సర్కారీ దవాఖానాల్లో టెలీ మెడిసిన్‌

ABN , First Publish Date - 2022-01-29T17:46:40+05:30 IST

అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌ నమునాల సేకరణ, పరీక్షలు, మందుల కిట్లు అందజేస్తున్నారు

సర్కారీ దవాఖానాల్లో టెలీ మెడిసిన్‌

స్పెషాలిటీ వైద్యుల ఆన్‌లైన్‌ సేవలు 

అందుబాటులోకి ప్రభుత్వ బోధానాస్పత్రుల వైద్యులు

యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో..


హైదరాబాద్‌ సిటీ: అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌ నమునాల సేకరణ, పరీక్షలు, మందుల కిట్లు అందజేస్తున్నారు. కరోనా కాలంలో మరో అడుగు ముందుకు వేసి టెలీమెడిసిన్‌ ద్వారా ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. యూపీహెచ్‌సీలకు వచ్చిన దీర్ఘకాలిక రోగులు పెద్దాస్పత్రులకు వెళ్లకుండానే టెలీమెడిసిన్‌ ద్వారా స్పెషలిస్టులతో సంప్రదింపులు జరిపే అవకాశం కల్పిస్తున్నారు. ముందస్తుగానే స్పెషలిస్ట్‌లకు బాధితుల వివరాలు, వ్యాధి తీవ్రత, ప్రస్తుత ఇబ్బందులు ఇలా అన్నీ రిపోర్టులు పంపి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. గత డిసెంబర్‌లో యుపీహెచ్‌సీల ద్వారా 1782 మంది, బస్తీ దవాఖానాల ద్వారా 951 మంది టెలీమెడిసిన్‌ సేవలు పొందారు. 


వారికెంతో ఉపయోగం..

యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలకు వచ్చిన వారిలో సమస్య తీవ్రంగా ఉంటే బోధనాస్పత్రులకు రిఫర్‌ చేసే వారు. రోగులు అక్కడకు వెళ్లి క్యూలో నిలబడి వైద్యులను సంప్రదించేందుకు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు స్థానిక ఆస్పత్రుల నుంచే టెలీమెడిసిన్‌ ద్వారా బోధనాస్పత్రుల్లోని వైద్యులు సేవలు అందిస్తున్నారు. కేన్సర్‌, మూత్రపిండాల వ్యాధులు, గుండె, పక్షవాతం, క్షయ, శ్వాసకోశ జబ్బులు, గైనిక్‌, కంటి, చర్మవ్యాధులు, మానసిక ఇబ్బందులు, పిల్లలకు సంబంధించిన సమస్యలకు సేవలు అందిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రి, ఎంఎన్‌జే, ఛాతీ వ్యాధులు, ఈఎన్‌టీ, మానసిక చికిత్సాలయం తదితర ఆస్పత్రుల వైద్యులను ఆన్‌లైన్‌లో రోగులు సంప్రదించేలా అపాయింట్‌మెంట్‌ పిక్స్‌ చేస్తున్నారు. స్థానిక ఆస్పత్రుల్లోని సిబ్బంది రోగులకు చెందిన పూర్తి వివరాలను ముందుగానే ఆన్‌లైన్‌ ద్వారా ఆయా ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులకు పంపిస్తున్నారు. వైద్యులు నివేదికలను పరిశీలించి, జబ్బు ఏ దశలో ఉందో గుర్తించి మందులను ఇస్తున్నారు. తర్వాత ఆయా డాక్టర్లు సూచించిన తేదీల ప్రకారం రోగిని యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానాలకు పిలిపిస్తున్నారు. 


అన్ని రకాల పరీక్షలు

బస్తీ దవాఖానాల్లో దాదాపు 150 వరకు క్లినికల్‌ పాథాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ పరీక్షలను నిర్వహిస్తారు. రోగుల నుంచి సేకరించిన నమునాలను తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాలకు పంపిస్తారు. నివేదికలను తెప్పించి రోగులకు అందజేస్తారు. ముందుగా దవాఖానాల్లోని మెడికల్‌ ఆఫీసర్‌ నివేదికలను పరిశీలంచి వారి సమస్యలను వివరిస్తారు. అవసరమైన వారికి స్పెషాలిటీ వైద్యులతో టెలీమెడిసిన్‌ సేవలు అందిస్తున్నారు.


ప్రత్యేక సేవలు

గైనకాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, నెఫ్రాలజీ, ఈఎన్‌టీ, చర్మవ్యాధులు, జనరల్‌ సర్జరీ, ఎండోమైక్రోనాలజీ, ఫిజియోథెరపీ, గ్యాస్ర్టో ఎంటరాలజీ, న్యూరాలజీ, మెడికల్‌ అంకాలజీ, కార్డియాలజీ సేవలు స్థానిక ఆస్పత్రులకు వెళ్లి అక్కడి నుంచి టెలీ మెడిసిన్‌ ద్వారా పొందొచ్చు.


నేరుగా మాట్లాడొచ్చు

హైదరాబాద్‌లో 80 బస్తీ దవాఖానాలు, 57 యూపీహెచ్‌సీల ద్వారా టెలీ మెడిసిన్‌ వైద్య సేవలను అందిస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి తెలిపారు. ఆస్పత్రుల్లో ఉన్న ల్యాప్‌టా్‌పలలో రోగికి సంబంధించిన జబ్బు వివరాలు, అందిస్తున్న మందులు, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు తదితర అంశాలను నిక్షిప్తం చేస్తామని వివరించారు. ల్యాప్‌టాప్‌ నుంచే రోగులు ఆన్‌లైన్‌ ద్వారా ఆయా స్పెషాలిటీ వైద్యులతో నేరుగా మాట్లాడతారని అన్నారు. 

Updated Date - 2022-01-29T17:46:40+05:30 IST