WhatsApp Messages Interception: ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్‌పై ప్రభుత్వం కన్ను

ABN , First Publish Date - 2022-09-22T20:41:02+05:30 IST

ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చితే, వాట్సాప్ సందేశాలు ఇక ఎంత మాత్రం యూజర్ల

WhatsApp Messages Interception: ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్‌పై ప్రభుత్వం కన్ను

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చితే, వాట్సాప్ సందేశాలు ఇక ఎంత మాత్రం యూజర్ల మధ్య వ్యక్తిగతమైనవిగా ఉండబోవు. వాట్సాప్, సిగ్నల్ వంటి వేదికలపై యూజర్లు పరస్పరం ఇచ్చి, పుచ్చుకునే సందేశాలను, కాల్స్‌ను అడ్డగించి, పరిశీలించేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును బుధవారం రాత్రి వెబ్‌సైట్‌లో ప్రచురించింది. 


కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రచురించిన టెలికమ్యూనికేషన్స్ బిల్లు ముసాయిదా ప్రకారం, వాట్సాప్ (WhatsApp), సిగ్నల్ (Signal) వంటి ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సర్వీసెస్‌ను అడ్డగించి, విని, పరిశీలించేందుకు అవకాశం కల్పించే చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ వేదికలపై సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెల్లడి కాదని, దాని గోప్యతకు భంగం కలగని రీతిలో పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఈ కంపెనీలు చెప్తున్న సంగతి తెలిసిందే. 


ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లులోని నిర్వచనాలను పరిశీలించినపుడు, టెలికమ్యూనికేషన్ సర్వీసులు అనే పదం అర్థ పరిధిలోకి బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసులు, ఎలక్ట్రానిక్ మెయిల్ (e-mail), వాయిస్ మెయిల్, వాయిస్, వీడియో అండ్ డేటా కమ్యూనికేషన్ సర్వీసెస్, ఆడియోటెక్స్ సర్వీసెస్, వీడియోటెక్స్ సర్వీసెస్, ఫిక్స్‌డ్ అండ్ మొబైల్ సర్వీసెస్, ఇంటర్నెట్ అండ్ బ్రాడ్‌బాండ్ సర్వీసెస్, శాటిలైట్-బేస్డ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ వంటివి వస్తాయి. అదేవిధంగా ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు, విమానాల్లో, సముద్రంపైన కనెక్టివిటీ సర్వీసులు, ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్స్ సర్వీసులు, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ సర్వీసులు, టెలికమ్యూనికేషన్ శాఖ యూజర్లకు అందజేసే ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులు కూడా టెలికమ్యూనికేషన్ సర్వీసులే. భవిష్యత్తులో నోటిఫికేషన్ ద్వారా ఏదైనా ఇతర సేవను టెలికమ్యూనికేషన్ సర్వీసుగా చేర్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. 


ఈ ముసాయిదాపై అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. టెలికమ్యూనికేషన్ కోసం ఉద్దేశించిన డేటా స్ట్రీమ్ లేదా ఇంటెలిజెన్స్ లేదా ఇన్ఫర్మేషన్‌ కూడా మెసేజెస్ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి అప్లికేషన్ల ద్వారా చేసే వాయిస్, వీడియో కాల్స్‌ను కూడా అడ్డగించి, పరిశీలించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఈ ముసాయిదా బిల్లు చెప్తోంది. 


ఈ బిల్లు యథాతథంగా చట్టంగా మారితే, టెలికాం పరిశ్రమపై ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్‌కు ప్రైవసీ, సెక్యూరిటీ ఉంటాయని భరోసా ఇస్తూ ఈ సంస్థలు మనుగడ సాగిస్తున్న సంగతి తెలిసిందే. 


భారత దేశ సార్వభౌమాధికారానికి లేదా విదేశాలతో సత్సంబంధాలకు లేదా ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి భావిస్తే, ఏ మెసేజ్‌నైనా ప్రసారం చేయరాదని ఆదేశించవచ్చు,  లేదా సంబంధిత అధికారికి దానిని వెల్లడించాలని ఆదేశించవచ్చు. అదేవిధంగా ఏదైనా నేరాన్ని ప్రోత్సహించకుండా నిరోధించేందుకు కూడా ఇటువంటి చర్య తీసుకోవచ్చు. ఈ నిబంధన వల్ల వాట్సాప్, సిగ్నల్ వంటి ప్లాట్‌ఫారాల ద్వారా చేసుకునే కాల్స్, పంపుకునే సందేశాలను అడ్డగించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. 




Updated Date - 2022-09-22T20:41:02+05:30 IST