ఎక్కడివక్కడే

ABN , First Publish Date - 2020-07-09T11:09:18+05:30 IST

సాగునీటి ప్రాజెక్టుల పనులు కూడా రద్దుల పద్దులో చేరిపోయాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటికీ రీ టెండర్లు ఖరారు చేసి కొత్త

ఎక్కడివక్కడే

సాగునీటి ప్రాజెక్టుల పనులకు బ్రేక్‌

రీ టెండర్లకు ప్రభుత్వం నిర్ణయం

తాజాగా జీవో విడుదల


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల పనులు కూడా రద్దుల పద్దులో చేరిపోయాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటికీ రీ టెండర్లు ఖరారు చేసి కొత్త   కాంట్రాక్టర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత పనులు రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబరు 365ను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టుల పనులు కూడా ఆగిపోనున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తారకరామ తీర్థసాగర్‌ మినహా అన్ని సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌ పనులను నిలిపేశారు. తారక రామతీర్థ సాగర్‌ పనులు రద్దు చేయకపోయినా... పురోగతి లేదు. తాజాగా నిలిపివేసిన వాటిలో తోటపల్లి ప్రాజెక్టు కాలువలకు సంబంధించిన ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఉన్నాయి. ఇందులో డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వలే ఉన్నాయి.


వీటిని పూర్తి చేయాలంటే మళ్లీ భూ సేకరణ అవసరం. 350 ఎకరాలు ఇంకా సేకరించాలి. భూ సేకరణ అడ్డంకుల కారణంగానే తాము ఏళ్ల తరబడి పనులు పూర్తి చేయలేకపోతున్నామని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు మొత్తుకుంటున్నారు. అయినప్పటికీ రెవెన్యూ శాఖ పట్టించుకోవటం లేదు. రెండు ప్యాకేజీల పరిధిలో రూ.60 కోట్ల పెండింగ్‌ పనులకు సంబంధించి ప్రభుత్వం పనులను నిలిపేసినట్లయింది. 


సువర్ణముఖీ నదిపై మక్కువ మండలం శంబర గ్రామం వద్ద మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. దీని పరిధిలో మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాలు ఉన్నాయి. 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది కాకుండా బొబ్బిలి మండలంలో మరో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా రూ.6 కోట్లతో చిన్న ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినా పనులు దశాబ్దాలుగా పూర్తి చేయలేక పోయారు. ఇవీ తాజాగా రద్దయ్యాయి.


మక్కువ మండలం శంబర గ్రామం వద్ద ఎడమ బ్రాంచి కాల్వ పరిధిలో గోముఖీ నదిపై నిర్మించ తలపెట్టిన అక్విడెక్టు పనులను ప్రభుత్వం నిలిపివేసింది. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో మంజూరైన ఈ పనులు పూర్తి కాకపోవటంతో రద్దుల పద్దులో చేర్చేసింది. 


నాగావళి నదీ పరీవాహక ప్రాంతంలో నదికి రెండు వైపులా వరద కట్టలు(కర కట్టలు) నిర్మించాలని తలపెట్టారు.  వీటి నిర్మాణానికి రూ.23 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. భూ సేకరణ సమస్యలతో అనేక గ్రామాల పరిధిలో కరకట్టల పనులు నిలిచిపోయాయి. వీటిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మళ్లీ నాగావళికి వరదలు వస్తే నదీ పరీవాహక గ్రామాలకు కష్టమే. సాగునీటి ప్రాజెక్టుల పనులు రద్దు చేస్తూ జీవో ఇచ్చిన విషయాన్ని నీటి పారుదల శాఖ ఉత్తర కోస్తా చీఫ్‌ ఇంజినీర్‌ శివ ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా జీవో వచ్చినట్లు తనకు తెలియదన్నారు. సీతానగరం మండలం పెద అంకలాం వద్ద సువర్ణముఖీ నదిపై నిర్మించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టును రూ.14 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-07-09T11:09:18+05:30 IST