అమ్మకానికి సర్కారు ప్లాట్లు!

ABN , First Publish Date - 2022-08-05T06:26:07+05:30 IST

రాష్ట్ర ప్రభు త్వం రాజీవ్‌ స్వగృహ ఆధ్వర్యంలో జిల్లాలో నివాస ప్లాట్ల విక్రయానికి కసరత్తు మొదలు పెట్టింది. మా వల మండలం బట్టిసావర్గాం దుబ్బగూడలో 44వ జాతీయ రహదారిని ఆనుకుని భారీ వెంచర్‌కు ప్లాన్‌ చేస్తుంది. ఇప్పటికే సర్వే పనులను పూర్తి చేసి 72/1/2, 72/1/3 సర్వే నెంబర్‌లో గల 29 ఎకరాల 86 సెంట్ల విస్తీర్ణంలో అధికారిక వెంచర్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది.

అమ్మకానికి సర్కారు ప్లాట్లు!
ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుబ్బగూడ వెంచర్‌ ఇదే

- జిల్లా కేంద్రాన్ని ఆనుకుని దుబ్బగూడలో భారీ వెంచర్‌

- 362 ప్లాట్ల విక్రయానికి అధికారుల ఏర్పాట్లు

- రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి టెండర్లు పూర్తి

- ఈ యేడు డిసెంబరు నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక

ఆదిలాబాద్‌, ఆగస్టు4:(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభు త్వం రాజీవ్‌ స్వగృహ ఆధ్వర్యంలో జిల్లాలో నివాస ప్లాట్ల విక్రయానికి కసరత్తు మొదలు పెట్టింది. మా వల మండలం బట్టిసావర్గాం దుబ్బగూడలో 44వ జాతీయ రహదారిని ఆనుకుని భారీ వెంచర్‌కు ప్లాన్‌ చేస్తుంది. ఇప్పటికే సర్వే పనులను పూర్తి చేసి 72/1/2, 72/1/3 సర్వే నెంబర్‌లో గల 29 ఎకరాల 86 సెంట్ల విస్తీర్ణంలో అధికారిక వెంచర్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో రోడ్ల నిర్మాణానికి గాను 0.930 సెంట్లు పోగా 28.37గుంటల విస్తీర్ణంలో వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొంత కాలం క్రితమే సీ 1, సీ 2, సీ 3 ప్లాట్ల విక్రయంతో రూ.3కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇప్పటికే ఈ ప్లాట్ల వేలం పాటను పూర్తి చేసిన అధికారులు మళ్లీ భారీ వెంచర్‌ను ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయానికి సిద్ధమవుతున్నారు. గురువారం మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులు కలిసి వెంచర్‌లో కొలతల ఆధారంగా హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే డీటీపీ అప్రువల్‌, మున్సిపల్‌ అనుమతులు పొందిన రాజీవ్‌స్వగృహ వెంచర్‌లో హద్దురాళ్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. తదుపరి ప్రభుత్వ అనుమతితో ప్లాట్లను వేలం వేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వెంచర్‌ అభివృద్ధి పనులను తెలంగాణ ఇండస్ర్టియల్‌ ఇన్‌ప్ర్టాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఐఐసీ)కు అప్పగించారు. వెంచర్‌లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేపనులను మున్సిపల్‌ చేపట్టింది. త్వరలోనే అన్ని రకాల వసతులను కల్పించి ఈ యేడు డిసెంబరు నాటికి వేలం పాట వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

టార్గెట్‌ రూ.75కోట్లు..

దుబ్బగూడలో ఏర్పాటు చేసిన వెంచర్‌ ప్లాట్ల విక్రయం ద్వారా రూ.75కోట్ల ఆదాయమే టార్గెట్‌గా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. 28.37 గుంటల భూమి విస్తీర్ణంలో మొత్తం 362 ప్లాట్లను ఏర్పాటు చేశారు. ప్రస్థుతం ఇక్కడ 40/50 ఒక్కొ ప్లాటు విలువ సుమారుగా రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం వెంచర్‌లో వేలం పాట ద్వారా ఒక్కో ప్లాటునురూ.20లక్షల వరకు అమ్మేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ లెక్కన రూ.72కోట్ల 40లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కమర్షియల్‌ ప్లాట్లకు అధికంగానే డిమాండ్‌ ఉంటుంది. దీంతో ఈ ప్లాట్లకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఎక్కువగానే ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలం పాటలో పాల్గొనే వారికి మూడు వాయిదాల్లో సొమ్మును చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నీట మునిగిన ప్లాట్లు..

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్‌ను ఆనుకొని చెరువు ఉండడంతో వరద ముంప్పు పొంచి ఉంది. ప్రస్థుతం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పదుల సంఖ్యలో ప్లాట్లు చెరువు నీటిలోనే మునిగి కనిపిస్తున్నాయి. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెంచర్‌ను ఏర్పాటు చేశారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే వెంచర్‌ మధ్యలో పార్కు స్థలాన్ని వదిలేయాల్సి ఉండగా చెరువును ఆనుకొని పార్కు స్థలాన్ని వదిలేశారంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వెంచర్‌లో బీటీ రోడ్ల నిర్మాణానికి గాను రూ.5కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేశారు. 30, 40 ఫీట్ల అంతర్గత రోడ్లకు ఇరువైపులా మురికి నీటి కాలువలను నిర్మించనున్నారు. అలాగే విద్యుత్‌ సౌకర్యం, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. ప్రైవేట్‌ మాదిరిగానే ప్రభుత్వ వెంచర్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన తర్వాతనే వేలం పాట వేయాలని  జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈ వెంచర్‌కు సమీపంలోనే కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఎక్కువ మంది ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ప్లాట్లకు ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

హద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నాం..

-శైలజ (మున్సిపల్‌ కమిషనర్‌, ఆదిలాబాద్‌)

మావల మండలం బట్టిసావర్గామ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడలో రాజీవ్‌ స్వగృహ ఆధ్వర్యంలో 28.37గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న వెంచర్‌లో మున్సిపల్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల సమన్వయంతో హద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నాం. వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్న సర్వే నెంబర్లు అర్బన్‌ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఈ వెంచర్‌కు డీటీపీ అనుమతులతో పాటు మున్సిపల్‌ అనుమతులు ఉన్నాయి. అన్ని రకాలుగా డెవలప్‌మెంట్‌ చేసిన తర్వాతనే ప్లాట్లను వేలం వేసే అవకాశం ఉంది. 


Updated Date - 2022-08-05T06:26:07+05:30 IST