ఆయన రేటే వేరు

ABN , First Publish Date - 2022-06-22T07:04:09+05:30 IST

మైనార్టీ సంక్షేమ శాఖలో ఓ అవినీతి తిమింగలం రాజ్యమేలుతోంది. ఎన్ని తప్పులు చేసినా తనపై ఏ విచారణా జరగదు.

ఆయన రేటే వేరు
ఆయన రేటే వేరు

అమ్మకానికి ప్రభుత్వ పోస్టులు

మైనార్టీ వెల్ఫేర్‌లో అవినీతి అధికారి

దరఖాస్తుదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు

అక్రమాలపై ఫిర్యాదు చేసిన ఉద్యోగులకు టార్చర్‌

కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించిన బాధితుడు

ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా.. చర్యలు లేకుండా ముడుపులు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌: మైనార్టీ సంక్షేమ శాఖలో ఓ అవినీతి తిమింగలం రాజ్యమేలుతోంది. ఎన్ని తప్పులు చేసినా తనపై ఏ విచారణా జరగదు. ఎంత నొక్కేసినా అడిగేవారు ఉండరు. అంతలా పాతుకుపోయాడు. తన గుట్టు విప్పేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే టార్గెట్‌ చేసి, వేధింపులకు పాల్పడుతాడు. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నాడు. ఆ శాఖకు అనుసంధానంగా ఉండే మరో శాఖలో కొందరు అధికారులను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకుని.. అక్రమార్జన కొనసాగిస్తున్నాడు. ఆ శాఖలో కీలక పోస్టులో ఉండటంతో ఎవరూ నోరుమెదపలేని పరిస్థితి. ఆ అధికారి ఆగడాలను భరించలేని కొందరు ఉద్యోగులు, పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా, చర్యలు లేవు. పైస్థాయిలో ఆయనకు వత్తాసు పలికే అధికారులు ఉండటమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. ముడుపులు ముట్టజెప్పి.. విచారణలను కాగితాలకే పరిమితం చేయిస్తారని ప్రచారం ఉంది. ఆ శాఖ పరిధిలోని ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు కాసులు దండుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. 


ఆ పోస్టులను అమ్మేశాడు..

- ఉమ్మడి జిల్లాలో మూడేళ్ల క్రితం శాఖ పరిధిలో కొన్ని పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన విడుదల చేసింది. ప్రజల సంఖ్యను బట్టి కొన్ని నియోజకవర్గాల్లో అదనపు పోస్టుల భర్తీకి అనుమతించింది. నియామకాలలో నిబంధనలను పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 30 పోస్టుల వరకూ భర్తీ చేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇక్కడే ఆ అధికారి దందాకు తెరలేపాడని సమాచారం. అర్హతలను పరిగణనలోకి తీసుకోకుండా నియామకాలకు తెరలేపాడని ఆరోపణలు వచ్చాయి. ఆ శాఖకు అనుసంధానంగా ఉండే శాఖలోని కొందరు ఉద్యోగులను మధ్యవర్తులుగా రంగంలోకి దింపి.. అక్రమాలకు తెరలేపినట్లు సమాచారం. 

-  కదిరి, తాడిపత్రి, నార్పల, గుంతకల్లు, పెనుకొండ, హిందూపురం, అనంతపురం రూరల్‌లో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. కదిరి, తాడిపత్రి నియోజకవర్గాలతో పాటు నార్పలలో ఎక్కువ పోటీ ఉండటంతో ఆ అధికారి కాసుల దందాకు తెరలేపాడు. ఒక్కో మండలంలో ఒక్కో పోస్టుకు ముగ్గురు నలుగురు దరఖాస్తులు చేసుకున్నారని, పోస్టు ఇస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ దండుకున్నాడని సమాచారం. అదనపు పోస్టుల భర్తీకి రూ.లక్షల్లో వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకుని, పోస్టులు ఇవ్వకపోవడంతో కొందరు ఆశావాహులు ఆ అధికారిని నిలదీసినట్లు సమాచారం. ఆ సమయంలో వారి నుంచి తీసుకున్న మొత్తంలో కొంత వెనక్కు ఇచ్చాడని తెలిసింది. ఈ వ్యవహారంపై కొందరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దాదాపు 15 మండలాల్లో పోస్టులను భర్తీ చేయకుండా అధికారులు పెండింగ్‌లో పెట్టారు. కానీ అవినీతి అధికారిపై చర్యలు తీసుకోలేదు. ఈ వివాదం నుంచి బయట పడేందుకు ఆ అధికారి భారీస్థాయిలో ముడుపులు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 


వేధింపులు భరించలేక..

ఆ అధికారి అక్రమాలపై కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకునేందుకు పర్యవేక్షణాధికారి వెనకడుగు వేశారు. ఇదే అదనుగా ఆ అవినీతి అధికారి మరింత రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. తనపైనే ఫిర్యాదు చేసిన ఓ ఉద్యోగిని టార్గెట్‌ చేసి, సెలవు ఇవ్వకుండా వేధించినట్లు సమాచారం. పని భారం, ఒత్తిడి, సమయం ముగిసినా కార్యాలయంలోనే ఉండాలనడం.. ఇలా మానసిక హింస పెట్టినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆ ఉద్యోగి తాను మరో ప్రాంతానికి వెళ్లిపోతానని మొరపెట్టుకున్నా... పంపకుండా వేధించినట్లు సమాచారం. దీంతో బాధితుడు కార్యాలయంలోనే తనవెంట తెచ్చుకున్న కత్తితో పొట్టలో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. ఆ ఘటనను బయటికి పొక్కనివ్వకుండా శాఖ ఉద్యోగులను ఆ అధికారి భయబ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. బాధిత ఉద్యోగిని వేరొక శాఖకు పంపినట్లు తెలుస్తోంది. ఏకంగా ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించే స్థాయిలో ఆయన వేధింపులు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. 


ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా..

ఆయన అక్రమాలపై అనేక ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ అధికారులను నియమించారు. ఆ తరువాత ఏమైందో బయటకు పొక్కదు. విచారణ అధికారులకు ముడుపులు ఇచ్చి బయట పడుతున్నారని సమాచారం. ఏ విచారణ అధికారీ కార్యాలయం దరిదాపుల్లోకి రాలేదని సమాచారం. కలెక్టర్‌, సంక్షేమ శాఖల పర్యవేక్షణ అధికారులు ఆ అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-22T07:04:09+05:30 IST