గోవింద నామస్మరణం.. పులకించిన వంశధార తీరం

ABN , First Publish Date - 2021-02-24T05:33:13+05:30 IST

గోవింద నామస్మరణతో వంశధార నదీ తీరం పులకించిపోయింది. భక్తుల జయజయ ధ్వానాల నడుమ కాళీయమర్దన వేణుగోపాలుని చక్రతీర్థ స్నానం మంగ

గోవింద నామస్మరణం..  పులకించిన వంశధార తీరం
స్వామివారి చక్రతీర్థ స్నానానికి హాజరైన వేలాది మంది భక్తులు



గోవింద నామస్మరణం..

పులకించిన వంశధార తీరం

ఘనంగా వేణుగోపాలుని చక్రతీర్థ స్నానం

శ్వేతగిరి యాత్రకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు

శాలిహుండం (గార), ఫిబ్రవరి 23: గోవింద నామస్మరణతో వంశధార నదీ తీరం పులకించిపోయింది. భక్తుల జయజయ ధ్వానాల నడుమ కాళీయమర్దన వేణుగోపాలుని చక్రతీర్థ స్నానం మంగళవారం వేడుకగా సాగింది. భీష్మ ఏకాదశి సందర్భంగా  శ్వేతగిరిపై వేణుగోపాలుని యాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. అందులో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులకు మేళతాళాలతో అశేష జనవాహిని నడుమ వంశధార నదిలో చక్రతీర్థ స్నానం చేయించారు. అదే సమయంలో వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు వంశధార నదీ తీరానికి చేరుకున్నారు. అంతకు ముందు వేకువజామున ఆలయంలో ట్రస్ట్‌ బోర్డు అధ్యక్షుడు సుగ్గు మధురెడ్డి, లక్ష్మీనరసింహదేవిలతో అర్చకులు ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు  చేయించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం సాయంత్రానికే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. మంగళవారం వేకువజాము నుంచే క్యూలైన్‌లో బారులుదీరారు. కొండమధ్యలో వీరవసంతేశ్వరస్వామిని భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. కొండ దిగువన వరదరాజస్వామి, లక్ష్మీనరసింహస్వామిలను దర్శించుకున్నారు. 


 అరకొరగా ఆర్టీసీ సర్వీసులు

ఆర్టీసీ సర్వీసులను అరకొరగా నడపడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆలయానికి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల తాకిడి అధికంగా ఉంది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సీఐ అంబేడ్కర్‌, ఎస్‌ఐ హరికృష్ణల ఆధ్వర్యంలో ఇటు సింగుపురం జంక్షన్‌, అటు శ్రీకూర్మం జంక్షన్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించారు. వేలాది మంది భక్తులు రావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. స్వచ్ఛంద సంస్థలు విశేష సేవలందించాయి. బూరవిల్లి పాలకేంద్రం, బోరవానిపేట, పూసర్లపాడు, గారలో సత్యసాయి సేవా సమితితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మంచి నీరు, మజ్జిగ, ప్రసాదాన్ని అందించాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో చలివేంద్రాలు, అన్నదాన శిబిరాల వద్ద భక్తులు బారులుదీరారు. 



Updated Date - 2021-02-24T05:33:13+05:30 IST