బ్యాంక్‌ డిపాజిటర్లకు మరింత భరోసా

ABN , First Publish Date - 2021-12-13T07:00:36+05:30 IST

బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందులో భాగంగానే బ్యాంక్‌ డిపాజిట్లపై ఇప్పటి వరకు ఉన్న రూ.లక్ష బీమా పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఈ చర్య బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుతుందన్నారు...

బ్యాంక్‌ డిపాజిటర్లకు మరింత భరోసా

  • అందుకే డిపాజిట్‌ బీమా సంస్కరణలు
  • రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు బీమా
  • ముందుగా లక్ష మందికి రూ.1,300 కోట్లు  
  • ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందులో భాగంగానే బ్యాంక్‌ డిపాజిట్లపై ఇప్పటి వరకు ఉన్న రూ.లక్ష బీమా పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఈ చర్య బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుతుందన్నారు. ఢిల్లీలో డిపాజిటర్స్‌ ఫస్ట్‌.. గ్యారంటీడ్‌ టైమ్‌ బౌండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పేమెంట్‌ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ విషయం చెప్పారు. ‘డిపాజిటర్ల ప్రయోజనాలే ముందు’ అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణ తీసుకువచ్చినట్టు తెలిపారు. దీంతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. కొన్ని బ్యాంకులు, సహకార బ్యాంకులపై విధించిన మారటోరియం కారణంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న దాదాపు లక్ష మంది డిపాజిటర్లకు వచ్చే 90 రోజుల్లో రూ.1,300 కోట్లు అందుతాయన్నారు. మరో మూడు లక్షల మంది డిపాజిటర్ల కు ఈ నెల 31న ఈ ఖాతా నుంచి నిధులు విడుదల చేయబోతున్నారు. ఈ చర్యతో బ్యాంకులు దివాలా తీసినా.. రూ.5 లక్షల వరకు ఉన్న తమ డిపాజిట్ల చెల్లింపులకు ఢోకా ఉండదనే నమ్మకం డిపాజిటర్లలో ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. డిపాజిటర్ల ప్రయో జనాలకు రక్షణ ఉంటే తప్ప.. బ్యాంకింగ్‌ వ్యవస్థ భద్రంగా ఉండదని స్పష్టం చేశారు. 


90 రోజుల్లోనే చెల్లింపులు: గతంలో ఏదైనా బ్యాంకు చెల్లింపులపై ఆర్‌బీఐ మారిటోరియం విధిస్తే బీమా రక్షణ ఉన్న రూ.లక్ష డిపాజిట్‌ సొమ్ము చేతికి వచ్చేందుకు సంవత్సరాలు పట్టేదని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణతో రూ.5 లక్షల వరకు ఉన్న డిపాజిట్లు 90 రోజుల్లోనే చేతికి అందుతాయన్నారు. బ్యాంకింగ్‌ సంస్కరణలు అమలు చేసేటప్పుడు తమ ప్రభుత్వం డిపాజిటర్లు, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుంటుందన్నారు. నష్ట భయాలు అధికంగా ఉండే మధ్య తరగతి ప్రజలకు ఈ బీమా పెంపు ఎంతగానో మేలు చేస్తుందన్నారు.


అధిక రాబడులపై జర జాగ్రత్త : డిపాజిట్లపై బీమా పరిమితి పెంపును ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్వాగతించారు. ఆర్‌బీఐ కూడా డిపాజిటర్ల ప్రయోజనాలే ముందు అనే విషయాన్ని నమ్ముతుందన్నారు. బ్యాంకులపై తమ నియంత్రణ, పర్యవేక్షణల పరమార్థం కూడా అదేనన్నారు. అయితే అధిక రాబడుల మోజులో పడి అసలుకే ఎసరు తెచ్చుకోవద్దని కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ ప్రజలను హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లు... అధిక నష్ట భయం కలిగి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 



Updated Date - 2021-12-13T07:00:36+05:30 IST