భూమాతను కుళ్లబొడిచి.. ప్రకృతి సంపదను కరిగించేసి!

ABN , First Publish Date - 2021-05-18T05:43:06+05:30 IST

ఉదయగిరి నియోజకవర్గంలో తెల్లరాయి (వైట్‌క్వార్జ్ట్‌) నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు తవ్వకాలు చేపట్టి సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు.

భూమాతను కుళ్లబొడిచి..  ప్రకృతి సంపదను కరిగించేసి!
ప్రభుత్వ భూమిలో తెల్లరాయి వెలికితీతకు తీసిన భారీ గుంత

 ప్రభుత్వ, అటవీ భూముల్లో తెల్లరాయి కోసం తవ్వకాలు

అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండ

ప్రతిరోజూ 20 నుంచి 30 లారీల తరలింపు 

మామూళ్ల మత్తులో అధికారులు 

ఆంధ్రజ్యోతి నిఘా


ఓ వైపు అధికార పార్టీ నేతల ఆశీర్వాదం.. మరోవైపు అధికారుల అండ... ఇంకేముంది... మెట్టప్రాంతంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపద అయిన తెల్లరాయిని (వైట్‌క్వార్ట్జ్‌) లోడ్ల కొద్దీ తవ్వేస్తున్నారు. మార్కెట్లో ఒక లోడ్‌ రూ.2 లక్షల వరకు పలుకుతోంది. రోజుకు 20 లోడ్ల వరకు సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇలా ప్రకృతి సంపదను దిగమింగుతున్నా అడిగేనాథుడే కరువయ్యారు.


ఉదయగిరి రూరల్‌, మే 17 : ఉదయగిరి నియోజకవర్గంలో తెల్లరాయి (వైట్‌క్వార్జ్ట్‌) నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు తవ్వకాలు చేపట్టి సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు, అధికారులకూ మామూళ్లు అందుతుండటంతో  ఎవరూ నోరెత్తడంలేదు. దీంతో యథేచ్ఛగా ప్రభుత్వ, అటవీ శాఖ భూముల్లో ఎక్స్‌కవేటర్‌తో నిత్యం తవ్వకాలు చేపడుతున్నారు. వెలికితీసిన రాయిని రాత్రికి రాత్రి తరలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కర్ఫ్యూ విఽధించడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ప్రతిరోజు 20 నుంచి 30 లారీల తెల్లరాయి అక్రమంగా తరలిపోతుంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. 


విరివిగా నిక్షేపాలు

సీతారామపురం మండలం బాలాయపల్లి, బెడుసుపల్లి, ఉదయగిరి మండలం కోటాయపల్లి, ఆర్లపడియ, కృష్ణంపల్లి, కొండాయపాళెం, దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం, కొత్తపేట, నర్రవాడ, వరికుంటపాడు మండలం తూర్పుబోయమడగల, వేంపాడు, రామాపురం, వింజమూరు మండలం జనార్దనపురం, చాకలకొండ, ఊటుకూరు గ్రామాలతోపాటు కలిగిరి, కొండాపురం మండలాల్లో తెల్లరాయి నిక్షేపాలు ఉన్నాయి. 


అనుమతి కొంత..

తెల్లరాయి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో అక్రమార్కులు యార్డు అనుమతి తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ, అటవీ శాఖ భూముల్లో ఎక్స్‌కవేటర్‌తో యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి యార్డుకు తరలిస్తున్నారు. యార్డులో కూలీలు రాయిని పగలగొట్టి వేరు చేస్తారు. అనంతరం రాత్రి సమయాల్లో లారీల్లో రాయిని తరలిస్తున్నారు. ఇటీవల వరికుంటపాడు మండలం తూర్పుబోయ మడగల రిజర్వు ఫారెస్టులో అక్రమంగా తవ్వకాలు చేపడుతుంటే అటవీ అధికారులు ఒక ఎక్స్‌కవేటర్‌ను, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. 


మామూళ్ల మత్తులో...

అక్రమార్కులకు ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారులను సైతం మామూళ్ల మత్తులో మంచుతూ వారి కార్యకలాపాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. కొంతమంది రెవెన్యూ, అటవీ శాఖాధికారులు అక్రమార్కులతో కలియ తిరుగుతూ వారు పబ్బం గడుపుకొంటున్నారు. ఉన్నతాధికారుల సమాచారం వారికి ముందుగానే అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.


సగానికి సగం ఆదాయం

తెల్లరాయికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండటంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వలు, ఆరుకాయలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం గ్రేడ్‌-ఏ రకం టన్ను రూ.6,000 నుంచి రూ.6,500 పలుకుతుంది. ఒక లారీ 30నుంచి 35 టన్నుల రాయి తరలిస్తుంది. ఓ లారీకి రూ.2 లక్షలు వచ్చినా రూ.లక్ష వరకు ఆదాయం ఉంటుందని అంటున్నారు. ప్రసుత్తం అధికంగా కృష్ణపట్నం పోర్టు, గూడూరు యార్డుకు రాయి తరలిస్తున్నారు. 



Updated Date - 2021-05-18T05:43:06+05:30 IST