రేషన్‌ రెట్టింపు!

ABN , First Publish Date - 2020-03-29T08:24:02+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా పేదలు ఉపాధి కోల్పోతున్నందున కార్డుదారులకు ఇచ్చే రేషన్‌ సరుకులను ప్రభుత్వం రెట్టింపు చేసింది. నెలకు రెండుసార్లు ఉచితంగా పంపిణీ...

రేషన్‌ రెట్టింపు!

  • నెలకు రెండుసార్లు పంపిణీ
  • వచ్చే మూడు నెలల్లో ఆరుసార్లు
  • మొత్తం ఉచితంగానే.. నేడు ప్రారంభం
  • 15 నుంచి రెండో విడత సరఫరా

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కారణంగా పేదలు ఉపాధి కోల్పోతున్నందున కార్డుదారులకు ఇచ్చే రేషన్‌ సరుకులను ప్రభుత్వం రెట్టింపు చేసింది. నెలకు రెండుసార్లు ఉచితంగా పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకూ రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. రానున్న మూడు నెలల్లో 1 నుంచి 15వ తేదీ వరకు ఒకసారి, 15 నుంచి రెండోసారి పంపిణీ చేస్తారు. అంటే మొత్తం ఆరుసార్లు రేషన్‌ సరుకులు పంపిణీ ఇస్తారు. ప్రస్తుతం బియ్యం కిలో రూపాయికి ఇస్తుండగా కరోనా నేపథ్యంలో పూర్తి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇటీవల కొన్ని రేషన్‌ కార్డులు తొలగించినా... కరోనా వల్ల ప్రజలందరికీ ఇబ్బందులు ఉన్నందున, తొలగింపులతో సంబంధం లేకుండా పాత రిజిస్టర్‌ ప్రకారం రాష్ట్రంలోని కోటీ 47లక్షల కార్డులకూ రేషన్‌ సరుకులు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పంపిణీ చేస్తామని వివరించారు. ఒకేసారి ఎక్కువ మంది షాపులకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గ్రామాలు, క్లస్టర్ల వారీగా రోజుకు కొన్ని కార్డులకు మాత్రమే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరుసలో రెండు మీటర్ల దూరంలో కార్డుదారులు నిలుచునేలా షాపుల ముందు మార్కింగ్‌ చేస్తున్నామన్నారు. ఇలా అదనంగా రెండో విడత పంపిణీ, ఉచిత సరఫరా వల్ల కొత్తగా పౌరసరఫరాలశాఖపై రూ.వెయ్యి కోట్లకుపైగా భారం పడనుంది.


డీలర్లకు రూ.10వేలు ఇవ్వాలి: డీలర్ల సంఘం

విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న రేషన్‌ డీలర్లకు నెలకు రూ.10వేలు చొప్పున చెల్లించాలని రాష్ట్ర రేషన్‌ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు. అలాగే వైద్యులు, ఆశావర్కర్లకు కేంద్రం కల్పించిన తరహాలో బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పంపిణీ సమయంలో ప్రజలతో కలవాల్సి ఉన్నందున డీలర్లకు మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేయాలన్నారు. ఒకేసారి కార్డుదారులు షాపులకు రాకుండా చూసేలా వలంటీర్లు సహకరిస్తే అటు ప్రజలకు, ఇటు డీలర్లకు కరోనా ముప్పు తప్పుతుందన్నారు. 


ఒకటో తేదీనే పింఛన్లు

ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టీకరణ

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ యథావిధిగా ఏప్రిల్‌ ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన ఆహార భద్రతా కార్యక్రమం, కరోనా నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా వచ్చేనెల 14వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సామాజిక పింఛన్లపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యమూ వద్దని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆదివారం రేషన్‌ బియ్యంతోపాటు ఒక కేజీ కందిపప్పును ఉచితంగా కార్డుదారులకు ఇస్తామని, నాలుగో తేదీన ప్రతి పేదవాడికీ రూ.1000 అందజేస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది. 


బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ జారీ

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఓటాన్‌ ్ఞఅకౌంట్‌ బడ్జెట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్‌ నుంచి మూడు నెలలపాటు ప్రభుత్వ ఖర్చులకు రూ.70వేల కోట్లు వాడుకునేందుకు వీలుగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు శుక్రవారం కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్‌ కూడా ఆమోదం తెలిపారు. అనంతరం గెజిట్‌ ముద్రణకు పంపుతూ న్యాయశాఖ కార్యదర్శి మనోహర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


Updated Date - 2020-03-29T08:24:02+05:30 IST