కరోనా బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-19T07:13:21+05:30 IST

వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుందని టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

కరోనా బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ నేతల నిరసన

ఉలవపాడు, జూన్‌ 18 : వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుందని టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త టీడీపీ నిరసనలో భాగంగా కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ కే సంజీవరావుకి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె, పట్నం తేడా లేకుండా కరోనా వైరస్‌ మరణ మృదంగం సృష్టించడానికి కారణం సరైన వైద్య సదుపాయాలు ప్రభుత్వం కల్పించకపోవడమేనని ఆరోపించారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం 65 లక్షల డోసుల టీకాలు రాష్ట్రానికి పంపితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికి 26 లక్షల డోసుల మాత్రమే వినియోగించి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15వేలు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప పేదలకు అందలేదని ఆరోపించారు. చంద్రన్న భీమా కొనసాగి ఉంటే కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు వచ్చేవన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, బ్లాక్‌ ఫంగస్‌ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్‌ చేశారు. ఆనందయ్య మందు తయారీకి అవసరమైన వస్తువులు ప్రభుత్వం అందించి రాష్ట్రమంతా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు.  తెలుగు యువత మండల అధ్యక్షుడు కందగడ్డల వరుణ్‌, పంచాయతీ వార్డు మెంబర్లు బడితల శివ, తొట్టెంపూడి మాల్యాద్రి, రాచగల్లు శివ, షేక్‌ బాజీ, అంచుపోగు వాసు, ఆత్మకూరు మహేంద్ర పాల్గొన్నారు. 

69మందికి కొవిడ్‌ పరీక్షలు

పీసీపల్లి : స్ధానిక పీహెచ్‌సీ పరిధిలో శుక్రవారం 69మందికి కోవిడ్‌ నిర్దారణ పరీక్షలకోసం స్వాబ్‌లు తీసినట్లు మండల ఆరోగ్య విస్తరణ  అధికారి భేగ్‌ తెలిపారు. గడిచిన 24గంటల్లో పాతముద్దపాడు, గుంటుపల్లి గ్రామాలకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు.వీరికి మందులు అందజేసిన వైద్యసిబ్బంది హోమ్‌క్వారంటైన్‌ లో ఉండి చికిత్స తీసుకోవాలని సూచించారు.

మూడు పాజిటివ్‌ కేసుల నమోదు 

ముండ్లమూరు : ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి సీహెచ్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. పసుపుగల్లు రెండు, వేముల ఒకటి చొప్పున వచ్చినట్టు చెప్పారు.

Updated Date - 2021-06-19T07:13:21+05:30 IST