ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు ఆదాయం

ABN , First Publish Date - 2021-05-17T05:07:21+05:30 IST

ప్రభుత్వ స్థలాలపై కొందరు ప్రైవేటు వ్యక్తులు పెత్తనం చేస్తున్నారు. వాటిని ఆక్రమించి చిరువ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. నెలకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు ఆదాయం
పెద్దబస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన దుకాణాలు

పొదిలిలో పలు స్థలాలను ఆక్రమించి నెలనెలా అద్దెలు 

వేలాది రూపాయలు వసూలు

చిరు వ్యాపారుల ముసుగులో 

కొందరి నయాదందా

చోద్యం చూస్తున్న అధికారులు 

నగర పంచాయతీ ఆదాయానికి గండి

పొదిలి, మే 16 : ప్రభుత్వ స్థలాలపై కొందరు ప్రైవేటు వ్యక్తులు పెత్తనం చేస్తున్నారు. వాటిని ఆక్రమించి చిరువ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. నెలకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అడ్డుకో వాల్సిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఆక్రమణదారుల నుంచి నెలవారీ మూమూళ్లు ముట్టడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పట్టణంలోని చిన్నబస్టాండ్‌, పెద్దబస్టాండ్‌, ఎంపీడీవో కార్యాలయం ఎదురు, హౌసింగ్‌, పంచాయతీ కార్యాలయం పక్కన, విశ్వనాథపురం లోని కరెంట్‌ ఆఫీసువీధి తదితర ప్రాంతాల్లో పంచాయతీ, ఆర్‌అండ్‌బీ స్థలాలు ఉన్నాయి. వాటిలో కొందరు చిరువ్యాపారుల ముసుగులో పాగా వేశారు. అనంతరం వ్యాపారులకు అద్దెలకు ఇచ్చే వ్యహారానికి తెరతీశారు. పెద్దబస్టాండ్‌, చిన్నబస్టాండ్‌, విశ్వనాథపురం ప్రాంతాలు వ్యాపారకూడళ్లు కావడంతో ఈదుకాణాలకు మరింత  డిమాండ్‌ ఏర్పడింది. 

పంచాయతీ ఆదాయానికి గండి

గతంలో ఖాళీ స్థలా ల్లో దుకాణాల ఏర్పాటుకు పంచాయతీ అధికా రులు సంవత్సరానికి ఒకసారి వేలం పాట నిర్వహించేవారు. అద్దెల రూపంలో వచ్చిన సొమ్మును పంచాయతీ ఖజానాకు జమ చేసే వారు. అయితే కొన్నేళ్ల నుంచి నామమాత్రంగా కొన్ని దుకాణాలకు మాత్రమే తూతూమంత్రంగా వేలం నిర్వహించి చేతులు దులుపుకుంటూ పరోక్షంగా ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహిస్తు న్నారు. మరికొంతమంది అయితే సంవత్సరాల తరబడి వారి పరిధిలోని దుకాణాలు ఉంచుకొని వ్యాపారాలు కొనసాగిస్తు న్నారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి హౌసింగ్‌ కార్యాలయం వరకూ ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్‌లో ప్రైవేటు వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పెద్దబస్టాండ్‌, చిన్నబస్టాండ్‌, పంచాయతీ ఆర్‌అండ్‌బీ స్థలాలలో దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలు వసూలు చేస్తున్నారు. దీంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. 

80కుపైగా అనధికారిక దుకాణాలు 

పట్టణంలోని ప్రధాన సెంటర్‌లలో 80కుపైగా అనధికారిక దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీటికి అద్దెల రూపంలో ప్రైవేటు వ్యక్తులు నెలకు సుమారు రూ.2లక్షలకు పైన వసూలు చేస్తున్నారు. వీరి నుంచి పంచాయతీ అధికారులు మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సర్వే నిర్వహించి పట్టణంలోని దుకాణాలను గుర్తించి, కూడలి ప్రాంతాల్లో వ్యాపారాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి నగరపంచాయతీ అధికారులు వేలం ప్రక్రియను నిర్వహిస్తే  పంచాయతీకి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇప్పటికైన అధికారులు ఆవైపు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-05-17T05:07:21+05:30 IST