కనీసం ఓపీ సేవలైనా..

ABN , First Publish Date - 2021-08-04T05:22:26+05:30 IST

జిల్లాలో ఏలూరు ప్రభుత్వాసుపత్రిని పూర్తిస్థాయిలో కరోనా ఆస్పత్రిగా ఏప్రిల్‌ 16 నుంచి మార్పు చేసి పాజిటివ్‌ సోకిన వారికి వైద్య సేవలందిస్తున్నారు.

కనీసం ఓపీ సేవలైనా..
ఏలూరు ప్రభుత్వాస్పత్రి

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అందని సాధారణ వైద్యం 

ప్రైవేటు ఆసుపత్రికి వెళ్దామంటే తప్పని ఆర్థిక భారం

తల్లడిల్లిపోతున్న షుగరు, బీపీ వ్యాధిగ్రస్తులు

జిల్లాలో ఏలూరు ప్రభుత్వాసుపత్రిని పూర్తిస్థాయిలో కరోనా ఆస్పత్రిగా ఏప్రిల్‌ 16 నుంచి మార్పు చేసి పాజిటివ్‌ సోకిన వారికి  వైద్య సేవలందిస్తున్నారు. అప్పటి నుంచి సాధారణ వైద్య సేవలు నిలిపివేయడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రతి రోజు షుగరు, బీపీ వ్యాధిగ్రస్తులు వందలాది మంది పరీక్షలు చేయించుకుని మందులు తీసుకెళ్తుండే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గినందున కనీసం ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని విన్నవిస్తున్నారు.

ఏలూరు క్రైం, ఆగస్టు 3 : కరోనా కష్టకాలం.. ఈ మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి నిత్యం వస్తూనే ఉంది. ఎవరిలో ఏముందో తెలియని పరిస్థితిలో జీవితాలను గడుపుతున్నాం. కరోనా వేవ్‌ టు జిల్లాలో మార్చిలో ప్రవేశించడంతో క్రమేపీ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్పు చేశారు. కొన్ని పాక్షికంగా చేయగా ఏలూరు ప్రభుత్వా సుపత్రిని పూర్తిస్థాయిలో కరోనా ఆస్పత్రిగా ఈ ఏడాది ఏప్రిల్‌ 16 నుంచి మార్చారు. అప్పటి నుంచి సాధారణ వైద్య సేవలు లేవు. మే, జూన్‌ మొదటి వారం వరకూ ఆస్పత్రిలోని 300 పడకలు నిండిపోయాయి. క్రమేపీ తగ్గిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో 450 పడకల సామర్థ్యం ఉండగా 333 ఆక్సిజన్‌ పడకలను కరోనా బాధితుల కోసం సిద్ధంగా ఉంచారు. మిగిలిన వాటిని గర్భిణులు, చిన్న పిల్లలకు ప్రత్యేక విభాగం, తల్లీబిడ్డల వైద్య సేవల విభాగంలో ఉంచారు. తల్లీబిడ్డల విభాగానికి సంబంధించి వైద్య సేవలు పూర్తిగానే నిర్వహిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు కొనసా గించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫరల్‌ చేస్తున్నారు. జిల్లాలో ప్రతి రోజు షుగరు, బీపీ వ్యాధిగ్రస్తులు వందలాది మంది పరీక్షలు చేయించుకుని మందులను తీసుకువెళ్తూ ఉంటారు. ఈ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. 

ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు అందిం చాలని సూచించడంతో అన్ని వైద్య పరీక్షలు, కొవిడ్‌ పరీక్ష చేయించుకుని వస్తేనే రోగిపై చేయి వేసి పరీక్ష చేస్తున్నారు. ఈ పరీక్షలు చేయించాలంటే ఐదు వేల రూపా యల వరకూ ఖర్చు అవుతుందని బాధితులు వాపోతున్నారు. దగ్గు, జలుబు వస్తే వారికి వైద్య సేవలు అందించడానికి నిరాకరిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా మళ్లీ హెచ్‌ఆర్‌ సీటీ చెస్ట్‌ స్కాన్‌ చేయించుకోమని సూచిస్తున్నారు. ఈ స్కాన్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర మూడు వేలు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. 

200 పడకలకైనా అనుమతివ్వాలి..

ప్రస్తుతం ఆసుపత్రిలో కరోనా బాధితులు 87 మంది  చికిత్స పొందుతున్నారు. వీరిలో ప్రమాదకరమైన కేసులు ఏమీ లేవని చెబుతున్నారు. మిగిలిన 246 పడకలు ఆస్పత్రిలో ఖాళీ గానే ఉన్నాయి. 200 పడకలకైనా సాధారణ వైద్య సేవలకు అధికారులు అనుమతిస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది.  కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కనీసం ఓపీ (ఔట్‌ పేషెంట్‌) సేవలను, షుగరు, బీపీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను అందించడానికి ప్రత్యేక వైద్య విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

Updated Date - 2021-08-04T05:22:26+05:30 IST