ద్వేషం నింపేందుకే ద కాశ్మీర్ ఫైల్స్‌కు ప్రచారం: ఫరూక్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2022-03-22T19:55:41+05:30 IST

ప్రజల్లో తమపై మరింత ద్వేషం నింపేందుకే కాశ్మీర్ ఫైల్స్‌ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై, బీజేపీపై విమర్శలు గుప్పించారు.

ద్వేషం నింపేందుకే ద కాశ్మీర్ ఫైల్స్‌కు ప్రచారం: ఫరూక్ అబ్దుల్లా

ప్రజల్లో తమపై మరింత ద్వేషం నింపేందుకే ద కాశ్మీర్ ఫైల్స్‌ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ద కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఒక దురుద్దేశంతోనే ఈ చిత్రాన్ని రూపొందించారని అన్నారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాలు కావాలనే ద కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి రాయితీలు ప్రకటిస్తూ, ప్రచారం కల్పిస్తున్నాయి. ప్రజలతోపాటు, సైనికులు, పోలీసులు తప్పనిసరిగా ఈ చిత్రాన్ని చూడాలని చెబుతున్నాయి. దీని ద్వారా ప్రజల్లో మాపై మరింత ద్వేషం పెంచాలనుకుంటున్నాయి. 1990 నాటి సంఘటనల్లో హిందువులు, ముస్లింలు అందరూ ఇబ్బందిపడ్డారు. దీని గురించి తలచుకుంటే ఇప్పటికీ నా గుండె బరువెక్కుతుంది. ఈ ఘటనల వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయి. అప్పట్లో జర్మనీలో హిట్లర్, గోబెల్స్ పెంచుకున్న ద్వేషం వల్ల లక్షల మంది యూదులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ప్రచారం వల్ల ఇంకెంతమందికి ఆ పరిస్థితి వస్తుందో’’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు. 1990లో కాశ్మీర్‌లో పండిట్లపైనే కాకుండా ముస్లింలు, సిక్కులకు కూడా ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒక నిజ నిర్ధరణ కమిషన్ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. 


Updated Date - 2022-03-22T19:55:41+05:30 IST