జీపీఎఫ్‌ వడ్డీ ఏదీ..?

ABN , First Publish Date - 2020-07-09T10:37:43+05:30 IST

జీపీఎఫ్‌ వడ్డీ పదేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు జమకావడం లేదు. ఉమ్మడి..

జీపీఎఫ్‌ వడ్డీ ఏదీ..?

పదేళ్లుగా జమకాని వైనం

ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు


(ఆంధ్రజ్యోతి-మంచిర్యాల) :జీపీఎఫ్‌ వడ్డీ పదేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు జమకావడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 5,955 మంది ఖాతాదారులుండగా రూ.184.07కోట్ల జీపీఎఫ్‌ జమ కావాల్సి ఉంది. జమచేసిన మొత్తం, ఇవ్వాల్సిన వడ్డీ వివరాలు విభజన అనంతరం ఇప్పటి వరకు అందలేదు. పదేళ్ల నుంచి జమ అయిన పంచాయతీరాజ్‌, ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ భవిష్యనిధికి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతోంది. 


ఆదిలాబాద్‌ నుంచే ప్రక్రియ..

జిల్లా పరిషత్‌ విభజన జరిగినప్పటికీ ఉద్యోగుల జీపీఎఫ్‌ విభజన జరగలేదు. ఇప్పటికీ ఆదిలాబాద్‌ జడ్పీ నుంచే జీపీఎఫ్‌ రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడం మంజూరు చేయడం, పదవీ విరమణకు సంబంధించిన సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయి. పరిషత్‌ కార్యాలయాలు, పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని ఉద్యోగులు, గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులు జీపీఎఫ్‌ డబ్బులను పరిశీలించడానికి జడ్పీలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ కూడా ఇక్కడనే జమ అవుతోంది. ఉమ్మడి జిల్లాలోని జడ్పీ సీఈఓ ఆమోదం అనంతరం రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నారు.


మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంతా ఆదిలాబాద్‌లోనే దీని ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలలో ఉన్న ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా 8 శాతం ఉన్న వడ్డీని ఇటీవల 7.1కి తగ్గించారు. ప్రభుత్వం 7.1 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి వడ్డీని ప్రభుత్వం విడుదల చేయడం లేదు.  విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన సెటిల్‌మెంట్లు, ఉద్యోగుల రుణాలు మాత్రం కొనసాగుతున్నాయి. వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉద్యోగులు జమ చేసుకున్న జీపీఎఫ్‌ మొత్తం నుంచి వారికి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. 


తగ్గుతున్న నిధులు..

పది సంవత్సరాలుగా జీపీఎఫ్‌ వడ్డీ ఉద్యోగులకు సంబంధించి జమ కాకపోవడంతో నిధులు తగ్గుతూ వస్తున్నాయి. వడ్డీ పది సంవత్సరాలుగా జమకాని కారణంగా పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది. నాలుగు జిల్లాలకు సంబంధించి జీపీఎఫ్‌ విభజన కూడా జరగాల్సి ఉంది. వడ్డీ జమకాకపోవడం వల్ల అసలు తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితులలో విభజన ఎలా చేయడం అనే విషయంలోనూ అధికారులు అయోమయంగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై జీపీఎఫ్‌ అధికారులు ఎవరూ నోరుమెదపడం లేదు. వడ్డీకి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు పంపిస్తున్నాము. ప్రభుత్వం నుంచి జమ కావడం  లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదని అనధికారికంగా వారు పేర్కొంటున్నారు. 


జీపీఎఫ్‌ పెండింగ్‌లో ఉంచడం దుర్మార్గం.. ఇన్నారెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల

జీపీఎఫ్‌ పెండింగ్‌లో ఉంచడం దుర్మార్గపు చర్య. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న పదేళ్ల వడ్డీని పునరుద్ధరించాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. ఉద్యోగులపై నిర్లక్ష్యం పనికిరాదు. 


 ఖాతాలో కనిపించని జీపీఎఫ్‌ వడ్డీ.. వరదరాజు, డిప్యూటీ తహసీల్దార్‌, మంచిర్యాల

జీపీఎఫ్‌ వడ్డీ ఖాతాలలో కనిపించడం లేదు. అనేక ఇబ్బందుల నడుమ ఉద్యోగం చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించి ఇప్పటి వరకు లెక్కించి వడ్డీని చెల్లించాలి. 


రిటైర్మెంట్‌ తర్వాత ఆధారం జీపీఎఫ్‌యే..నైతం లక్ష్మణ్‌, ఉపాధ్యాయుడు

రిటైర్మెంట్‌ తర్వాత జీపీఎఫ్‌యే మాకు ఆధారం. దీంతో ఎంతో మేలు జరుగుతుంది. వడ్డీ చెల్లించకుంటే ఆర్థికంగా దెబ్బతింటాం. వెంటనే ప్రభుత్వం లెక్కలు చేసి వడ్డీ చెల్లించాలి. 

Updated Date - 2020-07-09T10:37:43+05:30 IST