అసమానతల్లోనే మన అభివృద్ధి!

ABN , First Publish Date - 2021-04-03T06:06:11+05:30 IST

భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా,చెందని దేశమా, చెందుతూన్న దేశమా అని నిర్ణయించడానికి ప్రాతిపదికలు ఏమిటి అన్న చర్చ అవసరం. జాతి సంపదలో 42.5 శాతం జనాభాలో ఒక శాతం మంది చేతుల్లో ఉన్నప్పుడు, 50 శాతం జనాభా వద్ద ఉన్న....

అసమానతల్లోనే మన అభివృద్ధి!

భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా,చెందని దేశమా, చెందుతూన్న దేశమా అని నిర్ణయించడానికి ప్రాతిపదికలు ఏమిటి అన్న చర్చ అవసరం. జాతి సంపదలో 42.5 శాతం జనాభాలో ఒక శాతం మంది చేతుల్లో ఉన్నప్పుడు, 50 శాతం జనాభా వద్ద ఉన్న సంపద కేవలం 2.8 శాతమే అయినప్పుడు, తలసరి ఆదాయం, స్థూల దేశీయ ఉత్పత్తి దేశంలోని ప్రజల బాగోగుల గురించి కచ్చితమైన అవగాహన కల్పించలేవు. భారతదేశానికి మానవాభివృద్ధి సూచీలో 131వ స్థానం, అవినీతి సూచీలో (కరప్షన్‌ పెర్‌సెప్షన్‌ ఇండెక్స్) 86వ స్థానం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రజాస్వామ్య సూచీలో 53వ స్థానం. ఇప్పటికీ దేశంలోని పావువంతు జనాభా దారిద్ర్యరేఖ దిగువనే ఉన్నారు. ఈ గుణాంకాలన్నీ భారతదేశ అభివృద్ధి నేతి బీరకాయ చందమని, భారతదేశం అభివృద్ధి పథంలో ఇంకా ఎంతో దూరం పయనించాలని స్పష్టం చేస్తున్నాయి. 


నేడు భారతదేశంలోని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు- ఆశ్రిత పెట్టుబడీదారీ విధానం, కులం మత ప్రాంత ప్రాతిపదికన సమాజాన్ని విడగొట్టడం, వ్యక్తి పూజను పెంపొందించడం, సంక్షేమం పేరిట జనాలకు డబ్బు పంచుతూ చాటుగా జాతిసంపదను కొల్లగొట్టడం. సర్వే భవంతు సుఖినః అని ప్రవచించిన భారతదేశంలో, రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ఈ విధానాలు ధనవంతులను మరింత ధనవంతులుగా మారుస్తున్నాయి, పేదవారిని ఎదగనీయకుండా అణగదొక్కుతున్నాయి. తుదకు ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీన పరుస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పార్టీల వ్యవస్థ గురించి యంయన్‌రాయ్ చేసిన విమర్శలు, ప్రజాస్వామ్య పరిరక్షణకై బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన హెచ్చరికలు, భారతదేశ ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తుకు తెచ్చుకోవడం అత్యావశ్యకం. 


భారతదేశ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే విప్లవాత్మకమైన చర్యలు అవసరం. ఆర్ధిక అసమానతల తగ్గింపు పేదరిక నిర్మూలన; నదుల అనుసంధానం ప్రకృతి వనరుల సంరక్షణ; రాజకీయ అవినీతి నిర్మూలన; ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్ధిక పునరుజ్జీవనం; ప్రజల్లో పేర్కొన్న సంకుచితత్వాలను నిర్మూలించి వారిని చైతన్యవంతులను చేయడం వంటివి కార్యరూపం దాల్చాలి. ఈ విధమైన కార్యక్రమం రూపొందించుకుని, దాని అమలు దిశగా పనిచేసే రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం విద్యావంతులు, చైతన్యవంతులు కృషి చేయాలి. అప్పుడే భారతదేశానికి నవోదయం.


– గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2021-04-03T06:06:11+05:30 IST