కరోనా కట్టడిలో ప్రభుత్వాల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-08-07T10:45:20+05:30 IST

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వాల నిర్లక్ష్యం

ప్రజల్లో ఆత్మస్థయిర్యం నింపేందుకే పల్లెబాట

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రూరల్‌ మండలం పూలకుంటలో పల్లెబాట


అనంతపురంరూరల్‌, ఆగస్టు 6: కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం అనంతపురం జిల్లా పూలకుంట గ్రామంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ హాజరై, గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ మాస్కులు, కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికులతో కరోనా మహమ్మారి కారణంగా పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ సోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో కరో నా విజృంభిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు లోనుచేస్తోందన్నారు. ఈ క్రమంలో సీపీఐ తమవంతుగా అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్న ఉద్దేశంతో పల్లెబాట చేపట్టిందన్నారు.


        జిల్లావ్యాప్తంగా 500 గ్రామాల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 100 గ్రామాల్లో చేశామన్నారు. వ్యాధి ప్రజలను భయపెడుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్నారు. నెలకు రూ.350 కోట్లు, రోజుకు పాజిటివ్‌ బాధితుడికి రూ.500 ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తోందన్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో సేవలు అధ్వానంగా ఉన్నాయన్నారు.


అధికార పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇటీవల మంత్రుల సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేయటమే ఇందుకు నిదర్శమన్నారు. వైరస్‌ బాధితులకు భోజనం కూడా సరిగా పెట్టలేకపోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, జాఫర్‌, కార్యదర్శి వర్గసభ్యులు మల్లికార్జున, వేమయ్యయాదవ్‌, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, మండల కార్యదర్శి రమేష్‌, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు జాన్సన్‌బాబు, కుళ్లాయిస్వామి, వన్నారెడ్డి, అజయ్‌కుమార్‌, జిల్లా కార్యవర్గసభ్యుడు రమణ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T10:45:20+05:30 IST