Abn logo
Sep 26 2021 @ 23:25PM

ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి

డీహెచ్‌కు వినతిపత్రం అందిస్తున్న డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి.

నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 26 : వైద్య ఆరోగ్యశాఖలోని వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ గీతా ప్రసాదినికి  వినతి పత్రం అందచేశారు. ఆదివారం నెల్లూరుకు వచ్చిన డీహెచ్‌ను కలిసి తమ సమస్యలను తెలియచేశారు. టైమ్‌ బౌండ్‌ ప్రకారం 6 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని డిఫ్యూటీ సివిల్‌ సర్జన్లుగా, 12 ఏళ్లు పూర్తిచేసుకున్న వారికి సివిల్‌ సర్జన్లుగా, అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. పీహెచ్‌సీలలో పనిచేస్తున్న వారికి వాహన వసతి కల్పించాలన్నారు. జనరల్‌ సివిల్‌ సర్జన్లను మాత్రమే డీఎంహెచ్‌వోలుగా నియమించాలని కోరారు. తాజాగా విధుల్లోకి తీసుకున్న వైద్యులకు రెగ్యులర్‌ వారి మాదిరిగానే వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు డాక్టర్‌ ఖాదర్‌బాషా, డాక్టర్‌ మొయిన్‌, డాక్టర్‌ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.