వారికే దైవానుగ్రహం

ABN , First Publish Date - 2022-06-10T05:35:38+05:30 IST

మంచి కోసం బతకడం అంటే... మంచి కోసం ప్రాణాలనైనా అర్పించడం. సమాజంలో ప్రతి వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి.

వారికే దైవానుగ్రహం

మంచి కోసం బతకడం అంటే... మంచి కోసం ప్రాణాలనైనా అర్పించడం. సమాజంలో ప్రతి వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి. అలా లేనివారు ఉన్నారు. దారి తప్పినవారు ఉన్నారు. అటువంటి వారు తమను తాము సరి చేసుకోవాలి. అలా కానప్పుడు... తప్పులు చేస్తూనే ఉంటారు. ఇతరులపైకి ఆ తప్పులను నెట్టేస్తూ ఉంటారు. తాము పరిశుద్ధంగా ఉన్నామని లోకానికి చాటడానికి ప్రయత్నిస్తారు. దీనికి భిన్నంగా... ఒకరి తప్పులను మరొకరు మోయాలనుకోవడం, ఒకరి మీద పడే నిందలను తమ మీద వేసుకోవడం, వేరొకరికి పడిన శిక్షను తాము అనుభవించడం... ఇంకా చెప్పాలంటే ఒకరికోసం మరొకరు మరణించాలనుకోవడం, మంచి సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా లెక్కచేయకపోవడం లాంటివి చరిత్రలో అరుదుగా కనిపిస్తాయి. ఇలా చేసినవారిని ‘హత సాక్షులు’ అంటారు. దైవం ఇచ్చిన ఆదేశాన్ని ప్రజలకు సందేశంగా అందించడానికి మానవరూపంలో భూమి మీదకు వచ్చి, మంచిని బోధించి, దేవుని ఆజ్ఞలను అందించి, వాటి పరిరక్షణ కోసం మరణించిన ఏసు ప్రభువులో అటువంటి అరుదైన లక్షణాలు ఎన్నో కనిపిస్తాయి. అలాగే ఆయన అనుయాయులలో భిన్నమైన వ్యక్తులు కనిపిస్తారు. 


‘క్రీస్తు ఎవరో నాకు తెలియనే తెలియదు’ అని మూడుసార్లు అసత్యం పలికిన పేతురు... క్రీస్తు శిష్యుడే. అలాగే, క్రీస్తును రోమన్‌ సైనికులకు పట్టి ఇచ్చిన ఇస్కారియోతు కూడా ఆయన శిష్యుడే. ఒకరిలో పిరికితనం, మరొకరిలో అత్యాశ దీనికి కారణమయ్యాయి. ఇక, స్టెఫెను అనే వ్యక్తికి ఏసు ప్రభువు బోధించిన సమతా, మమతా భావాలు, మూఢనమ్మకాలను ఏసు ఖండించిన తీరు నచ్చాయి. అతను ఏసుకు భక్తుడిగా మారాడు. ఆయననే అనుసరించాడు. స్టెఫెనును మత ఛాందసులు దూషించారు, హింసించారు, రాళ్ళతో కొట్టి చంపేశారు. స్టెఫెను కొన ఊపిరిలో కూడా ప్రభువునే స్మరిస్తూ, స్తుతిస్తూ మరణించాడు. అతడు నిజమైన హత సాక్షి. 


ఒకరి హృదయంలో వెలిగిన ‘విశ్వాసం’ అనే దీపాన్ని ఆర్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి నమ్మకాన్ని చెరిపెయ్యడానికి మరొకరు ప్రయత్నించడం సమంజసం కాదు. సత్యాన్ని చెప్పే నోటిని కానీ, మంచిని చేసే చేతుల్ని కానీ బలవంతంగా అణచివెయ్యాలని చూడడం పైశాచికత్వం. అటువంటి పైశాచికత్వం వల్ల ఎన్నో దుఃఖాలు అనుభవించినవారు, హింసకు గురైనవారు ఎందరో ఉన్నారు. ‘‘లోకమున మీకు శ్రమ కలుగుతుంది. అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను’’ అని ప్రభువు చెప్పాడు. సత్యం అని నమ్మినదాన్ని ఎన్ని శ్రమలు ఎదురైనా వదిలిపెట్టని వారు ధన్యులు. దైవానుగ్రహానికి వారే నిజమైన అర్హులు. 


డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - 2022-06-10T05:35:38+05:30 IST