హైదరాబాద్: కార్మిక హక్కులను కాలరాస్తూ, పెట్టుబడిదారి వర్గానికి కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాసే అధికారం పాలకులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పటిష్టమైన కార్మిక ఉద్యమాలను నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మిక చట్టాలకు సంస్కరణల పేరుతో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు పూర్తిగా కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. హక్కుల పరిరక్షణకు, ఐక్యపోరాటాలకు కార్మిక లోకం సిద్దం కావాలని రాఘవులు పిలుపునిచ్చారు.