Abn logo
May 22 2020 @ 01:55AM

ఎయిర్‌పోర్టుకు 2 గంటల ముందే వెళ్లాలి

 • విమాన ప్రయాణాలకు ఏఏఐ మార్గదర్శకాలు
 • వృద్ధులు, గర్భిణులు, అస్వస్థులకు నో ఎంట్రీ
 • విధిగా మాస్కులు, చేతి గ్లౌవ్స్‌, భౌతిక దూరం 
 • ఆరోగ్య సేతు లేదా ఫారంలో హెల్త్‌ డిక్లరేషన్‌
 • ప్రయాణికుల పాదరక్షలు, బూట్లకు శానిటైజేషన్‌
 • కనిష్ఠ, గరిష్ఠ చార్జీలను నిర్దేశించిన కేంద్రం
 • రూ. 2 వేలు - రూ. 18,600 మధ్య ఖరారు
 • ప్రస్తుతం జూన్‌ 1 తర్వాతి తేదీలకే బుకింగ్‌
 • విమానయానం.. 7 ధరల్లో


లాక్‌డౌన్‌తో 60 రోజులుగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలు ఈ నెల 25 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌-19 కల్లోలానికి ముందు నడిచిన రోజువారీ విమాన సర్వీసుల సంఖ్యలో మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు భారత విమానాశ్రయాల సంస్థ (ఏఏఐ) గురువారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.  


న్యూఢిల్లీ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మే 21 (ఆంధ్రజ్యోతి): విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా చార్జీలను పెంచకుండా ఉండేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. దాదాపు 60 రోజుల తర్వాత విమాన సేవలు ఈ నెల 25 నుంచి పునరుద్ధరణ కానున్న నేపథ్యంలో.. ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ (1934) ప్రకారం కనిష్ఠ, గరిష్ఠ చార్జీలను నిర్దేశిస్తూ పౌర విమానయాన శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణ సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని విమాన సేవలను ఏడు కేటగిరీలుగా విభజించింది. ఆ ప్రకారం విమాన చార్జీలు రూ. 2వేలు - రూ. 18,600 మధ్యలోనే ఉండనున్నాయి. విమానాల్లోని తొలి 40ు సీట్లకు కనీస చార్జీలను మాత్రమే వసూలు చేయాల్సి ఉం టుంది. ఉదాహరణకు.. ఢిల్లీ నుంచి ముంబైకి చార్జీలు రూ. 3,500 - రూ. 10,000 మధ్యలో ఉంటాయి. 40ు సీట్ల చార్జీలను రూ. 3,500 - రూ. 6,700 మధ్యలో మాత్రమే వసూలు చేయాలి. కాగా.. సెంటర్‌ ఫర్‌ ఏసియా పసిఫిక్‌ ఏవియేషన్‌ (కాపా), ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ)లు కేంద్రం నిర్ణయాన్ని ఖండించాయి. విమానయాన సంస్థలకు చార్జీల నిర్ణయంలో స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడ్డాయి. పూర్తి కాని కసరత్తు

ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా.. ఏయే రూట్లలో ఎన్ని సర్వీసులు నడపాలనేదానిపై ఇంకా కసరత్తు పూర్తికాలేదు. ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు  నడిచే సర్వీసులకు సంబంధించి ఇంకా బుకింగ్‌లు తెరుచుకోలేదు. అయితే అన్ని విమాన సంస్థలు జూన్‌ 1 నుంచి సర్వీసులు నడిపేందుకు బుకింగ్‌లు మొదలు పెట్టాయి. జూన్‌ 1 తర్వాత ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చార్జీలు సాధారణంగానే ఉన్నాయి. జూన్‌ 1న హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి కనిష్ఠ, గరిష్ఠ టిక్కెట్‌ చార్జీలు రూ. 4760, రూ. 7,515గా ఉన్నాయి. అదే జూన్‌ 5న ఈ రూట్‌లో కనిష్ఠ ధర రూ.2999గా ఉండడం గమనార్హం. అన్ని ప్రధాననగరాలకూ సాధారణ చార్జీలే ఉన్నాయి.


భౌతిక దూరం నిబంధన లేదు

దేశీయ విమాన సర్వీసుల్లో భౌతిక దూరం నిబంధనేమీ ఉండదు. ఇంతకు ముందులాగే అన్ని సీట్లలో ప్రయాణికులను కుర్చోబెట్టేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఇటీవల భౌతి క దూరం తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసినా.. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి సీటింగ్‌లో తేడా ఉండదని తేల్చేశారు. స్వల్పకాలిక విమాన యానం చేసిన వారికి 14 రోజుల క్వారంటైన్‌ అవసరం లేదన్నారు. అయితే దీర్ఘకాలం ప్రయాణించి ఉంటే క్వారంటైన్‌ తప్పనిసరన్నారు. • ప్రయాణికులు పాటించాల్సినవి..
 1. తప్పనిసరిగా మాస్క్‌, గ్లౌవ్స్‌లు ధరించాలి
 2. భౌతిక దూరం నిబంధన కచ్చితం.
 3. ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉండాలి. ఆ యాప్‌లో ‘గ్రీన్‌ సిగ్నల్‌’ వస్తేనే విమానాశ్రయంలోకి అనుమతిస్తారు. 14 ఏళ్లలోపు పిల్లలకు ఇది వర్తించదు
 4. సేతు యాప్‌, అది లేదంటే ఎయిర్‌పోర్టుల్లో ఫారాల ద్వారా హెల్త్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి
 5. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడేవారికి విమానాశ్రయాల్లో అనుమతి ఉండదు
 6. వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడే వారికి నో ఎంట్రీ
 7. కొవిడ్‌ పాజిటివ్‌ చరిత్ర ఉన్నవారు, కట్టడి ప్రాంతాల్లో ఉండేవారిని అనుమతించరు
 8. చెక్‌-ఇన్‌ లగేజీగా ఒకే బ్యాగును తీసుకురావాలి. ఒక క్యాబిన్‌ బ్యాగేజీకే అనుమతి. 
 9. వ్యక్తిగత వాహనాలు, క్యాబ్‌లను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి
 10. ప్రయాణానికి కనీసం రెండు గంటల ముందు విమానాశ్రయాన్ని చేరుకోవాలి. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement