ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధి చిహ్నాలు

ABN , First Publish Date - 2021-06-20T05:43:51+05:30 IST

కొత్త జిల్లాల్లో నూతన ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధి చిహ్నాలుగా మారాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధి చిహ్నాలు
సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవనంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

పరిపాలనా సౌలభ్యం కోసమే కలెక్టరేట్‌ భవనం

70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్లలో చేశాం

సీఎం కేసీఆర్‌ ప్రారంభించడం మన అదృష్టం

ప్రారంభోత్సవ ఏర్పాట్ల సందర్భంగా మంత్రి హరీశ్‌రావు

 

కొండపాక, జూన్‌ 19 : కొత్త జిల్లాల్లో నూతన ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధి చిహ్నాలుగా మారాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అధునాతన సాంకేతికతో ప్రజలకు సులభంగా సేవలు అందేలా కలెక్టరేట్‌లో ఏర్పాట్లు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనాలను నిర్మించుకున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ప్రత్యేక రాష్ట్రంలో ఏడేళ్లలోనే చేసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రజల చెంతకే పాలన తెచ్చేలా, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతో పాటు కొత్త డివిజన్‌లు, మండలాలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేశామన్నారు. దీంతో ప్రజలకు దూర భారం తగ్గిందన్నారు. దశాబ్దాల జిల్లా కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆరే సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు రావడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు.


కమిషనరేట్‌ను పరిశీలించిన దామోదర్‌గుప్తా

కొండపాక, జూన్‌ 19 : సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా శనివారం సందర్శించారు. కమిషనర్‌, అడిషనల్‌ డీసీపీల చాంబర్లు, గ్రీవెన్స్‌ సెల్‌ హాల్‌, సీసీ కెమెరాల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌, మీటింగ్‌హాల్‌, రిసెప్షన్‌ కౌంటర్‌, కమిషనర్‌ కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బందికి సంబంధించిన గదులను పరిశీలించారు. కమిషనరేట్‌ కార్యాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దామోదర్‌గుప్తా వెంట అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ శ్రీనివాసులు, గజ్వేల్‌ ఏసీపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T05:43:51+05:30 IST