ప్రభుత్వ జాగా.. వేసెయ్‌ పాగా..!

ABN , First Publish Date - 2021-03-05T04:56:00+05:30 IST

ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు ఆక్రమణదారులు గద్దల్లా వాలిపోతున్నారు.

ప్రభుత్వ జాగా..   వేసెయ్‌ పాగా..!
ఎక్స్‌కవేటర్‌తో చదును చేసి కంచె వేసిన ఆక్రమణదారులు

మత్స్య శాఖ భూమి ఆక్రమణకు చదును

ఎవరికి వారుగా ముళ్ల కంచెల ఏర్పాటు

విలువ రూ.60 లక్షలకుపైమాటే!


ఉదయగిరి రూరల్‌, మార్చి 4 : ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు ఆక్రమణదారులు గద్దల్లా వాలిపోతున్నారు.   తమ పలుకుబడి ఉపయోగించి చుట్టూ కంచె వేసేస్తున్నారు. అలాంటిదే ఉదయగిరి ప్రాంతంలో జరిగింది. కొంత నీకు.. కొంత నాకు అంటూ ఎక్స్‌కవేటర్‌తో ముళ్ల చెట్లను తొలగించి భూమిని చదును చేసేసి కంచె వేశారు. వివరాల్లోకి వెళితే.. ఉదయగిరి మండలం గండిపాళెం గ్రామంలో చేపపిల్లల పెంపకం కోసమై రెండు దశాబ్దాల క్రితం 173/2 సర్వేనెంబర్‌లో 5.18 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ మత్స్య శాఖకు కేటాయించింది. అప్పట్లో మత్స్యశాఖ ఓ గదితోపాటు చేపపిల్లల కోసం సుమారు అరెకరా స్థలంలో 30 తొట్లు నిర్మించింది. కొన్నేళ్లపాటు సాగిన చేపపిల్లల కేంద్రం అనంతరం మూతపడింది. ప్రస్తుతం ఆ కేంద్రం శిథిలావస్థకు చేరడంతో ఆక్రమణదారుల కన్ను ఆ భూమిపై పడింది. 5.18 ఎకరాల భూమిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం 1.17 ఎకరాలను కేటాయించారు. అలాగే ఇటీవల ఇంటి నివేశన స్థలాల కోసం 1.28 ఎకరాలు కేటాయించి లే అవుట్‌ వేశారు. మిగిలిన 2.73 ఎకరాలలో రోడ్లు, ఇతరత్రా కాలువల కింద 73 సెంట్లు పోగా 2 ఎకరాలు మిగిలి ఉంది. ఈ భూమి గ్రామానికి సమీపంలో ఉండటం, చుట్టూపక్కల లేఅవుట్లు వేసి ఉన్నారు. దీంతో ఈ భూమికి విలువ పెరిగిపోయింది. గండిపాళెం జలాశయం సైతం దగ్గర ఉండడంతో ఎకరా భూమి రూ.30 లక్షల వరకు పలుకుతోంది. దీంతో గ్రామానికి చెందిన కొందరు ఆక్రమణదారులు ఆ భూమిపై కన్నేశారు. ఆక్రమించిన స్థలం విలువ రూ.60 లక్షలకుపైగా ఉంటుందని గ్రామస్థులు తెలుపుతున్నారు. ప్రభుత్వ స్థలంతోపాటు  ఆ పక్కనే ఉన్న భవనాలు, తొట్లను సైతం ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటే ఆక్రమణదారులు ఎంతకు బరితెగిస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


కేసులు నమోదు చేస్తాం

గండిపాళెం గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. ఆక్రమణకు పాల్పడిన వారి వివరాలు అందజేయాలని ఇప్పటికే మా సిబ్బందిని ఆదేశించాం. 

- హరనాథ్‌, తహసీల్దారు, ఉదయగిరి 

Updated Date - 2021-03-05T04:56:00+05:30 IST