జీపీఎఫ్‌ సొమ్ము..సర్కారు తీసేసుకుందా?

ABN , First Publish Date - 2022-06-30T09:49:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము మాయం కావడం వాస్తవమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పినట్టు ఏపీ జేఏసీ అమరావతి...

జీపీఎఫ్‌ సొమ్ము..సర్కారు తీసేసుకుందా?

  • పేపర్లలో చూసి ఆశ్చర్యపోయాం
  • ఇదే నిజమైతే సీఎస్‌పైధిక్కరణ చర్యలు తప్పవు
  • ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక
  • ఎంత మొత్తం ఉపసంహరించారో వివరాలివ్వాలని పిటిషనర్‌కు ఆదేశం


సొమ్ములు పోయాయి. అదికూడా... ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన డబ్బులు. అందులోనూ... వారు తమ సొంత జీపీఎఫ్‌ ఖాతాల్లో దాచుకున్న సొమ్ములు! వారికి చెప్పకుండానే ప్రభుత్వం లాగేసుకుంది. అసలేం జరిగింది, ఎందుకు డబ్బులు తీసుకున్నారు... అని ప్రశ్నిస్తే ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాధానమే లేదు. రూ.800 కోట్లు లాగేసుకున్న వైనంపై స్పందనే కనిపించలేదు.’


అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): తామిచ్చి న ఆదేశాలను ఉల్లంఘించి ఉద్యోగుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) ఖాతాల నుంచి ప్ర భుత్వం సొమ్ము తీసుకోవడంపై హైకోర్టు తీవ్రం గా స్పందించింది. ఖాతాల్లో డబ్బు మాయమైనట్లు పత్రికల్లో వచ్చిన కథనా లు చూసి ఆశ్చర్యపోయామని.. ఇదే నిజమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. పిటిషనర్‌తో పాటు ఉద్యోగుల నుంచి ఎలాంటి సొమ్మూ రికవరీ చేయొద్దని తాము గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చామని గుర్తు చేసింది. ఎంత సొమ్ము ఉపసంహరించారు.. తదితర వివరాలను అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆ వివరాలు పరిశీలించాక సీఎస్‌, సంబంధిత అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని.. సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో విచారణను జూలై 12కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీ వీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. పీఆర్‌సీపై జనవరి 17న జారీ చేసిన జీవో1ని సవాల్‌ చేస్తూ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ చైర్మన్‌ కె.వి.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం వేతన సవరణ ఉత్తర్వుల ఆధారంగా ఏ ఉద్యోగి జీతంలోనూ రికవరీ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.


 ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపించారు. ‘కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి పిటిషనర్‌ జీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి రూ.91 వేలు ఉపసంహరించారు. పీఆర్‌సీ అమలు తర్వాత జీతం ఎంత వస్తోంది? ఎంత మొత్తం కోత పెట్టారు? పదవీ విరమణ ప్రయోజనాలు ఏమిటి.. వంటివి పిటిషనర్‌ తెలుసుకోలేకపోతున్నారు. ఒకరకంగా బానిసలాగా పనిచేస్తున్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చాక పీఆర్‌సీపై అనేక నిర్ణయాలు తీసుకుని జీవోలు జారీ చేసింది. పిటిషనర్‌కు తెలియకుండా ఆయన ఖాతా నుంచి నిధులు ఉపసంహరించడం సైబర్‌ నేరం’ అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏ ఉద్యోగికైనా ఎంత జీతం వస్తుంది, ఎంత మొత్తం కోతపడుతోందనే కనీస వివరాలు తెలుసుకునే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తీరు దురదృష్టకరమని.. నగదు ఉపసంహరణ విషయంలో ప్రభుత్వ చర్యలపై ధిక్కరణ పిటిషన్‌ వేయాలని పిటిషనర్‌కు సూచించింది.  

Updated Date - 2022-06-30T09:49:57+05:30 IST