కరోనా ఎఫెక్ట్.. మళ్లీ మొదలైన నైట్ కర్ఫ్యూలు

ABN , First Publish Date - 2020-11-21T20:45:42+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా రోజుకు 50,000 కంటే తక్కువగా ..

కరోనా ఎఫెక్ట్.. మళ్లీ మొదలైన నైట్ కర్ఫ్యూలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా రోజుకు 50,000 కంటే తక్కువగా నమోదవుతున్నప్పటికీ కొన్ని సిటీల్లో మాత్రం జూన్-జూలై నాటి పరిస్థితులను తలపిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాజధానులు, నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు కానీ, 144 సెక్షన్లు కానీ విధించాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఆయా రాష్ట్రాల్లో తాజా ఆంక్షల ప్రకారం...


ఢిల్లీలో కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌లు ధరించకుంటే రూ.2,000 జరిమానా విధించనున్నారు. పెళ్లిళ్లకు 200 మందికి బదులు 50 మంది అతిథులను మాత్రమే అనుమతిస్తున్నారు. మార్కెట్లు తెరచే ఉంటాయి కానీ గట్టి నిఘా ఉంచుతున్నారు. ఢిల్లీలోని పీతాంపురలో హునార్ హాత్‌ను జనం రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు రోజులకు ముందే ముగిస్తున్నారు.


ముంబైలో డిసెంబర్ 31 వరకూ స్కూళ్లు మూసే ఉంచాలని బీఎంసీ ఆదేశించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం 9వ తరగతి నుంచి 12 వరకూ నవంబర్ 23 నుంచి తెరవాల్సి ఉంది. అయితే. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నవంబర్ 23న తెరుచుకుంటున్నాయి. ముంబై సిటీలో లోకల్ రైళ్ల ఆపరేషన్ ఇంకా ప్రారంభించడం లేదని ముంబై మేయర్ ప్రకటించారు.


గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ తిరిగి పూర్తి కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పాలు, మందుల దుకాణాలను మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తున్నారు. అహ్మదాబాద్‌లో నైట్ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అమల్లోకి వచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. రాజ్‌కోట్, సూరత్, వడోదర్‌లోనూ నైట్ కర్ఫ్యూ విధించారు.


మధ్యప్రదేశ్‌లోని ఐదు నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు ఇండోర్, భోపాల్, గ్వాలియర్, రత్లామ్, విదిశలో నవంబర్ 21వ తేదీ నుంచి ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకూ ఈ కర్ఫ్యూ అమలవుతుంది. కంటైన్మెంట్ జోన్లలో మినహా రాష్ట్రంలో ఎక్కడా లాక్‌డౌన్ విధించడం లేదు. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ 1 నుంచి 8వ తరగతి వరకూ స్కూళ్లు మూసే ఉంటాయి. తాజా ఆదేశాలకు అనుగుణంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు హాజరవుతారని అధికారులు తెలిపారు. సినిమా హాళ్లు 50 శాతం సామర్థ్యంలోనే నడుస్తాయి.


రాజస్థాన్‌లోని అన్ని జిల్లాల్లో నవంబర్ 21 నుంచి సెక్షన్ 144 అమల్లోకి వస్తోంది. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ అమల్లోకి తెచ్చే అధికారాలను జిల్లా మేజిస్ట్రేట్‌లకు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు.

Updated Date - 2020-11-21T20:45:42+05:30 IST