ప్రభుత్వం RSS, VHP సొత్తు కాదు: BJP నేత

ABN , First Publish Date - 2022-04-27T00:01:39+05:30 IST

ప్రభుత్వానికి షరతులు పెట్టడానికి, మతపరమైన సున్నిత అంశాల్లో ప్రకటనలు ఇవ్వడానికి ముతాలిక్ ఎవరు? అలాంటి వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఆర్‌ఎస్ఎస్‌కో వీహెచ్‌పీకో చెందింది కాదని గుర్తించాలి..

ప్రభుత్వం RSS, VHP సొత్తు కాదు: BJP నేత

బెంగళూరు: కర్ణాటకలో మతపరమైన సున్నిత సమస్యలను లేవనెత్తడంపై శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్‌పై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముతాలిక్ తరుచూ స్పందిస్తున్నారు. కుదిరినప్పుడు ప్రభుత్వానికి బహిరంగ సలహాలు ఇస్తున్నారు. కాగా, దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ విశ్వనాథ్ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కో (RSS), విశ్వహిందూ పరిషత్‌కో (VHP) చెందినది కాదని స్పష్టం చేశారు.


మంగళవారం మైసూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో విశ్వనాథ్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వానికి షరతులు పెట్టడానికి, మతపరమైన సున్నిత అంశాల్లో ప్రకటనలు ఇవ్వడానికి ముతాలిక్ ఎవరు? అలాంటి వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఆర్‌ఎస్ఎస్‌కో వీహెచ్‌పీకో చెందింది కాదని గుర్తించాలి’’ అన్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం గుడుల వద్ద ముస్లింలు వ్యాపారం చేయొద్దన్న రైట్ వింగ్ గ్రూపుల తీరుపై విమర్శలు గుప్పించారు. వీహెచ్‌పీ, హిందూ జాగరణ వేదిక, భజరంగ్ దళ్, శ్రీరామ సేన వంటి గ్రూపుల ప్రకటనలపై మండిపడ్డారు.


‘‘ఇదేం పిచ్చితనం? ఇలాంటి చర్యల్ని ఏ దేవుడు, ఏ మతమూ సహించదు. మతాలు కలుపుగోలుగా ఉంటాయి, కానీ దేనికదే ప్రత్యేకంగా ఉండవు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కానీ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడం లేదు’’ అని విశ్వనాథ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఎంత మంది భారతీయులు ఇంగ్లాండ్‌లో ఉన్నారు? ఎంత మంది భారతీయులు ప్రపంచ దేశాల్లో దేశాల్లో ఉన్నారు? ఎంత మంది భారతీయులు ఇస్లాం దేశాల్లో పనులు చేస్తున్నారు? ఒకవేళ ఆయా దేశాల్లో భారతీయులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటి? దేశ విభజనలో జిన్నాతో వెళ్లడానికి వాళ్లు ఒప్పుకోక ఇక్కడే ఉన్నారు. వాళ్లు భారతీయులుగానే ఉన్నారు. వాళ్లు భారతీయులు, ఇతర దేశస్థులు కాదు’’ అని అన్నారు.

Updated Date - 2022-04-27T00:01:39+05:30 IST