నిమ్మగడ్డ వ్యవహారంపై ఏపీ అడ్వకేట్ జనరల్ వివరణ..

ABN , First Publish Date - 2020-05-31T03:30:06+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు వ్యవహారంలో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

నిమ్మగడ్డ వ్యవహారంపై ఏపీ అడ్వకేట్ జనరల్ వివరణ..

అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు వ్యవహారంలో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్ మీడియా ముందుకొచ్చారు. శనివారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్‌ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై వివరణ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్‌ కేసుపై హైకోర్టు తీర్పు కాపీ ఇవాళ అందిందని.. నిన్న (శుక్రవారం) మధ్యాహ్నం 3:30కి నిమ్మగడ్డ రమేష్ ఓ సర్క్యులర్ జారీ చేశారన్నారు. తాను బాధ్యతలు చేపట్టినట్టు వివిధ శాఖల అధికారులకు సర్క్యులర్‌ పంపారన్నారు. జడ్జిమెంట్ ఉదయం 11:.30కి వస్తే మధ్యాహ్నం 3:30గంటలకే సర్క్యులర్‌ ఇచ్చారని తెలిపారు.


స్టే అప్లికేషన్ వేశాం!

 ఎస్ఈసీగా రెస్టోర్ అయ్యానంటూ రమేష్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు. రమేష్‌ హైదరాబాద్‌లో ఉండి విజయవాడ ఆఫీస్ అడ్రస్‌తో సర్క్యులర్ ఇచ్చారు. నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించినట్టుగా అన్ని శాఖల అధికారులకు సర్క్యులర్ జారీ చేయాలని ఎస్ఈసీ కార్యాలయానికి సూచించారు. ఎస్ఈసీ వాహనాలను వెంటనే హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్‌కు పంపాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మిడీయేట్ ఎఫెక్టుగా ఎస్ఈసీ బాధ్యతలు తీసుకోవాలని హైకోర్టు చెప్పలేదు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో స్టే అప్లికేషన్ వేశాం. అదే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్‌ అడ్వకేట్ దృష్టికి తీసుకెళ్లాం అని అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు.


సుప్రీంకోర్టుకు వెళ్తాం..

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిమ్మగడ్డ వ్యవహరించలేదు. హైకోర్టు తీర్పును గెలుపు, ఓటములుగా మేం చూడడం లేదు. ఎస్ఈసీని నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే రమేష్ కుమార్ పున: నియామకానికి కూడా ఇది వర్తిస్తుంది. రమేష్ పునరుద్దరణకు ఇచ్చుకున్న సర్కులర్లు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా లేవు. ఎస్ఈసీలను నియమించే అధికారం ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా గల వ్యక్తికి లేదని హైకోర్టు చెప్పింది..?. ఇదే నిజమైతే 2016లో రమేష్ కుమార్ నియమిస్తూ చేసిన ఉత్తర్వులూ చెల్లుబాటు కావు. ఇలాంటి సందిగ్ధత ఉంది కాబట్టే సుప్రీం కోర్టుకెళ్లాలని భావించాం’ అని అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-31T03:30:06+05:30 IST