అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): దేశ సుస్థిర అభివృద్ధికి స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం అత్యావశ్యకమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటిని అందించడంతో పాటు బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మనం గణనీయమైన ప్రగతిని సాధించామని చెప్పారు. బుధవారం యునిసెఫ్ నిర్వహించిన 7వ ‘వాష్’ సదస్సులో ఆయన వెబ్‌నార్ ద్వారా ప్రసంగించారు. ఏపీలో మనం-మన పరిశుభ్రత, కర్ణాటకలో స్వచ్ఛోత్సవ-నిత్యోత్సవ, తెలంగాణ లో పల్లెప్రగతి వంటి కార్యక్రమాలు ఆరోగ్యకర సమాజాన్ని సాధించడానికి దోహదం చేస్తున్నాయన్నారు. ‘వాష్’ లక్ష్యాల సాధనకు నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రంగాలవారితో సమన్వయం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.