ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే మర్యాద!

ABN , First Publish Date - 2022-03-06T08:13:52+05:30 IST

గవర్నర్‌ తమిళిసై ప్రకటనకు ప్రభుత్వ వర్గాలు కూడా దీటుగా బదులిచ్చాయి. గవర్నర్లు, రాజ్యాంగబద్ధ సంస్థలకు సీఎం కేసీఆర్‌ అత్యంత విలువ, గౌరవం ఇస్తారని గుర్తు చేశాయి.

ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే మర్యాద!

కేంద్రానికి తోలుబొమ్మలా నడుచుకోవద్దు: ప్రభుత్వ వర్గాలు

అలా నడుచుకున్నవారెవరూ ఎక్కువ కాలం

పనిచేయలేకపోయారని గుర్తుంచుకోవాలి

గవర్నర్లకు కేసీఆర్‌ అత్యంత గౌరవం ఇస్తారు

తమిళిసై ‘బీజేపీ’ వాసనలు వదులుకోలేదు

జనవరి 26న సొంత ప్రసంగం చదివారు

తీరు మార్చుకుంటే మంచిది: ప్రభుత్వ వర్గాలు


హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ తమిళిసై ప్రకటనకు ప్రభుత్వ వర్గాలు కూడా దీటుగా బదులిచ్చాయి. గవర్నర్లు, రాజ్యాంగబద్ధ సంస్థలకు సీఎం కేసీఆర్‌ అత్యంత విలువ, గౌరవం ఇస్తారని గుర్తు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో ఇచ్చిపుచ్చుకునే, రాజ్యాంగ బద్ధంగా నడుచుకునే ధోరణి గవర్నర్లకు ఉండాలని పేర్కొన్నాయి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వాలకు తోలుబొమ్మలుగా మారిన ఏ గవర్నర్‌ కూడా ఎక్కువ కాలం పనిచేయలేకపోయారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాయి. గతంలో గవర్నర్‌ వ్యవస్థ రాష్ట్ర పాలనా యంత్రాంగానికి, సీఎం కేసీఆర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చిందని.. కేసీఆర్‌ కూడా అంతే గౌరవం ఇచ్చారని తెలిపాయి. ఇప్పుడది కనిపించకపోవడానికి కారణాలు ఉన్నాయని వివరించాయి. తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై.. గవర్నర్‌గా తెలంగాణకు వచ్చినప్పటికీ పాత వాసనలు వదులుకోలేదని పేర్కొన్నాయి. గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారంటూ కొన్ని సంఘటనలను ఉదహరించాయి. 


ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాలు..

కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. దాన్ని గవర్నర్‌ ఆమోదించలేదు. అలాగని తిరస్కరించనూ లేదు. చాలా కాలం తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రభుత్వ వర్గాలు కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని కోరినపుడు.. అతనిపై కేసులున్నాయని చెప్పారు. అలాంటప్పుడు తిరస్కరించాలని చెప్పినా అలా చేయలేదు. కేసులున్నా.. శిక్ష పడలేదుకదా? అని నివేదించినా పట్టించుకోలేదు.

శాసనమండలికి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం సభ్యుడు అమీనుల్‌ జాఫ్రీని సిఫారసు చేస్తూ ఫైల్‌ను గవర్నర్‌కు పంపించారు. ఆమె నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణితో వ్యవహరించారు. ప్రొటెం చైర్మన్‌ ఎందుకు..? నేరుగా చైర్మన్‌ ఎన్నిక పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో 13 నెలలపాటు ప్రొటెం చైర్మనే ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ గవర్నర్‌ పట్టించుకోలేదు. చివరకు దేశంలో ఏయే రాష్ట్రాలు ప్రొటెం చైర్మన్లను ఎంత కాలం ఉంచాయన్న సమాచారాన్ని ఇవ్వడంతో జాఫ్రీ నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

గవర్నర్‌ ఉభయసభల్లో, జనవరి 26న జెండా ఎగురవేసిన తర్వాత.. ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగాన్నే చదవాలి. సొంతంగా ప్రసంగాలు చేయడానికి వీల్లేదు. కానీ, ఈ సారి జనవరి 26న గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రభుత్వం పంపించలేదు. ఆమె సొంత ప్రసంగాన్ని చదివారు. వాస్తవానికి ప్రసంగానికి సంబంధించి ప్రభుత్వం గవర్నర్‌తో చర్చలు జరిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలాగూ బహిరంగ సభ లేదు కాబట్టి ఎలాంటి ప్రసంగాలు వద్దనుకున్నారు. కానీ, గవర్నర్‌ ప్రసంగించారు.

2021-22 బడ్జెట్‌ ప్రసంగంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించని కొన్ని పేరాలను గవర్నర్‌ సొంతంగా చదివారు. 

గతంలో రాంలాల్‌ గవర్నర్‌గా ఉండగా.. నాటి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన చాలా అవమానకరంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. కృష్ణకాంత్‌ గవర్నర్‌గా ఉన్నపుడు కూడా అలాగే జరిగింది. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్‌ వ్యవహార శైలి కారణంగా శాసనసభ నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. తెలంగాణలో ఇప్పటికీ గవర్నర్‌కు పరిస్థితులు చేయి దాటిపోలేదని, తీరు మార్చుకుంటే మంచిదని ప్రభుత్వవర్గాలు హితవు పలికాయి.

Updated Date - 2022-03-06T08:13:52+05:30 IST