బకాయిలకు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2022-06-20T04:31:18+05:30 IST

2013లో వేతనసవరణ చేయాల్సి ఉండగా

బకాయిలకు మోక్షమెప్పుడో?
బాండ్‌ పేపర్లతో ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ కార్మికులకు అందజేసిన బాండ్‌ పేపర్లు

  • వేతన సవరణకు సంబంధించిన డబ్బు చెల్లింపులో సర్కారు నిర్లక్ష్యం
  • ఏడేళ్లు గడిచినా అందని బకాయిలు
  • కష్టాల్లో ఆర్టీసీ కార్మికులు
  • ఎదురుచూపుల్లో 47వేల మంది కార్మికులు 


షాద్‌నగర్‌, జూన్‌, 19: 2013లో వేతనసవరణ చేయాల్సి ఉండగా 2015లో వేతనసవరణ ఒప్పందాన్ని చేసుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 44 శాతం పే స్కేల్‌తో రాష్ట్రంలోని 47వేల మంది కార్మికులతో వేతనసవరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒప్పందం ప్రకారం కార్మికులకు మూడు విడతలుగా 2013లో ఉన్న బకాయిలను మూడు దశల్లో కొంతమేరకు చెల్లించారు. అనంతరం తమ వద్ద డబ్బులు లేవంటూ చేతులెత్తేసిన సర్కారు.. మిగతా డబ్బులు ఐదేళ్ల కాలపరిమితితో 8.5శాతం వడ్డీతో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇందుగాను 2015 అక్టోబర్‌ 1వ తేదీన కార్మికులకు చెల్లించాల్సిన డబ్బులకు సంబంధించి బాండ్‌ పేపర్లు ఇచ్చారు. ఇచ్చిన బాండు పేపర్ల గడువు 2020  అక్టోబర్‌ 1తోనే ముగిసి పోయింది. కానీ కాలపరిమితి ముగిసి ఒక్కటిన్నర సంవత్సరం దాటుతున్నా బకాయిల చెల్లింపు జరగలేదు. మరోవైపు కార్మికులకు ఇచ్చిన బాండ్లు శిథిలమైపోతున్నాయి. కొందరి బాండ్‌ పేపర్లను ఎలుకలు కొరికి అధ్వాన్నంగా తయారైనా తమ బకాయిలకు మోక్షం లభించడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అప్పుల్లో కార్మికులు 

కరోనా కారణంగా సంస్థ నష్టాల్లో ఉందంటూ వేతనాలు కూడా సక్రమంగా చెల్లించలేదు. దీంతో మధ్య తరగతి కుటుంబాలైన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది తమ కుటుంబాల పోషణ కోసం అప్పులు చేశారు. బాండ్ల రూపంలో ఉన్న డబ్బులు వస్తాయనే ధీమాతోనే అప్పులు చేశామని పలువురు ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. కాలపరిమితి దాటిన తర్వాత తమ డబ్బులు చెల్లించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, చేసిన అప్పులకు వడ్డీలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కనీసం కార్మిక సంక్షేమ నిధి (సీసీఎస్‌) నుంచైనా తీసుకున్న రుణాలు చెల్లిద్దామనుకుంటే... దాని ద్వారా కూడా డబ్బులు ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సిబ్బంది కొరత వల్ల పనిభారం పెరిగింది. ఒక్కో డ్రైవర్‌, కండక్టర్లు డబుల్‌ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో తమ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. బాండ్లరూపంలో ఉన్న డబ్బులను తమకు చెల్లిస్తే ఉద్యోగాలు మానుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని షాద్‌నగర్‌ డిపోలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు తెలిపారు. కేవలం ఈ డబ్బుల కోసమే అష్టకష్టాలు పడుతూ ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. 


దగా పడిన కార్మికులు 

కేవలం వేతనసవరణ విషయంలోనే కాదు.. అన్నింటా కార్మికులు ప్రభుత్వ మోసానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014 నుంచి ఇప్పటి దాకా ఎన్‌క్యా్‌షమెంట్‌ లీవ్స్‌ (ఈఎల్స్‌) కింద ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వలేదని కార్మికులు తెలిపారు. ఆరునెలలకు ఒకసారి పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకనుగుణంగా ఇచ్చే డీఏ కూడా చెల్లించడం లేదు. పండగ బోన్‌సలూ ఎత్తేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల అవసరాలు, వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో ఉన్న రూ. 608 కోట్లు ఉన్నా వడ్డీ రూ. 254 కోట్ల వడ్డీ కూడా చెల్లించడం లేదు. ఆ డబ్బులను ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే 2017- 2021లో జరగాల్సిన వేతన సవరణ కూడా ఇప్పటి దాకా జరగలేదు. కార్మికులకు ఐదు డీఏలు చెల్లించాల్సి ఉందని, దాని గురించే ఎవరూ నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు 2019లో కార్మికులు చేసిన సమ్మె తర్వాత రెండేళ్ల వరకు యూనియన్లపై నిషేధం విధించారు. వాటిస్థానంలో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేశారు. కానీ దానివల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని, దాన్ని రద్దు చేసి తిరిగి యూనియన్లను కొనసాగించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. 


డబ్బులు చెల్లించాలి

బాండ్ల కాలపరిమితి దాటి ఏడాదిన్నర అవుతుంది. వెంటనే డబ్బులను చెల్లించాలి. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ, ఈఎల్స్‌ డబ్బులను కూడా చెల్లించాలి. డీఏ ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు.  

- స్వాములయ్య. టీజేఎంయూ సంయుక్త కార్యదర్శి


వేతన సవరణ చేపట్టాలి 

పాత బకాయిలను చెల్లించి 2017-2021 వేతన సవరణ చేపట్టాలి. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో పే స్కేల్‌ తక్కువ. ఆర్టీసీలో నియామకాలు చేపట్టకుండా ఉన్నవారిపైనే భారం మోపుతు న్నారు. ఒత్తిళ్లను తట్టుకోలేక కార్మికులు చనిపోతున్నారు. 

- మహేష్‌, డ్రైవర్‌, షాద్‌నగర్‌



Updated Date - 2022-06-20T04:31:18+05:30 IST