖరారు కాకపోవటంతో ఆ పార్టీ ప్రచారం మాత్రం ఇంకా మొదలు కాలేదు.



Updated Date - 2021-01-25T05:34:05+05:30 IST