సంతకం చేయడానికి భయపడుతున్న CM YS Jagan!

ABN , First Publish Date - 2022-05-03T07:44:01+05:30 IST

సంతకం చేయడానికి భయపడుతున్న CM YS Jagan!,..

సంతకం చేయడానికి భయపడుతున్న CM YS Jagan!

  • సీఎఫ్‌ఎంఎస్‌పై సర్కారు కత్తి.. 
  • ఆర్థిక అవకతవకలు బయటపెడుతోందనే!!
  • స్వప్రయోజనాల కోసం ‘హెర్బ్‌’ తేవడానికి రెడీ
  • అదే జరిగితే అక్రమ చెల్లింపులు ఎప్పటికీ బయటపడవు
  • మొదట వచ్చిన బిల్లులు మొదటే క్లియర్‌ చేయక్కర్లేదు
  • ఇష్టానుసారం అడ్డగోలుగా పేమెంట్లు చేయొచ్చు
  • గత నెలలోనే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’.. దీనిపై సీఎంవో ఆరా
  • కోర్టు కేసుల భయంతో సంతకం చేయని సీఎం జగన్‌?
  • ట్రెజరీ డైరెక్టర్‌, పీఏవో, వర్క్స్‌ పీఏవోతో సంతకాలు
  • చెల్లింపులతో సంబంధమే లేకున్నా బలిపశువులను చేసే కుట్ర!


రాష్ట్రంలో అత్యంత అధునాతన చెల్లింపుల వ్యవస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) విషయంలో జగన్‌ ప్రభుత్వం దాగుడు మూతలాడుతోంది. దాని స్థానంలో తన అక్రమాలను కప్పిపెట్టేలా హెర్బ్‌ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చేందుకు ఆర్థిక శాఖ సర్వం సిద్ధం చేసేసింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే గత నెలలోనే సీఎ్‌ఫఎంఎస్‌ కనుమరుగై.. హెర్బ్‌ సాఫ్ట్‌వేర్‌ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేది. కానీ ‘ఆంధ్రజ్యోతి’ కథనం దీనికి బ్రేక్‌ వేసింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు, రాష్ట్ర ఆర్థిక శాఖ చేస్తున్న అంకెల గారడీని, అక్రమ బిల్లుల చెల్లింపులను సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ఎప్పటికప్పుడు బయటపెడుతోంది. దీంతో ప్రభుత్వ ఆర్థిక అక్రమాలన్నీ అటు అకౌంటెంట్‌  జనరల్‌ (ఏజీ) కార్యాలయానికి, ఇటు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి. ఫలితంగా ఏజీకి తరచూ సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి. కోర్టుల్లోనూ కేసులు ఎదుర్కోవలసి వస్తోంది. దీని నుంచి బయటపడేందుకు జగన్‌ సర్కారు ఓ ప్లాన్‌ వేసింది. అత్యంత పకడ్బందీగా రూపొందించిన సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను అర్ధాంతరంగా ఆపేసి.. జావా సాఫ్ట్‌వేర్‌తో తమకు అనుకూలంగా తయారుచేసుకున్న హెర్బ్‌ను ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసింది. దీనిపై ఏప్రిల్‌ ప్రారంభంలో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించే సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థను కాదని ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌లో సెటింగులను మార్చుకునేంత సులభంగా ఉండే హెర్బ్‌ సాఫ్ట్‌వేర్‌ను కుట్రపూరితంగా తీసుకొస్తోందని వెల్లడించింది. 


సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్న పకడ్బందీ నిబంధనలు హెర్బ్‌లో లేవని, సీఎ్‌ఫఎంఎ్‌సను తొలగిస్తే ఇప్పటికే పతనావస్థలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత అతలాకుతలమవుతుందని, బిల్లుల చెల్లింపు మాటున వైసీపీ ప్రభుత్వ పెద్దలు, ఆర్థికశాఖ అధికారులు సాగిస్తున్న కమీషన్ల దందాకు ఆధారాలు లేకుండా పోతాయని ‘ఆంధ్రజ్యోతి’ హెచ్చరించింది. దీనిపై సీఎంవో అధికారులు ఆరా తీశారు. సీఎ్‌ఫఎంఎ్‌సలో రాష్ట్ర ఆదాయ, చెల్లింపులు, ఇతర నివేదికలు తీసుకోవడం కొంత ఆలస్యమవుతోందని.. అదే హెర్బ్‌లో అయితే త్వరగా తీసుకోవచ్చన్న ఉద్దేశంతో తాము హెర్బ్‌ స్టాఫ్ట్‌వేర్‌ను తెచ్చినట్లు ఆర్థిక శాఖ అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై సంతృప్తి చెందని సీఎంవో అధికారులు ఇబ్రహీంపట్నంలోని సీఎ్‌ఫఎంఎస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సీఎ్‌ఫఎంఎస్‌ స్థానంలో మరేదైనా కొత్త చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టాలంటే సీఎం స్వయంగా సంతకం చేసి ఆమోదం తెలపాలని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఎందుకంటే సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేటప్పుడు ఈ వ్యవస్థ బాగా పని చేస్తుంది.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని దానిని ఆమోదిస్తున్నామని చెబుతూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు.


ఇప్పుడీ వ్యవస్థకు  తిలోదకాలివ్వాలనుకుంటే.. దానిని ఎందుకు ఆపుతున్నాం.. దానివల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలేంటి.. కొత్త సాఫ్ట్‌వేర్‌ ఎందుకు తీసుకొస్తున్నారు.. దాని వల్ల కలిగే మేలేంటి.. పాత సాఫ్ట్‌వేర్‌ కన్నా కొత్తది ఎంత మేలైనదో వివరిస్తూ సీఎం సంతకం చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రకరకాల వర్గాల నుంచి కోర్టులో కేసులు పడే అవకాశాలు ఉన్నాయని సీఎంవో అధికారులు భావించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి నేరుగా సంతకం చేస్తే ఆయనే కోర్టుకు స్వయంగా హాజరు కావలసి ఉంటుందన్న భయంతో.. హెర్బ్‌ను కొంత కాలం ఆపాలని సీఎంవో అధికారులు సూచించినట్లు సమాచారం.


అధికారుల సంతకాలతో కానిచ్చేద్దామని..!

ఈలోపు హెర్బ్‌ ప్రయోజనకరమైనదంటూ ట్రెజరీ డైరెక్టర్‌, పీఏవో, వర్క్స్‌ పీఏవోలతో ఆర్థిక శాఖ అధికారులు సంతకాలు పెట్టించారు. ఈ ముగ్గురి సంతకాలతో సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థను తీసేసి కొత్త చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తింది. సీఎం స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారుల సంతకాలతో అమలు చేయాలనుకోవడం దుస్సాహసమే. ఒకవేళ సీఎం సంతకం తప్పనిసరైతే.. చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన ఆ ముగ్గురు అధికారులు ఆమోదించాకే ఆయన సంతకం పెట్టారన్న వాదనను ప్రభుత్వ పెద్దలు తెరపైకి తెస్తారని సమాచారం. స్వప్రయోజనాల కోసం, ప్రాపకాల కోసం ఆర్థిక శాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు కలిసి ఆడుతున్న ఈ నాటకంలో ఆ ముగ్గురు అధికారులను బలిపశువులను చేశారన్న మాట. రాష్ట్ర చెల్లింపుల వ్యవస్థలో ట్రెజరీ డైరెక్టర్‌, పీఏవో, వర్క్స్‌ పీఏవో అత్యంత కీలకమైన వ్యక్తులు.


 రాష్ట్రంలో ప్రతి చెల్లింపూ ఈ ముగ్గురి చేతుల మీదుగా.. వీరి ఆమోదంతోనే జరగాలి. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌ అయింది. ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ.. చెల్లింపులన్నిటినీ పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్నారు. ఇది ఫైనాన్షియల్‌ కోడ్‌కి విరుద్ధం. ‘ఫస్ట్‌ ఇన్‌.. ఫస్ట్‌ ఔట్‌’ (ఫిఫో) విధానాన్ని ఈ మూడేళ్ల నుంచి ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా అక్రమంగా సత్యనారాయణ చెల్లింపులు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే హెర్బ్‌ సాఫ్ట్‌వేర్‌ తేవడంపై ఈయన మాత్రం సంతకం చేయకపోవడం గమనార్హం. కానీ ఈ మూడేళ్ల నుంచి పైసా చెల్లింపులు జరపని పై ముగ్గురి నుంచి సంతకాలు తీసుకోవడంతోనే ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది.


