ఎరిమల్లెకు ఎసరు!

ABN , First Publish Date - 2022-08-08T05:28:46+05:30 IST

ఘట్‌కేసర్‌ మండలంలో ప్రధానంగా పారే ఎరిమల్లె వాగు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురవుతోంది. అధికారుల ఉదాసీనత ఆక్రమణదారులకు వరంగా మారింది.

ఎరిమల్లెకు ఎసరు!
పోచారం మున్సిపల్‌ పరిధి యంనంపేట్‌ వద్ద బండరాళ్లతో పూడ్చిన ఎరిమల్లె వాగు

  • యథేచ్ఛగా వాగు పూడ్చివేత.. పెద్దపెద్ద బండరాళ్ల పారబోత 
  • వాగు ఆక్రమణ వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం
  • యంనంపేట్‌ వద్ద కుంచించుకుపోయిన వైనం

ఘట్‌కేసర్‌ మండలంలో ప్రధానంగా పారే ఎరిమల్లె వాగు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురవుతోంది. అధికారుల ఉదాసీనత ఆక్రమణదారులకు వరంగా మారింది. బఫర్‌ జోన్‌ను అక్రమించి రియల్టర్లు లేఅవుట్లు చేసి దర్జాగా అమ్మేస్తున్నారు. వాగు ప్రారంభం నుంచి ముగింపు వరకు అడుగడుగునా ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తీరుగా వాగులు, చెరువులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని కనుమరుగవుతున్నాయి.

ఘట్‌కేసర్‌, ఆగస్టు 7: గలగల పారే ఎరిమల్లె వాగు రోజురోజుకూ ఆక్రమణకు గురవుతోంది. కీసర మండలంలోని గొలుసుకట్టు చెరువులు, కుంటలు నిండిన అంనంతరం అలుగులు పారగా వచ్చే వరద నీటిని ఘట్‌కేసర్‌ మండలానికి తీసుకొచ్చేది ఎరిమల్లె వాగే! నగరంలోని కుషాయిగూడ ప్రాంతం నుంచి వచ్చే బొంతకుంట వాగు, కీసర మండలం నుంచి వచ్చే ఎరిమల్లె వాగులు ఘట్‌కేసర్‌ వద్ద కలిసి అక్కడి నుంచి ఏదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తోంది. ఏదులాబాద్‌ చెరువు నిండి పంట పొలాల మధ్యలోంచి మూసీలో కలుస్తుంది. పట్టణీకరణ పల్లెల వైపునకు పరుగులు తీస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు రియల్‌ వ్యాపారుల కబంధహస్తల్లో చిక్కుకొని ఉనికి కోల్పోతున్నాయి. ఎరిమల్లె వాగు ప్రారంభం నుంచి ముగింపు వరకు అడుగడుగునా ఆక్రమణలకు గురవుతోంది. దాని పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఆక్రమణదారులు ఆడిందే ఆట పాడిందేపాటగా మారింది. ఎగువన భారీ వర్షాలు కురిసినప్పుడు వాగుకు వరద ఉధృతి అధికంగా ఉంటుంది. దీంతో వాగు పక్కన వెలసిన కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. దీనికి ప్రధాన కారణం వాగులకు ఆనుకొని లే అవుట్లు చేయడమే. వాగులో ప్లాట్లు చేశారని తెలియని పేదలు ప్లాట్లు కొని కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో పంచాయతీ అధికారులు గతంలో ఇష్టారీతిన అనుమతులు జారీ చేశారు. యంనంపేట్‌లో వాగు పక్క నుంచి శ్మశాన వాటికకు లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి సీసీ రోడ్డు నిర్మించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వదలొచ్చి ఆ సీసీ రోడ్డు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. దీంతో ప్రస్తుత మున్సిపాలిటీ నాయకుల సహకారంతో కొందరు పెద్దపెద్ద బండరాళ్లను టిప్పర్లలో తీసుకొచ్చి వాగు పక్కన పడేశారు. ఉన్నట్టుండి స్థానికులు గత గురు వారం రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో బండరాళ్లను వాగులో వేసి దాదాపు 30 అడుగుల మేర పూడ్చివేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఇరిగేషన్‌ ఏఈ పరమేష్‌, రెవెన్యూ అధికారులు హుటాహుటిన వెళ్లి పనులను నిలిపివేయించారు. కానీ అప్పటికే వాగును దాదాపు 100మీటర్ల వరకు బండరాళ్లతో పూడ్చివేశారు. శుక్రవారం ఇరిగేషన్‌ ఏఈ పరమేష్‌ కాలనీ వాసులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు పాటించకుండా వాగుల పక్కన బఫర్‌ జోన్లలో ఇళ్లు నిర్మించడంతోనే వరద కాలనీల్లోకి వస్తోందని, వాగును పూడ్చివేయడం సరికాదన్నారు. వాగు అంచు నుంచిపైకి 9 మీటర్ల బఫర్‌ ఉంటుందని ఆది వదిలి ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని ఇరిగేషన్‌ అధికారులు సూచించారు. పేదలు మాత్రం తాము పైసాపైసా కూడబెట్టి పాట్లు కొని ఇళ్లు కట్టుకున్నామని, మా ఇళ్లల్లోకి నీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇప్పటికే వాగు అవతలి వైపు రియల్టర్లు బఫర్‌ జోన్‌ను ఆక్రమించి లేఅవుట్‌ చేశారని స్థానికులు అధికారులకు వివరించారు. రెండు వైపులా ఆక్రమణలను తొలగించి వాగు స్థలాన్ని పరిరక్షిస్తామని అధికారులు పేర్కొన్నారు.


