ఉచిత విద్యుత్‌పై సర్కార్‌ సర్వే

ABN , First Publish Date - 2022-05-25T06:36:38+05:30 IST

విద్యుత్తు చార్జీలను ఇప్పటికే విపరీతంగా పెంచేసి వినియోగదారులపై మోయలేని భారం వేసిన వైసీపీ ప్రభుత్వం...తాజాగా ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్తుపై దృష్టి సారించింది.

ఉచిత విద్యుత్‌పై  సర్కార్‌ సర్వే

ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచితం

భారంగా మారిందని లబ్ధిదారుల్లో కోత విధించడానికి ప్రభుత్వం చర్యలు?

వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఈపీడీసీఎల్‌ ఉద్యోగులతో ఇంటింటి సర్వే

నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరణ

లబ్ధిదారుని కుల ధ్రువీకరణ పత్రం అడుగుతున్న సిబ్బంది

ఇంట్లో ఇతరులు నివాసం ఉంటుంటే రాయితీ కట్‌?

ఒకటికి మించి విద్యుత్తు కనెక్షన్లు ఉన్నా అనర్హత వేటు

ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఆర్థికంగా స్థోమత కలిగిన వారి పేర్లు తొలగించేందుకు రంగం సిద్ధం 


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

విద్యుత్తు చార్జీలను ఇప్పటికే విపరీతంగా పెంచేసి వినియోగదారులపై మోయలేని భారం వేసిన వైసీపీ ప్రభుత్వం...తాజాగా ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్తుపై దృష్టి సారించింది. పలురకాల నిబంధనలు రూపొందించి, అనర్హుల పేరుతో రాయితీ రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, విద్యుత్తు ఉద్యోగులు ఇంటింటా సర్వే చేస్తున్నారు. ఇంటిలో నివాసం వుంటున్న వారి వివరాలు, పలు రకాల ధ్రువపత్రాలను సేకరిస్తున్నారు. ఇంట్లో ఇతర వ్యక్తులు నివాసం ఉంటున్నా (అద్దెకు ఇచ్చినట్టయితే), సర్వే సిబ్బంది అడిగిన సమాచారం ఇవ్వకపోయినా విద్యుత్తు రాయితీకి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటిస్తుందని సర్వే సిబ్బంది చెబుతున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయ వర్గాల వారికి కూడా ఉచిత విద్యుత్‌ పథకాన్ని రద్దు చేయబోతున్నట్టు చెబుతున్నారు.

సమాజంలో బాగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నది. తొలుత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా వున్నప్పుడు ఒక్కో లబ్ధిదారునికి నెలకు 50 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. తరువాత టీడీపీ దీనిని 125 యూనిట్లకు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 200 యూనిట్లకు పెంచాయి. ఒకవేళ ఎవరైనా ఒక నెలలో నిర్ణీత యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తే...అదనపు యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లిస్తే సరిపోతుంది.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈపీడీసీఎల్‌ అధికారుల లెక్కల ప్రకారం 1,26,494 మంది ఎస్టీ, 44,516 ఎస్సీ గృహ విద్యుత్‌ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు పథకం అమలవు తున్నది. ప్రతి నెలా 200 యూనిట్ల వరకు అయ్యే బిల్లు మొత్తాన్ని ఏపీఈపీ డీసీఎల్‌కు ప్రభుత్వమే చెల్లిస్తున్నది. అయితే ఉచిత విద్యుత్తు పథకాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయ వర్గాల వారు కూడా లబ్ధిపొందుతున్నారని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కాలంలో డిమాండ్‌ మేరకు విద్యుత్తు అందుబాటులో లేకపోవడం, అధిక ధర చెల్లించి ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో... దీంతో భారాన్ని తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. గత నెల నుంచి విద్యుత్‌ చార్జీలను విపరీతంగా పెంచేసింది. వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించడం మొదలుపెట్టింది. తాజాగా ఉచిత విద్యుత్‌ పథకం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దృష్టిసారించింది. కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చి ఉచిత విద్యుత్తుకు దూరం చేయడానికి చాపకింద నీరులా చర్యలు చేపట్టింది.

ఇంటింటి సర్వే

ఉచిత విద్యుత్తు పొందుతున్న వారిలో పలువురు అనర్హులు వున్నట్టు భావిస్తున్న ప్రభుత్వం...ఇటువంటి వారిని గుర్తించడానికి ఇంటింటా సర్వే చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందుకోసం ఉచిత విద్యుత్తు పథకం అమలవుతున్న లబ్ధిదారుల జాబితాలను ఈపీడీసీఎల్‌ అధికారులు సిద్ధం చేశారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఈపీడీసీఎల్‌ ఉద్యోగులు తమ పరిధిలో ఉచిత విద్యుత్తు అమలవు తున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇంటిలో లబ్ధిదారుని కుటుంబమే నివాసం ఉంటున్నదా? లేకపోతే ఇతరులు ఉంటున్నారా? అన్నది ప్రధానంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవారు ఎంత కాలం నుంచి ఆ ఇంటిలో నివసిస్తున్నారో అడిగి తెలుసుకుని, లబ్ధిదారుని కుల ధ్రువీకరణ జెరాక్స్‌ కాపీని తీసుకుంటున్నారు. లబ్ధిదారులు కాకుండా వేరే వ్యక్తులు నివాసం వుంటున్నా, ఒకరి పేరుతో ఒకటికి మించి విద్యుత్తు కనెక్షన్లు వున్నా ఉచిత విద్యుత్తుకు అనర్హులుగా ప్రకటిస్తారని తెలిసింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల కోసం నిర్మించిన కాలనీ ఇళ్లల్లో లబ్ధిదారులు కాకుండా మరెవరైనా నివాసం వుంటుంటే కచ్చితంగా ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందని అంటున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారిని కూడా రద్దు జాబితాలో చేరుస్తారని సమాచారం. సర్వే పూర్తయిన తరువాత నివేదిక అందజేస్తామని, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుం టుందని ఈపీడీసీఎల్‌ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2022-05-25T06:36:38+05:30 IST