ప్రభుత్వ కార్యాలయ జప్తునకు Court ఆదేశం

ABN , First Publish Date - 2022-05-25T18:04:24+05:30 IST

రైతులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన బళ్లారి డివిజన్‌ ప్రజా పనుల శాఖ కార్యాలయ జప్తునకు బళ్లారి సీజేఎం కోర్టు గత నెల 27న వారెంట్‌ జారీ చేస్తూ

ప్రభుత్వ కార్యాలయ జప్తునకు Court ఆదేశం

- భూ పరిహారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం

- కార్యాలయం ముందు బైఠాయించిన బాధిత రైతులు


బళ్లారి(బెంగళూరు): రైతులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన బళ్లారి డివిజన్‌ ప్రజా పనుల శాఖ కార్యాలయ జప్తునకు బళ్లారి సీజేఎం కోర్టు గత నెల 27న వారెంట్‌ జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు అమలు చేసేందుకు కోర్టుకు వేసవి సెలవులు ఉన్న కారణంగా ఆలస్యమైంది. ఈ నెల 22న కోర్టు పునఃప్రారంభం కావడంతో బళ్లారి సీజేఎం ఆదేశాల ప్రకారం మంగళవారం కోర్టు అధికారులు, సంబంధిత న్యాయవాదులు జప్తు వారెంట్‌తో నగరంలోని ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. జప్తు వారెంట్‌ ఆదేశ పత్రాలను ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎస్‌హెచ్‌ పూజార్‌కు అందజేశారు. ఇదే సమయంలో భూమిని కోల్పోయిన సంగనకల్లు, సిరివార, మోకా, ఎర్రగుడి గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రజా పనుల శాఖ డివిజన్‌ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తూ,  ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ముందు ఆందోళనకు దిగారు. పరిహారం అందజేసే వరకు కార్యాలయం నుంచి కదిలేది లేదని బైఠాయించారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న కారణంగా ఎవరూ ఆందోళన చేయరాదని సంబంధిత న్యాయవాదులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పరిహారం అందలేదన్న బాధతో రైతులు కొద్దిసేపు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల క్రితం బళ్లారి నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు రోడ్డు అభివృద్ధిలో భాగంగా అ ప్పటి బీజేపీ ప్రభుత్వ సంగనకల్లు, సిరివార, కప్పగల్లు, మోకా, ఎర్రగుడి గ్రామాల రైతుల నుంచి వందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుందన్నారు. అప్పట్లో భూమి ప్రాధాన్యతను బట్టి ఎకరాకు రూ. 15 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ధర కల్పిస్తూ కొనుగోలు చేసిందని చెప్పారు. పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టగా కంటితుడుపుగా 25 శాతం మాత్రమే డబ్బు చెల్లించాలరని పేర్కొన్నారు. మిగిలిన 75 శాతం మొత్తం పదేళ్లు గడిచినా తమ చేతికి అందకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. మంత్రి బీ శ్రీరాములు అప్పటి బీజేపీ ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్నారని, ప్రస్తుతం రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ప్రజా పనుల శాఖ అధికారుల నిరక్ష్యంపై జప్తుతో కూడిన వారెంట్‌ను జారీ చేస్తూ ఈ నె ల 31వ తేదీ వరకు గుడువు విధించింది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పూజార్‌ మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల పరిహారం అందించడంలో ఆలస్యమైన మాట వాస్తవమేనని, మరికొంత సమయం ఇవ్వాలని వారెంట్‌తో వచ్చిన న్యాయవాదిని కోరారు. పరిహారం చెల్లించేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుబట్టడంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి విషమించడంతో ప్రజా పనుల శాఖ ఉన్నతాధికారులు న్యాయవాదితో ఫోన్‌లో రెండు మూడు రోజులు గడువు కావాలని కోరడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు బసవరాజు స్వామి, దస్తగిరి సాబ్‌, రంగస్వామి, మారెణ్ణ, కుమారగౌడ, సోమలింగప్ప, రమేష్‌, ఫకూర్‌ బాబు, మహ్మద్‌, బి. రమేష్ లతో పాటు సంగనకల్లు, సిరివార, మోకా, ఎర్రగుడి గ్రామానికి చెందిన  రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T18:04:24+05:30 IST