ఫిఫో తొలగించుకోవడమే లక్ష్యం..

సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థకు ప్రధాన బలం ఫిఫోనే..! ఏ బిల్లు మొదట వస్తుందో ఆ బిల్లునే మొదట ఆమోదించాలనేది ఈ ‘ఫస్ట్‌ ఇన్‌.. ఫస్ట్‌ ఔట్‌’ (ఫిఫో) లక్ష్యం. మొదట వచ్చిన బిల్లులు మొదట చెల్లిస్తేనే ఆర్థిక అక్రమాలకు తావులేకుండా ఉంటుందనే నాడు చంద్రబాబు సీఎ్‌ఫఎంఎస్‌ రూపొందించారు. ఆయన హయాంలో నూటికి నూరు శాతం అమలైంది. దీనిని శాఫ్‌ సాఫ్ట్‌వేర్‌తో అభివృద్ధి చేశారు. ఇందులో ఏదైనా లావాదేవీ ఎంటరైతే దానిని కనిపించకుండా చేయడం కుదరదు. ఒకవేళ చెల్లింపులు, లావాదేవీల్లో పొరపాట్లు ఉంటే అవి ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి. దానిని సరిచేస్తూ మరో ఎంట్రీ వేయాలి అది కూడా అలాగే ఉంటుంది. అంటే ప్రభుత్వాలు మారినా.. గత ప్రభుత్వాల హయాంలో ఏం జరిగాయి, ఎప్పుడు జరిగాయనేది కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది. మొదట వచ్చిన బిల్లులు కాకుండా తర్వాత వచ్చే బిల్లులు చెల్లించేటప్పుడు ఎందుకు అలా చెల్లిస్తున్నారో ఒక బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అలా ఎందుకు చెల్లించారో ఆ అధికారి రాయాల్సి ఉంటుంది. కారణం రాస్తేనే మొదటి బిల్లు కాకుండా తర్వాత వచ్చిన బిల్లు చెల్లించే అవకాశం కల్పిస్తుంది. 


అలా రాసిన కారణం ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. దానిని తొలగించడం కుదరదు. ఇటీవల కాలంలో జగన్‌ సర్కారు రూ.48 వేల కోట్లు గోల్‌మాల్‌ చేసిందంటూ ఏజీ కార్యాలయమే ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ గోల్‌మాల్‌ను పట్టించింది సీఎ్‌ఫఎంఎస్సే. దీంతో తమ పనులకు అడుగడుగునా అడ్డుపడుతున్న ఈ వ్యవస్థను తొలగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. దీని స్థానంలో ఎప్పటికప్పుడు మార్పు చేసుకునే హెర్బ్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇందులో ఫిఫో ఉండదు. ప్రభుత్వం ఎవరికి బిల్లులు చెల్లించాలనుకుంటుందో వారికే చెల్లిస్తారు. అధికారులు కారణాలు రాయాల్సిన పని లేదు. ఏ బిల్లు ఎప్పుడు చెల్లించారో ఎవరికీ తెలియదు. ఏ బిల్లు ముందు వచ్చిందో, ఏది  తర్వాత వచ్చిందో తెలియదు. ముందు బిల్లులు పెట్టిన వారు.. తమ తర్వాతి వారికి చెల్లించి తమకు చెల్లించలేదని కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ప్రభుత్వం చేసే గిమ్మిక్కులు ఈ సాఫ్ట్‌వేర్‌లో కనిపించవు. పొరపాట్లు, తప్పుడు లావాదేవీలను డిలీట్‌ చేసే అవకాశం ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉంటుంది. పక్కాగా పారదర్శకంగా, న్యాయసూత్రాలకు అనుగుణంగా సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థను కాదని ఆర్థిక అక్రమాలకు ఊతమిచ్చేలా సిద్ధం చేసిన హెర్బ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలులోకి తేబోతోంది.  ఇది అమలులోకి వస్తే అక్రమ చెల్లింపులు, ఆర్థిక అవకతవకలు బయటపడే అవకాశాలే ఉండవు.

Read more