పేదల బతుకులతో ప్రభుత్వాల చెలగాటం

ABN , First Publish Date - 2022-08-06T05:26:41+05:30 IST

పేదల బతుకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర ధరల పెరుగుదలపై మెడలో కురగాయల దండలతో నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

పేదల బతుకులతో ప్రభుత్వాల చెలగాటం
మెడలో కూరగాయలు వేసుకుని నిరసన తెలుపుతున్న షబ్బీర్‌అలీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ

కామారెడ్డి, ఆగస్టు 5: పేదల బతుకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర ధరల పెరుగుదలపై మెడలో కురగాయల దండలతో నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలు పెంచి పేదలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు మీదకు తీసుకువస్తున్నాయని అన్నారు. కులమతాల అలజడి సృష్టించి అమాయకులను రెచ్చగొడుతూ దేశం కోసం ధర్మం కోసం అంటూ ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారని అన్నారు. దేశంలో ఎయిర్‌పోర్టులు, సీపోర్టులను ప్రధాని మోదీ అంబానికి అమ్మేస్తే రాష్ట్రంలో 21వేల కోట్ల విలువ చేసే భూములను కేసీఆర్‌ అమ్మేస్తున్నారని ఆరోపించారు. 2014లో 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్‌ ఏం చేసిందని ప్రధాని మోదీ మాట్లాడారని, 60 ఏళ్లలో 60 రూపాయలు ఉన్న పెట్రోల్‌ ఇప్పుడు 120కి చేరిందని, 400 ఉన్న గ్యాస్‌ ధర రూ.1200లకు చేరిందని విమర్శించారు. సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 8 సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా 16 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. దేశంలోని ఇండస్ట్రీలను అమ్మేస్తున్నారని, సోయి ఉన్నోడు ఎవడైన పాలపై జీఎస్‌టీ విధిస్తారా అని ప్రశ్నించారు. దీనికి బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రాన్ని బంగారుమయం చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారం అయిందన్నారు. అద్దె ఇంట్లో ఉన్న కవిత దుబాయిలో బుర్జ్‌ఖలీపా కొనుక్కుందని, హద్దు అదుపు లేకుండా కేసీఆర్‌ కుటుంబ సభ్యులు సంపాదిస్తున్నారని అన్నారు. బాహుబలి ప్రాజెక్టుగా చెప్పుకునే కాళేశ్వరం మోటార్లు సంవత్సరంలో మునిగిపోయాయని బాహుబలి ఏమోగాని తెలంగాణ రైతులను ప్రజలను బలిపశువులను చేశారని విమర్శించారు. అక్కడ పని చేస్తున్న అధికారుల ఫొటోలు తీసి ఎక్కడ పెడతారోనని వారి ఫోన్లు లాక్కుని వారు వెళ్లిపోతాం అంటున్నా గేట్లు మూసి పోలీసు పహారా పెట్టారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్‌ ఉంటే ఇప్పుడు నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేశారని ఫలితంగా ఒక్కొక్కరిపై రూ. లక్షా 35వేల అప్పు ఉందన్నారు. ప్రజలు ఇకనైన ఆలోచించాలని కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్‌, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, శ్రీను, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-06T05:26:41+05:30 IST