క్రమంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2021-02-27T07:02:30+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తొలిదశ విజృంభణ తర్వాత జిల్లాలో కరోనా వ్యాప్తి దాదాపుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.రోజుకు సగటున 5-10 కేసుల నడుమ నమోదవుతూ వచ్చాయి.

క్రమంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తి

 తిరుపతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తొలిదశ విజృంభణ తర్వాత జిల్లాలో కరోనా వ్యాప్తి దాదాపుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.రోజుకు సగటున 5-10 కేసుల నడుమ నమోదవుతూ వచ్చాయి. అయితే వారం పదిరోజులుగా మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజు వారీ 20కి అటూఇటూగా కేసులు నమోదవుతున్నాయి.గత పది రోజుల్లో నమోదైన కేసుల్ని పరిశీలించి చూస్తే రాష్ట్రం లోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడే రోజువారీ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కూడా 22 మందికి కరోనా సోకింది.వైరస్‌ బారిన పడి ఒకరు మరణించారు.కొత్తగా గుర్తించిన కేసులతో జిల్లాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 90084కు చేరుకోగా కొవిడ్‌ మరణాల సంఖ్య 849కి చేరింది. కాగా శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 80 వున్నట్టు అధికారులు ప్రకటించారు.


ప్రతి పీహెచ్‌సీలో 50పరీక్షలు నిర్వహించండి:కలెక్టర్‌

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం పట్ల కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల వైద్యాధికారులు, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల ట్సేసింగ్‌ విషయంలో అలసత్వం వహిస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రోజుకు 4వేల పరీక్షలు జిల్లాలో చేస్తున్నారని, ఇకపై ప్రతి పీహెచ్‌సీ నుంచి 50పరీక్షలు నిర్వహించడంతో పాటు స్విమ్స్‌, రుయా ఆస్పత్రుల్లోని ప్రయోగశాలల్లో పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలన్నారు.జేసీ వీరబ్రహ్మం, ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T07:02:30+05:30 IST