ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-08-13T06:22:56+05:30 IST

బహుల సంస్కృతులకు నిలయం భారతదేశమని, అలాంటి దేశంలో సంస్కృతులను ప్రధాని మోదీ విచ్ఛిన్నం చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిలిగా ఏర్పడి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న  ప్రభుత్వాలు
మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

 - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ 

వేములవాడ, ఆగస్టు 12:  బహుల సంస్కృతులకు నిలయం  భారతదేశమని, అలాంటి దేశంలో సంస్కృతులను ప్రధాని మోదీ  విచ్ఛిన్నం చేస్తున్నారని,   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిలిగా ఏర్పడి ప్రజావ్యతిరేక  విధానాలను అవలంబిస్తున్నాయని   మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్రవారం వేములవాడ మండలానికి చేరుకుంది. ఈ సందర్బంగా నందికమాన్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం జాతీయత పేరు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తోందన్నారు.  తెలంగాణలో ప్రజాస్వామిక విలువలను, పౌర హక్కులను అణచివేస్తూ మోసపూరిత వాగ్ధానాలతో దుష్టపాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు.  దేశ నిర్మాణానికి తొలి ప్రధానిగా పునాది వేసినది జవహర్‌లాల్‌ నెహ్రూ అని, దేశంలో సాంకేతికత అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరాగాంధీ  అని అన్నారు. దేశ ఏర్పాటులో బీజేపీ పాత్ర శూన్యం అన్నారు. పీవినరసిహారావు, మనోహ్మాన్‌ సింగ్‌ తెచ్చిన ఆర్థిక సంస్కరణలే దేశ అభివృద్ధికి మూలంగా మారాయన్నారు. ప్రజలు అచ్చేదిన్‌ కన్నా పూర్వ దిన్‌నే కోరుకుంటున్నారన్నారు.  బీజేపీ ప్రభుత్వంలో ధరలు అకాశాన్ని అంటాయన్నారు.  రాష్ట్రంలో కేసీఆర్‌ మాటలు నమ్మే రోజులు పోయాయన్నారు.  వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి అలయానికి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు, కలికోట సూరమ్మ ప్రాజెక్ట్‌, టెక్స్‌టైల్‌ క్లస్టర్‌ ఏర్పాటు వంటివి ఎక్కడివి అక్కడే ఉన్నాయన్నారు. స్థానిక ఎంపీ గెలిచినప్పటి నుంచి భాగ్యలక్ష్మీ ఆలయం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు రాజన్న సాక్షిగా రూ 5 లక్షల 4 వేల ప్యాకేజీని, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కేటాయిస్తామని మాట ఇచ్చినా సీఎం కేసీఆర్‌ మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ  ఇన్‌చార్జి అది శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్‌, బీసీ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌, నాయకులు సాగరం వెంకటస్వామి, పిల్లి కనకయ్య, ముడికె చంద్రశేఖర్‌, కదిరె రాజ్‌కుమార్‌, కత్తికనకయ్య, కనికరపు రాకేస్‌, చిలువేరి శ్రీనివాస్‌, ఏటీ యాదవ్‌ పాల్గొన్నారు. 

- రక్షాబంధన్‌ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ పాదయాత్రలో ఉండగా  వేములవాడ మండలం అగ్రహారంలో ఆయన సోదరీ విమల రాఖీ కట్టి  అప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-08-13T06:22:56+05:30 IST