ప్రభుత్వ బడులను వీడి.. ప్రైవేట్‌లోకి..!

ABN , First Publish Date - 2021-12-03T13:31:05+05:30 IST

ప్రభుత్వ బడులను వీడి..

ప్రభుత్వ బడులను వీడి.. ప్రైవేట్‌లోకి..!

మీరు వస్తామంటే.. మేం వద్దంటాం!

కొత్త విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఈ ఏడాది ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి 2.5 లక్షల మంది 

ఆ విద్యార్థులకు పుస్తకాలు.. యూనిఫామ్స్‌ లేవు 

టీచర్లు లేరు.. వలంటీర్లను నియమించలేదు

వారు తిరిగి ప్రైవేట్‌ స్కూళ్లల్లోకి వెళ్లే అవకాశం


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల పట్ల ‘మీరు వస్తామంటే.. మేం వద్దంటాం!’ అనే రీతిలో విద్యా శాఖాధికారుల వైఖరి కనిపిస్తోంది. కరోనా వంటి కారణాలతో ప్రైవేట్‌ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది భారీ సంఖ్యలో ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు. సుమారు 2.5 లక్షల మంది ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చేరినట్టు అధికారులే చెబుతున్నారు. అయితే ఈ విద్యార్థుల అవసరాలను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. వారంతా ప్రభుత్వ స్కూళ్లల్లోనే కొనసాగడానికి వీలైన చర్యలను తీసుకోవడం లేదు. వారికి అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్స్‌ వంటి వాటిని సరఫరా చేయడం లేదు.


అలాగే పెరిగిన విద్యార్థుల సంఖ్య మేరకు టీచర్లను కూడా అందుబాటులో ఉంచడం లేదు. దాంతో ఎప్పుడైనా ఈ విద్యార్థులు తిరిగి ప్రైవేట్‌ వైపు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. విచిత్రంగా విద్యా శాఖాధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. భవిష్యత్తులో వారు ప్రభుత్వ బడులను వీడి ప్రైవేట్‌లోకి వెళతారని, అలాంటి వారి కోసం కొత్తగా అదనపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదనే వైఖరిని అవలంబిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


యూనిఫామ్స్‌.. సర్దుబాటుతో సరి

కరోనా కారణంగా రాష్ట్రంలో రెండేళ్ల నుంచి విద్యారంగం అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్కూళ్లు నడవకపోవడం, పరీక్షలను రద్దు చేయడం వంటివి జరిగాయి. అలాగే కరోనా కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కూడా తారుమారైంది. దాంతో ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఫీజులను చెల్లించలేని వారిలో చాలా మంది ఈ ఏడాది తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చారు. ఇలా 2.5 లక్షల మంది ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లోకి వచ్చారు. అయితే.. నిరుడు స్కూళ్లు నడవకపోవడంతో గతంలో కుట్టించిన యూనిఫామ్స్‌ను ఈ ఏడాది సర్దుబాటు చేశారు. దాంతో కొత్తగా వచ్చి చేరిన విద్యార్థులకు అదనంగా యూనిఫామ్స్‌ అందించలేకపోయారు. దాంతో ఈ విద్యా సంవత్సరంలో యూనిఫామ్‌ ధరించాలనే నిబంధనను తొలగించారు. పాఠ్య పుస్తకాల పంపిణీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠ్య పుస్తకాలను కూడా మొదట్లోనే ప్రింట్‌ చేశారు. దాంతో కొత్త విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేవు. వీరంతా...పాత పుస్తకాలు లేదా...ప్రైవేట్‌లో కొనుగోలు చేసి తమ విద్యను కొనసాగిస్తున్నారు.


టీచర్ల కొరత యథాతథం

రాష్ట్రంలో ఇప్పటికే 18,500 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కొన్నేళ్ల నుంచి విద్యా వాలంటరీలను నియమిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 15 వేల మంది విద్యా వాలంటరీలు పనిచేస్తుండేవారు. అయితే ఈ ఏడాది వారి నియామకాలను చేపట్టలేదు. టీచర్ల హేతుబద్ధీకరణను నిర్వహించాలనే ఉద్దేశంతో వాలంటరీలను పక్కనపెట్టారు. అయితే ఇప్పటి వరకు ఈ హేతుబద్ధీకరణను నిర్వహించలేదు. దాంతో అనేక స్కూళ్లల్లో ఉపాధ్యాయుల కొరత ఉందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. పైగా ఈ ఏడాది ప్రైవేట్‌ నుంచి వచ్చిన 2.5 లక్షల విద్యార్థులతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. ఒక వేళ ఉన్నా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా లేరు. విద్యా వాలంటరీలు లేకపోవడం, హేతుబద్ధీకరణ జరగకపోవడంతో తాత్కాలిక సర్దుబాటుతో కొంత మంది టీచర్లను డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. ఇలా రాష్ట్రంలో సుమారు 8 వేల మంది టీచర్ల వరకు సర్దుబాటు చేశారు. అయితే ఈ సర్దుబాటును విద్యార్థుల కోణంలో కాకుండా టీచర్ల కోసం చేశారనే ఆరోపణలున్నాయి.


అంటే నిజంగా అవసరం ఉన్న పాఠశాలలకు కాకుండా, టీచర్లు కోరుకున్న ప్రాంతాల్లోని స్కూళ్లకు బదిలీ చేయడం ద్వారా విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం కలగకుండాపోయింది. ఒక వేళ టీచర్లకు ఇష్టం లేకుండా సర్దుబాటు చేస్తే.. వారు అక్కడికి వెళ్లడం లేదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. తమ స్కూల్‌కు కేటాయించిన టీచర్లను రప్పించాలంటూ నల్లగొండ జిల్లాలో విద్యార్థులు నిరసన కూడా వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక సర్దుబాటు ముసుగులో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి టీచర్లు బదిలీ అవుతున్నారు. ఇలా అనేక కారణాలతో కొత్తగా చేరిన విద్యార్థులు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2021-12-03T13:31:05+05:30 IST