సర్కారు తెంపరితనం!

ABN , First Publish Date - 2022-06-29T09:20:17+05:30 IST

సర్కారు తెంపరితనం!

సర్కారు తెంపరితనం!

అనుమతుల్లేకుండానే రుషికొండపై నిర్మాణాలు!

సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్‌.. ఎడాపెడా నిబంధనల ఉల్లంఘన


విశాఖపట్నం, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రుషికొండపై నిర్మాణాల విషయంలో జగ న్‌ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ముందస్తు అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపడుతోంది. ఆది నుంచీ వివాదాస్పదమైన ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో  కేసులు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు పాత హరిత ప్రాజెక్టు స్థలంలో మాత్రమే పనులు చేయాలని, ఇంకెక్కడా ఎటువంటి నిర్మాణాలూ చేయకూడదని ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకొచ్చామని రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీటీడీసీ) చెబుతున్నా.. అవన్నీ కొండ తవ్వకం, కోస్టల్‌ జోన్‌లో నిర్మాణాలు, చెట్ల తొలగింపునకు సంబంధించినవి మాత్రమే. అక్కడ ఎన్ని అంతస్థుల భవనం నిర్మించాలనుకుంటున్నదీ మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)కు ప్లాన్‌ సమర్పించి, దాని అనుమతి కూడా తీసుకోవాలి. ఆ తర్వాతే సివిల్‌ పనులు చేపట్టాలి. కానీ జీవీఎంసీకి కనీసం దరఖాస్తు చేయకుండానే రుషికొండపై సివిల్‌ పను లు జరిగిపోతున్నాయి. ఇక్కడ కూడా నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. ఏపీటీడీసీ సెవన్‌ స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ వంటివి నిర్మిస్తామని ముందు నుంచీ చెబుతోంది. అయితే నిర్మించే భవనాలు పర్యాటక శాఖ కోసం కాదని.. సీఎం క్యాం పు కార్యాలయం కోసమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే జిల్లాలో ఏ పర్యాటక ప్రాజెక్టు పూర్తికీ నిధులివ్వని ప్రభుత్వం.. దీనికి వందల కోట్ల రూపాయ లు వెచ్చిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలకు బలం చేకూరు స్తూ ఇప్పుడు ప్లాన్‌ సమర్పించకుండానే పనులు చేస్తున్నారు. జీవీఎంసీకి ప్లాన్‌ కోసం దరఖాస్తు చేస్తే...అది బయటకు వస్తుందని, అందులో నిర్మాణాలు ఏమిటో బహిర్గతమవుతాయని, అప్పుడు మరిన్ని అడ్డంకులు వస్తాయనే భయంతోనే అడ్డగోలుగా అనుమతుల్లేకుండానే పనులు చేపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-06-29T09:20:17+05:30 IST