Abn logo
Aug 2 2021 @ 23:58PM

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగంటేందుకు ప్రజల్లోకి..

టీడీపీ నేతల ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు

టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులతో కలిసి ఆందోళన

అన్నివర్గాల వారిని మోసం చేస్తున్న ప్రభుత్వం

టీడీపీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి నుంచి పోరాటం

మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు 

ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 2: ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళతామని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. సోమవారం ఒంగోలులో పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, నియోజకర్గ ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ అధ్యక్షత వహించగా, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయయస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు  కందుల నారాయణరెడ్డి, దివి శివరాం, ముత్తుముల అశోక్‌రెడ్డి, బీఎన్‌ విజయకుమార్‌,  గూడూరి ఎరిక్షన్‌బాబు, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యంగా జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండగా, మరోవైపు లీకులు ఏర్పడటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ వివహారంపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సాగర్‌ నిండినా నీరు విడుదల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.   మొక్కజొన్న రైతులకు బకాయిలు విడుదల చేయడంలో తీవ్రజాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేస్తామని ప్రకటించిన జగన్‌రెడ్డి ఇంతవరకు పట్టించుకోకపోవడం మరీ దారుణమన్నారు. వెంటనే పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నెల మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పెన్షన్లు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఏలూరి ధ్వజమెత్తారు. టీడీపీ సంస్థాగత, అనుబంధ సంఘాల కమిటీలు, ఇతర కమిటీలతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ప్రభుత్వం తీవ్ర నష్టం కలుగజేస్తుందని అన్నారు. గతేడాది చీరాలలో కిరణ్‌ అనే దళిత యువకుడుని కొట్టిచంపిన పోలీసులపై నేటికి చర్యలు లేవన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసి, దళితుల ఆర్థికాభివృద్ధిని దెబ్బతీశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మంజూరుచేసిన వివిధ వృతి యంత్రాలను ఉద్దేశపూర్వకంగానే మంజూరుచేయకుండా నిలిపివేశారని, అవన్నీ కార్పొరేషన్ల వద్ద తుప్పుపడుతుంటే పట్టించుకోలేదన్నారు. కక్షసాధింపు రాజకీయాలతో విదేశీ విద్య పథకం, ఎన్టీఆర్‌ విద్యా పథకాన్ని ఆపేయడం వైసీపీ కుట్రలకు నిదర్శనంగా కనిపిస్తుందన్నారు. టిడ్కో ఇళ్లను ఇంతవరకు ఇవ్వకపోగా, టీడీపీకి పేరు వస్తుందని నిలుపుదల చేయడం దారుణమన్నారు. త్వరలోనే లబ్ధిదారులతో కలిసి టిడ్కో ఇళ్ళను సందర్శించి, కేటాయించే వరకు ఉద్యమం చేస్తామన్నారు.గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ జాబ్‌ క్యాలెండర్‌లో నిరుద్యోగులకు మొండిచేయి చూపారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలను చిన్నచూపు చూస్తూ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి సంఘంలో గుర్తింపు లేకపోవడం దారుణమన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలవనున్నట్లు తెలిపారు. ఇంకా తెలుగురైతు బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు కొండ్రగుంట వెంకయ్య పలువురు మాట్లాడారు.

 

తెలుగు యువత సైకిల్‌ ర్యాలీ అడ్డగింత 

 పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు, నిత్యవసర సరుకులు పెరుగుదలపై తెలుగుయువత ఆద్వర్యంలో చేపట్టిన సైకిల్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మాజి ఎమ్మెల్యే దామచర్ల జనారఽ్దన్‌తోపాటు తెలుగుయువత ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు ఎం. శ్రీనివసరావు, నగర అద్యక్షులు కొఠారి నాగేశ్వరావు పలువురు నాయకులు, యువత పాల్గొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయం వద్ద నుంచి సైకిల్‌ ర్యాలీ ప్రారంభం కాగా, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలు డీఎస్పీ కేఎన్‌వీవీ. ప్రసాద్‌, తాలూకా సీఐ తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. దీంతో తెలుగుయువత చేపట్టిన ర్యాలీ కొనసాగకుండా నిలిచిపోయింది.