  • మోసగించి ప్లాట్లు అమ్మిన వారిని గుర్తించాలి : పిట్టల శ్రీశైలం, పర్యావరణ వేత్త, ఎన్‌ఎ్‌ఫసీ నగర్‌


యంనంపేట్‌లో ఎరిమల్లె వాగును పూడ్చివేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. వాగుకు ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్‌ స్థలాన్ని గుర్తించాలి. వాగును ఆక్రమిస్తే పర్యావ రణ సమతుల్యం కూడా దెబ్బతింటుంది. వాగును ఆక్రమించి లేఅవుట్లు చేసి ప్రజలను మోసగించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను గుర్తించి చర్యలు తీసుకో వాలి. ప్లాట్లు కొన్నవారికి ప్రభుత్వం న్యాయం చేయాలి.


  • వాగును పరిరక్షించాలి : గడ్డం మహేశ్‌, మాజీ ఎంపీటీసీ, ఘట్‌కేసర్‌


ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలో ఎరిమల్లె వాగు, బొంతకుంట వాగులు కబ్జాలకు గురవుతున్నాయి. అధికారుల పట్టించుకోకపోవడం ఆక్రమణ దారులకు వరంగా మారింది. వాగులకు పూడ్చివేయడంతో వరద ఉధృతి అధికంగా ఉన్నప్పు డు నష్టం తీవ్రస్థాయిలో ఉండే ప్రమాదం ఉంది. వాగులను ఆక్రమించి లేఅవుట్లు చేసిన వారిపై చర్యలు చేపట్టాలి.


  • ఆక్రమణలను తొలగిస్తాం : పరమేశ్‌, ఇరిగేషన్‌ ఏఈ, ఘట్‌కేసర్‌ మండలం

యంనంపేట్‌ వద్ద ఎరిమల్లె వాగులో రాత్రికి రాత్రే బండరాళ్లను వేసి పూడ్చివేసిన విషయమై విచారణ జరుపుతున్నాం. గురువారం రాత్రే రెవెన్యూ అధికారులతో కలిసి పూడ్చివేత పనులను నిలిపివేశాం. రెండువైపులా ఆక్రమణలు ఉన్నందున వాటిని తొలగించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి చర్యలు చేపడతాం.

Updated Date - 2022-08-08T05:28:46+05:30 IST